శ్రీ మహావిష్ణువు వెలసిన ఆలయాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే విష్ణువు చెన్నకేశవస్వామిగా వెలసిన మొట్ట మొదటి ఆలయంగా ఇది ప్రసిద్ధిగాంచింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఎలా వెలిసాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం నందు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం కలదు. ఇక్కడ వెలసిన స్వామిని చెన్నకేశవుడు అని, అమ్మవారిని మహాలక్ష్మి అని పిలుస్తారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో గల ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది. అయితే ప్రపంచంలోనే మొట్టమొదట నిర్మించబడిన చెన్నకేశవ ఆలయం ఇదే. ఇది చాలా ప్రాచీన ఆలయం. చెన్నకేశవుడు అనగా అందమైన కేశవుడు అని అర్ధం. అలాంటి చెన్నకేశవుడు భూమిపై మొట్టమొదట ఈ క్షేత్రం నందే వెలిసాడు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే, శ్రీ చెన్నకేశవస్వామి మూలవిరాట్టు శంఖు, చక్ర కౌమిధిలతో పాటు ఆదిశేషుని ఆయుధంగా ధరించి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మూలవిరాట్టుకు ఇరువైపులా శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ మార్కాపురం ఒక్కో యుగంలో ఒక్కొక్క పేరుతో పిలువబడింది. కృతయుగంలో గజారణ్యమని, తేత్రాయుగంలో మాధవపురి అని, ద్వాపరయుగంలో సోపామానమని, కలియుగంలో మరికాపురముగా ప్రసిద్ధిగాంచింది. ఇక స్థల పురాణానికి వస్తే, కృతయుగం కంటే ముందు అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అరణ్యప్రాంతంగా ఉండేది. మహర్షులు ఇక్కడనే తపస్సు ఆచరించేవారు. వాళ్ల తపస్సు భంగం చేసేందుకు రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అప్పుడు మహర్షుల కోరిక మేరకు శ్రీహరి ఇక్కడ చెన్నకేశవుడిగా స్వయంభువుగా వెలిశాడు. అమ్మవారు రాజ్యలక్ష్మిగా అవతరించింది. ఇక కృతయుగంలో ఈ ప్రాంతంలో ఉండే ఏనుగులు స్వామిని గుండికనది నీటితో అభిషేకించేవట అందుకే దీనికి గజారణ్యం అనే పేరు వచ్చినది. తేత్రాయుగంలో గౌతమ మహర్షి, స్వామికోసం ఇక్కడే తపస్సు చేసాడు. ద్వాపరయుగంలో రాక్షసుల బాధలకు తట్టుకోలేని దేవతలు చెన్నకేశవుడిని పూజించారట. అందుకే దీనిని స్వర్గసోపానం అనే పేరు వచ్చిందని పురాణాలూ చెబుతున్నాయి. ఇలా శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా చెన్నకేశవస్వామిగా వెలసిన ఈ ఆలయంలో ప్రతి చైత్ర శుద్ధ చతుర్దశి నుంచి 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.