భారతదేశం దేవాలయాలకు ప్రసిద్ధి. మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో వెలసిన ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత అనేది ఉంది. అయితే మన దేశం మొత్తంలో ఎత్తైన ఆలయ శిఖరాలు కలిగిన కొన్ని ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ పానకాల లక్ష్మి నరసింహ స్వామి ఆలయం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామివారికి పానకం అంటే ఎంతో ప్రీతి. భక్తులు స్వామివారికి పానకం సమర్పిస్తుంటే “గుట గుట” శబ్దం వినిపిస్తుంటుంది. ఈ శబ్దం ఆగేసరికి పానకం వెలికి చిమ్ముతుంది. ఇక్కడ విశేషం ఏంటి అంటే రోజు బిందల కొలది పానకం స్వామివారికి సమర్పించిన ఇక్కడ కనీసం ఒక చీమ కూడా కనిపించదు. ఇలా స్వామివారు పానకం తాగడం వెనుక రహస్యం ఏంటి అనేది ఇప్పటికి అంతు చిక్కదు. ఇది ఇలా ఉంటె దేశంలోనే ఎత్తైన ఆలయ శిఖరాలలో ఈ ఆలయం గోపురం కూడా ఒకటి. ఇది 11 అంతస్థులతో 157 అడుగుల ఎత్తులో ఉంటుంది.
శ్రీ మధుర మీనాక్షి దేవాలయం:
తమిళనాడు రాష్ట్రంలోని మధురై లో ఉన్న మీనాక్షి దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. వేగై నది ఒడ్డున 6 వ శతాబ్దంలో పాండ్య రాజైన కులశేఖరుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ మీనాక్షి ఆలయం భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయలో ఒకటి. ఈ ఆలయం 283 గజాల పొడవు, 243 గజాల వెడల్పుతో ఒక పెద్ద కోట లాంటి ఆవరణలో ఉంది. ఈ ఆలయ గోపురం 160 అడుగుల ఎత్తులో ఉంటుంది.
శ్రీ సారంగపాణి దేవాలయం:
తమిళనాడులోని కుంభకోణం లో గల ఆది కుంభేశ్వరస్వామి దేవాలయానికి ఎదురుగా శ్రీ సారంగపాణి దేవాలయం ఉంది. ఈ ఆలయం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది అని చెబుతారు. ఇది వైష్ణవ దేవాలయం. మూడు ముఖ్యమైన విష్ణువు దేవాలయాలలో ఇది కూడా ఒకటి. శ్రీరంగం, తిరుపతి తరువాత వైష్ణవ భక్తులు ఎక్కువగా సందర్శించే ఆలయం ఇదేనని చెబుతారు. దీని గోపురం సుమారు 146 అడుగుల ఎత్తు, 12 అంతస్తులు కలిగి ఉంటుంది.
ఏకాంబరనాథర్:
తమిళనాడులోని కాంచీపురం లో ఈ ఆలయం ఉంది. ఈ ఏకాంబరేశ్వర దేవాలయంలో శివుడు కొలువై ఉన్నాడు. పంచభూత క్షేత్రాలలో ఇది ఒక క్షేత్రంగా వెలుగొందుచున్నది. ఈ ఆలయ గోపురం 190 అడుగులు ఉంటుంది.
అలఘర్ కోయిల్:
తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో మధురైకి 20 కీ.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి కూర్చొని, నిల్చొని, పడుకొని మూడు భంగిమల్లో దర్శనం ఇస్తాడు. ఈ దేవాలయం 2 ఎకరాల్లో ఉండి ఆలయ గోపురం 187 అడుగులు ఉంటుంది.
శ్రీకంఠేశ్వర స్వామి ఆలయం:
కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న నంజన్ గుడ్ లో ఈ దేవాలయం కలదు. ఈ ఆలయ గోపురం ఎత్తు – 120 అడుగులు. ఇక్కడ ఉన్న శ్రీకంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపు లేనివారికి చూపు వస్తుందని భక్తుల నమ్మకం. అయితే టిప్పు సుల్తాన్ తన పట్టపుటేనుగు చూపు కోల్పోతే, ఈ స్వామిని ప్రార్ధించాడని దాంతో ఏనుగుకు చూపు వచ్చిందని స్థానిక కధనం.
తిరువిక్రమ పెరుమాళ్:
ఈ ఆలయం రెండువేల సంవత్సరాల క్రితం పల్లవ రాజుల చేత నిర్మించబడింది. ఈ ఆలయంలో నాలుగు స్థంబాలు ఉన్నాయి. అందులో తూర్పు వైపుగా ఉన్న స్థంభం 195 అడుగుల ఎత్తు ఉంది. ఈ స్థంభం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన స్థంబాలలో మూడవది అని చెబుతారు. ఈ విధంగా దేశంలోనే ఎత్తైన ఆలయ శిఖరాలు ఉన్న కొన్ని ఆలయాలుగా వీటిని చెప్పుకోవచ్చు.