Home Unknown facts శివతాండవాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా చిత్రించిన స్థలం

శివతాండవాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా చిత్రించిన స్థలం

0

పూర్వం కుట్రాల ప్రాంతంలో శుంభని, శుంభులు శివుని వల్ల అనేక రకాల వరాలను పొందుతారు. పురుషులవల్ల మరణం రాకుండా వరాన్ని పొందిన వారు అందరినీ బాధపెడుతుండేవారు. దీంతో మునులందరూ ప్రార్థించగా ఆదిపరాశక్తి వారిద్దరిని సంహరిస్తుంది. ఇదంతా గమనించిన శుంభని, శుంభుల గురువు ఉదంబరునికి కూడా భయం పుడుతుంది. తనను కూడా పరాశక్తి ఎక్కడ అంతం చేస్తుందోనన్న భయంతో కునుకులేకుండా వుండేవాడు. ఆమెనుంచి తప్పించుకోవడానికి ఉపాయం కోసం యముడిని ఆశ్రయిస్తాడు.

ధరణీ పీఠంఉదంబరుని పరిస్థితిని అర్థం చేసుకున్న యముడు కుట్రాలం పక్కనేవున్న ఒక పర్వత అరణ్యంలో దాక్కుని వుండమని చెప్పాడు. అలా దాక్కున్న ఉదంబరుడు పగలంతా ఎవరికీ తెలియకుండా లోపలేవుండి.. రాత్రి అవగానే బయటకు వచ్చి జీవులను హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుని బాధలు తట్టుకోలేక మునీశ్వరులు దేవిని ప్రార్థించగా ఆమె ఆ రాక్షసుని, అతని పరివారంతో అంత మొందించింది. అనంతరం ఆ మునులతో దేవి ‘‘మీకు తోడుగా నేను కూడా ఇక్కడే కొలువై వుంటాను’’ అని ఓ చెట్టు కింద ధరణీపీఠ నాయకిగా కొలువై వుంది.

ఈ పవిత్రప్రదేశం కుట్రాలం జలపాతానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడున్న తీర్థాన్ని దేవి పేరుతో శెన్బగతీర్థం అంటారు. అమ్మవారి ఆలయానికి పైబాగంలో ‘‘శివమధుగంగ’’ అనే జలపాతం వుంది. ఇక్కడ గంగాదేవి, శివలింగానికి తేనెతో అభిషేకం చేయించడంవల్ల దీనికి ‘‘శివమధుగంగ’’ అనే పేరు ఏర్పడిందని అంటారు. ఇక్కడ పౌర్ణమిరోజున పసుపువర్ణంతో కూడిన వర్షం పడుతుందని పెద్దలు చెబుతుంటారు.

పరమశివుడు ఐదుచోట్ల తాండవనృత్యం చేశాడని విశ్వసిస్తారు. స్వామివారు నృత్యం చేసిన సభను చిత్రసభగా పిలుస్తారు. ఈ చిత్రసభ, మిగతా వాటికంటే ఎంతో భిన్నమైంది. మిగతా వాటిలో శివుడు విగ్రహరూపంలో గోచరిస్తుండగా ఇక్కడ మాత్రం చిత్రరూపంలో దర్శనమిస్తాడు.

చిత్రసభలో పరమశివుడు దేవేరితోపాటు తాండవం చేస్తుండగా.. ఆ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు ఒక గోడపై చిత్రీకరించాడని పురాణకథనం. మార్గశిర మాసంలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. తమిళనాడులో ఈ కుట్రాల పుణ్యస్థలం పర్యాటకకేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

 

Exit mobile version