పురాణాల ప్రకారం పరమశివుడి తాండవం నుంచే ఈ సమస్త సృష్టి ఉధ్భవించింది. సృష్టి మొదట్లో అనంతదిగంతాలకు వ్యాపించిన ఈ సువిశాల విశ్వమంతా ప్రళయకాల ప్రభంజనాలతో ప్రజ్వరిల్లుతూ ఉంది. విశ్వవ్యాప్తమైన కోటానుకోట్ల గోళాలు, గ్రహమండలాలు అపరిమితమైన వేగంతో ప్రయాణిస్తూ అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్నాయి.
ఎటుచూసిన సప్తవర్ణాల కాలాగ్నిశిఖలు పెనుఉప్పెనలైన బడబాగ్ని(లావా) సముద్రాలు… అలా ఎన్నో కోట్లసంవత్సరాల పాటు విళయప్రళయాలు సృష్టించిన ఈ విశ్వాంతరాళం క్రమక్రమంగా ప్రశాంత వాతావరణాన్ని సంతరించుకుంది.
అప్పటివరకు అరుణారుణ కాంతులతో దావానంలా దహించబడిన ఈ సువిశాల విశ్వమంతా నీలిరంగును సంతరించుకుని, అంధకార శున్యాప్రదేశంగా ఏర్పడి, మొట్టమొదటగా ప్రణవనాదమైన ‘ఓం’కారం పుట్టింది. ‘ఓం’కారమే గణపతి. సృష్టిలో మొదట వచ్చినవాడు గణనాయకుడు, విఘ్నవినాయకుడు. గణపతి వక్రతుండం ఓంకారానికి సంకేతం. ప్రతి మనిషి మౌనంగా ధ్యానంలో కూర్చుంటే వినిపించే శబ్దం ఓంకారం. నిశబ్దంలో ఉండే శబ్దం కూడా ఓంకారమే.
అసలు గణపతి తత్వమే ఓంకారం. ఈ సృష్టిలో భూమి మొదలైన గ్రహాలు తమ చుట్టు తాము తిరగడం వల్ల పుట్టే శబ్దం ఓంకారం. సూర్యుడిలో వచ్చే సౌరతుఫానుల శబ్దాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు రికార్డు చేసారు. ఆ శబ్దం కూడా ఓంకారం. ఈ సృష్టి అంతా ఓంకారమే ఉంది. ఓంకారం రూపంలో గణపతి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు.