Home Unknown facts శంకరుడి స్వేదబిందువు నుంచి ఉద్భవించిన జ్వరుడు ఎవరో తెలుసా ?

శంకరుడి స్వేదబిందువు నుంచి ఉద్భవించిన జ్వరుడు ఎవరో తెలుసా ?

0

పురాణాలలోని అనేక అంశాలను భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశిస్తున్నాడు, ఈ అంశాలలో జ్వరం ఎక్కడినుండి ప్రారంభమైంది అనే కథ కూడా మనకు కనిపిస్తుంది. మనుషులకైనా, పశువులకైనా, మరే ఇతర ప్రాణులకైనా జ్వరం రావటం మానవ వైద్యశాస్త్రంలోనూ, పశు వైద్య శాస్త్రంలోనూ కనిపిస్తుంది. వీటికి వైద్య చికిత్సలు తీసుకోవడం కూడా సహజమే..

Dakshayagnamఅయితే ఈ జ్వరం అనేది ఒక జ్వరుడు అనే వాడి రూపాంతరమేనని, జ్వరుడి ఆవిర్భావానికి వేదిక దక్షయజ్ఞమే అయిందని పౌరాణికగాథలు వివరిస్తున్నాయి.

దక్షయజ్ఞంలో సతీదేవికి జరిగిన అవమానం, ఆమె అగ్నికి ఆహుతి కావటం, ఆ తరువాత పరమేశ్వరుడు తన ప్రమథగణాలను పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయటం అందరికి తెలిసిన కథే. దక్షుడి యజ్ఞం అలా ధ్వంసమైనప్పుడు ఆ యజ్ఞం ఒక మృగరూపాన్ని ధరించి ఆకాశానికి ఎగిసి పరుగెత్తడం ప్రారంభించింది. పరమేశ్వరుడు దాన్ని చూసి తన బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి నుదిటి నుంచి ఒక చెమట బిందువు నేలమీద పడింది.

వెంటనే ఒక అగ్ని పుట్టుకొచ్చింది, ఆ అగ్ని నుంచి నిప్పుకణికల్లా మండి పోతున్న ఎర్రటి కళ్ళతోనూ, పచ్చని మీసాలతోనూ, విరబోసుకుని ఉన్న కేశాలతోనూ, నల్లని శరీరఛాయతోనూ, సూదులలాగా నిక్కపొడుచుకుని శరీరం మీద వెంట్రుకలతోనూ ఉండి, ఎర్రటి వస్త్రాన్ని ధరించిన ఒక భీకర ఎప్పుడైన పురుషుడు ఉద్భవించాడు.

వెంటనే ఆ పురుషుడు యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఉన్న దేవతల మీదకూడా విరుచుకుపడ్డాడు. ఆ బాధలను తట్టుకోలేక దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వచ్చి తమను కాపాడమని వేడుకున్నారు. బ్రహ్మ వారందరితో కలిసి వెళ్ళి శివుడిని ప్రార్థించారు. శంకరుడి స్వేదబిందువు నుంచి ఉద్భవించిన జ్వరుడు అనే ఆ ఘోర పురుషుడి బాధ నుంచి తమకు విముక్తిని ప్రసాదించమని మునులు, ఋషులు, దేవతలు అనేక విధాలుగా పరమేశ్వరుడిని వేడుకోవడంతో శివుడు శాంతించి తన నుంచి ఆవిర్భవించిన జ్వరుడిని అనేక భాగాలుగా విభజించాడు.

జ్వరుడి నుండి ఏర్పడిన భాగాలే అధిక సంఖ్యాకమైన జ్వరాలయ్యాయి. ఆ జ్వరాలు కొన్ని ప్రాణులకు ప్రాణాంతకమైన వ్యాధులుగాను, శరీరభాగాలుగాను రూపొందాయి. నాగజాతికి శిరోవేదనగానూ, సాధారణ సర్పాలకు కుబుసాలుగానూ, పర్వతాలకు శిలాజిత్తుగానూ, నీటికి పాచిగానూ, ఎద్దుల వంటి జంతువులకు డెక్కల చీలికలగానూ, భూమికి చవుడుగానూ, ఇతర పశువులకు దృష్టి దోషంగానూ, గుర్రాలలో గొంతువాపుగానూ, నెమళ్లల్లో పింఛాలుగానూ, చిలుకలకు ఎక్కిళ్ళుగానూ, మానవజాతికి జ్వరంగానూ ఏర్పడింది.

మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకు అనేక సందర్భాల్లో, అనేక పేర్లతో ఈ జ్వరం సంక్రమిస్తుంటుంది. ఇలా జ్వరం అనేది దక్షయజ్ఞంనాడు ఆవిర్భవించిందని, జ్వరాలలో మహేశ్వరజ్వరాలు, వైష్ణవజ్వరాలు అను కూడా ఉంటాయని అనేక పురాణాలలో తెలుస్తుంది.

Exit mobile version