మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకని మాత్రమే తెలుసు కాని ” వినాయకుడు ” అనే పదానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటంటే ” నాయకుడు లేనివాడు ” అని అర్థం. అంటే తనకు తనే నాయకుడు అని.
- ‘త్వమేవాహమ్’, ‘అహంబ్రహ్మోసి’ అన్న భావమే అది. అందుకే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతినే పూజ చేస్తారు పూజారులు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు తప్పకుండా ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా, ఆ కార్యం దిగ్విజయంగా పూర్తవ్వాలని మొదటిగా ఆ విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహిస్తారు.
- ఈ విధంగా పూజలు నిర్వహించడం ద్వారా మన జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
- కొన్ని సార్లు మన జీవితంలో ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యలకు పరిహారంగా వినాయకుడికి పూజలు నిర్వహించాలి. అయితే సంకష్టహర చతుర్దశి రోజు ఈ పూజలు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.అయితే ఆరోజు ఎప్పుడు వస్తుంది? పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.
- తిథులలో వినాయకుడికి ఎంతో ఇష్టమైనది చవితి. అయితే ఈ చవితి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది. ఒకసారి అమావాస్య తరువాత, పౌర్ణమి తరువాత ఈ తిథులు వస్తాయి. అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అని అంటారు. అలాగే పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని అంటారు.
- వరద చతుర్థి వ్రతాన్ని కేవలం వినాయకచవితి రోజు మాత్రమే నిర్వహించి పూజలు చేస్తారు. సంకటహర చతుర్థి వ్రతం మంగళవారం రోజున వస్తే దానిని అంగారక చతుర్థి అని కూడా అంటారు. ఇది ఎంతో శుభకరమైన చతుర్థి. ఈ రోజు వినాయకుడికి వ్రతం చేసేవారు రోజంతా కఠిన ఉపవాసాలు ఉండి పూజ చేయటం ద్వారా వారి జీవితంలో ఏర్పడినటువంటి కుజ దోషాలు తొలగి పోవడమే కాకుండా, చేసేటటువంటి పనులలో ఆటంకములు అన్ని తొలగిపోయి, ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో విజయాలను అందుకుంటారు.
అయితే ఈ వ్రతాన్ని ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో వ్రతాన్ని నిర్వహించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.