సాధారణంగా ప్రతిఒక్కరు ఉదయాన్నే లేవగానే ముందుగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని, ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. మరికొందరు ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేసుకుని, దేవాలయాలకు వెళుతుంటారు. ప్రత్యేక రోజుల్లో, పండుగలకు చాలామంది ఆలయాలకు వెళ్తుంటారు. కానీ చాలామంది ఇలా నేరుగా దేవాలయాలకు వెళ్లి దేవతలను ప్రార్థించుకోవడం ద్వారా మానసిక శాంతి లభిస్తుందని విశ్వసిస్తారు.
పైగా దేవుడిని ఏవైనా కోరికలు కోరినా, అవి వెంటనే నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు ఎక్కువగా దేవాలయాలకు వెళ్లడానికి మక్కువ చూపిస్తారు. అయితే దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని నియమనిబంధనలు, శాస్త్రాలప్రకారంకొన్ని ఆచారాలను పాటించాల్సి ఉంది. ఎందుకంటే సహజంగా ప్రతిఒక్కరు దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడతారు.
కోరిన కోరికలు త్వరగాతీరాలనే కాంక్షతో విగ్రహానికి ముందుగా నిటారుగా నిలబడిపోతారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు పండితులు. దేవతా విగ్రహానికి సూటిగా కాకుండా కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా దేవానుగ్రహం లభిస్తుంది.
అదెలా అంటే దేవతావిగ్రహాల నుంచి వెలువడే దివ్యకిరణాలు శక్తి తరంగాల రూపంలో ప్రవహిస్తూ భక్తుని దగ్గరకు చేరుకుంటాయి. అటువంటి సమయంలో మానవదేహం విగ్రహానికి సూటిగా నిలబడితే ఆ దివ్యకిరణాలను తట్టుకోవడం అసాధ్యం. కొన్ని సందర్భాలలో అది హానికరంగా మారవచ్చు. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా ఎడమ లేదా కుడివైపున నిలబడి ప్రార్థిస్తే దైవానుగ్రహం లభిస్తుంది.
అందుకే గుడిలో భక్తులు నేరుగా వెళ్లకుండా ఎడమవైపు కానీ కుడి వైపు కానీ దారి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా దేవుడిని ప్రార్థించే సమయంలోరెండు చేతులను జోడించి, భక్తిశ్రద్ధలతో స్మరించుకోవాలి. ఇలా జోడించడం వల్ల మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. దాంతో శారీరకబలం, బుద్ధిబలం, ఆత్మవిశ్వాసంతోపాటు ఎంతో ఆరోగ్యకరంగా కూడా వుంటారు.