హిమాలయాల్లో సముద్రమట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇక్కడ వెలసిన ఆలయం బదరీనాథ్ కి సింహద్వారం అని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి ప్రాంతంలో ఉన్న ఆ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్ రాష్ట్రం, హృషీకేశ్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో జోషిమఠ్ అనే పవిత్ర క్షేత్రం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం చుట్టూ మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణులు ఉన్నాయి. ఈ ప్రదేశం నుండి బదరీనాథ్ 48 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం 108 దివ్యతిరుపతిలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచినది.
ఇక పురాణానికి వస్తే, కుబేరుడు తపస్సు చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు. అయితే అలకనంద నది తీరంలో కొంత దూరం వెళితే నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి కొంత దూరంలో ఒక కుండం ఉంది. దీనినే దండధార తీర్థం అంటారు. ఇక్కడే శ్రీ శంకరాచార్యుల వారి మఠం ఉంది. దీనిని జ్యోతిర్మఠం అంటారు.
ఈ మఠం ప్రాంగణంలోనే కల్పవృక్షం అనే వృక్షం ఉంది. ఈ వృక్షం దాదాపుగా రెండు వేల నాలుగు వందల సంవత్సరాల కాలం నాటిదిగా చెబుతారు. ఈ చెట్టు మొదలు సుమారుగా 40 అడుగులు ఉంటుంది. అయితే ఆది శంకరాచార్యుల వారు ఈ చెట్టు క్రిందే కూర్చొని తపస్సు చేయగా, ఆయనకు ఆత్మసాక్షాత్కారం లభించినది. ఇంకా ఆయనకి బ్రహ్మ జ్ఞానం ఒక జ్యోతిరూపంలో కనిపించిందట. అందుకే ఈ మఠానికి జ్యోతిర్మఠం అనే పేరు వచ్చింది.
ఇక్కడి కల్పవృక్షం దగ్గరే ఒక శివాలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న విగ్రహమూర్తి కేదార్నాథ్ ఆలయంలో ఉన్న మూర్తి ఆకారంలోనే ఉంటుంది. ఇది ఇలా ఉంటె బదరీనాథ్ లో నారాయణుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి, నరసింహస్వామి రూపంలో ఇక్కడ వెలిశాడని చెబుతారు.