Home Unknown facts గణేశుడికి చింతామణి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా..?

గణేశుడికి చింతామణి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా..?

0
వినాయకుడు పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపం. తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించేందుకు మార్గ నిర్దేశం చేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి ప్రత్యేకతలు వినాయకుడిలో చాలా ఉన్నాయి.
 వినాయకునికి అనేక నామాలున్నాయి. అందులో ఒక నామం ‘చింతామణి’. ఈ నామం ఆయనకు ఎలా వచ్చిందనేది చాలా మందికి తెలియదు.
అభిజిత్‌ అనే మహారాజుకు ఘనుడు అనే కుమారుడు ఉండేవాడు. అతడు చాలా దుష్టుడు. నిస్సహాయులైన ప్రజలు, మునులను ఘనుడు నానా బాధలుపెట్టేవాడు.
 ఒకసారి అడవిలో వేటకు వెళ్లిన అతడు కపిలముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అతడికి కపిలముని అతిథి సత్కారాలు చేసి భోజనానికి ఆహ్వానించాడు. ‘ఈ ముని ఆశ్రమంలో మాకు ఎటువంటి భోజనం లభిస్తుందని ఆలోచిస్తూ కందమూలాలు, ఆకులు అలములు వడ్డిస్తాడా? అని మనసులో అనుకున్నాడు. కాసేపటి తర్వాత కుటీరం సమీపంలో ఆసనాలు, వెండి పాత్రలు, రకరకాల ఆహారపదార్థాలతో సిద్ధం చేసి మండపం కనిపించింది.
 కపిలముని ఎంతో ప్రేమగా ఘనుడు, అతడి అనుచరులకు భోజనం వడ్డించాడు. ఆ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయిన రాజకుమారుడు.. తక్కువ సమయంలో అంత ఘనంగా ఏర్పాట్లు ఎలా చేశాడు? అని సందేహించి కపిలమునిని అడిగాడు. అప్పుడు కపిలముని.. ఒకసారి ఇంద్రునికి సాయం చేసినప్పుడు ఆయనకు నాకు చింతామణిని ప్రసాదించాడని తెలిపాడు.
 ఆ మణిని చూసిన ఘనుడు నాకు కావాలని అడిగాడు. అందుకు కపిలముని ససేమిరా అనడంతో బలవంతంగా తీసుకున్నాడు. జరిగిన దానికి చాలా బాధపడ్డ కపిలముని శ్రీమహావిష్ణువు సహాయాన్ని అర్ధించాడు. శ్రీహరి ప్రత్యక్షమై గణేషున్ని ప్రార్థించమని సలహా ఇచ్చాడు. కపిలముని ఘోర తపస్సు చేసి వినాయకుని ప్రసన్నం చేసుకున్నాడు.
 జరిగినదంతా విన్న గణేశుడు చింతామణిని తెచ్చి ఇస్తానని అభయం ఇచ్చాడు. వినాయకుడు తన పరివారాన్ని వెంటబెట్టుకుని అభిజిత్ మహారాజు రాజ్యానికి చేరుకున్నాడు. ఘనుడు తన తండ్రి మాటను పెడచెవినపెట్టి గణేషునితో యుద్ధానికి దిగుతాడు. చివరకు తన పరసుతో ఘనుడి శిరస్సును ఖండించిన వినాయకుడు చింతామణి తీసుకుని వచ్చి కపిలమునికి అందజేశాడు. అయితే, కపిలముని ఆ మణిని గణనాథుని మెడలో వేసి.. ఈ చింతామణి మీదగ్గరే ఉండనివ్వండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని చింతామణి అని కూడా పిలుస్తారని చెప్పాడు.

Exit mobile version