శ్రీహరిని తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది శేష తల్పం మీద శయనించే స్వామివారి రూపం. చాల దేవాలయాలలో అటువంటి సాలగ్రామ విగ్రహాలు దర్శనం ఇస్తాయి. అయితే స్వామి వారి శయనించే విగ్రహాలు అన్ని ఒకే రకంగా ఉండవు! విష్ణుమూర్తి శయనించే విగ్రహాలలో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందాం..
సృష్టిశయనం :
తొమ్మిది పడగలు గల శేషపానుపు పైన శ్రీహరీ, పద్మాలవంటి నయనాలతో, రాజస భావంతో, నల్లని శరీరచ్చాయతో, ఎఱ్ఱని అరికాళ్ళతో, శాశ్వతుడై సృష్టిశయన రూపంలో ఉంటాడు. లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు, రుద్రులు. ఆదిత్యులు, కిన్నెరలు, మార్కండేయ, భ్రుగు, నారద మహర్షులను, మధుకైటభులు వీరందరితో కలిగిన శయనం ఉత్తమ సృష్టి శయనమవుతుంది.
యోగశయనం :
శ్రీమహావిష్ణువు ఎర్రతామర రేకులవంటి నేత్రాలతో యోగనిద్రా సుఖములో వుంటుంది. 2 భుజాలు కలిగి, ఒక ప్రక్కగా పడుకున్నట్టు అర్థశయనంలో ఉంటుంది. ఐదుపడగల శేషుడు శంఖంలా, చంద్రునిలా తెల్లగా ఉంటుంది. దీనిమీద శయనించిన విష్ణువు గౌరశ్యామ వర్ణంతోగానీ, పీతశ్యామ వర్ణంతోగానీ ఉంటారు. ఈ విధమైన విష్ణుమూర్తి పూజాపీఠానికి కుడివైపున భ్రుగువు కానీ మార్కండేయుడు, ఎడమవైపున భూదేవి కానీ మార్కండేయ మహర్షి ఉంటారు. మధుకైటభులు, బ్రహ్మదేవుడు, పంచాయుధాలు, నమస్కరిస్తున్న మహర్షులు ఉంటారు.
భోగశయనం :
ఈ శయన రూపంలో శ్రీమన్నారాయణుడు సకలపరివారంతో కూడి ఏడు పడగల శేషునిలో పడుకొని ఉంటాడు. ఈ స్వామి నాభినుండి వికసించిన తామరపువ్వులో కూర్చున్న బ్రహ్మ బంగారు రంగు కలవాడై ఉంటాడు. బ్రహ్మకు రెండు ప్రక్కల శంఖము, చక్రం, గద, ఖడ్గం, శార్జ్గం అనే పంచాయుధాలు, పద్మం, వనమాల, కౌస్తుభం కలిపి అష్టాయుధాలు కలిగి ఉంటాడు. ఆ ఆయుధాల ముందు గరుత్మంతుడు ఉంటాడు. స్వామి కుడిచేతి ప్రక్కన లక్ష్మీదేవి, కుడి పాధం ప్రక్కన సరస్వతి, ఎడమపాదం ప్రక్కన భూదేవి ఉంటారు. సూర్యచంద్రులు, తుంబురనారదులు, సప్తఋషులు, అప్సరసలు, లోకపాలకులు, అశ్వనీదేవతలు ఉంటారు. పాదాల దగ్గర మధుకైటభులు ఉంటారు. శ్రీవారు సస్యశ్యామల వర్ణంతో, అర్థశయనంతో, యోగనిద్రా రూపంతో, నాలుగు భుజాలతో, వికసించిన ముఖంతో, తామర రేకులవంటి నేత్రాలతో పూర్ణచంద్రుని వంటి ముఖంతో దర్శనమిస్తాడు.
సంహారశయనం :
శ్రీమన్నారాయణమూర్తి రెండు పడగల శేషుని పానుపుగా చేసుకుని గాఢనిద్రలో, మూసిన కన్నులతో, తామస భావాన్ని వ్యక్తం చేసి మూడు కన్నులతో, వాడిన ముఖం సర్వాంగాలతో నల్లని వస్త్రాలతో, రెండు భుజాలతో, నల్లని శరీర కాంతులతో, రుద్రుడు మొదలైన దేవతలా రూపంతో ఉంటాడు. స్వామి వారి రూపాల్లో ఇది కొంచం రౌద్రం గా కనిపిస్తుంది.