Home Unknown facts భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు ఎలా తయారు చేస్తారో తెలుసా ?

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు ఎలా తయారు చేస్తారో తెలుసా ?

0

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం ఉన్నంతలో వైభవంగా జరిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం ఈ కల్యాణోత్సవాన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు. గతేడాది లాగే ఈసారి కూడా అలాగే నిర్వహించారు. ప్రతి సంవత్సరం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత కల్యాణ వేదికలో ఈ వేడుకను జరిపేవారు. 2020లో మాత్రం లాక్‌డౌన్ కారణంగా తొలిసారి రామయ్య కల్యాణాన్ని అంతరంగికంగా నిత్యకల్యాణ మండపంలో జరిపారు. ఈసారి కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభించింది కాబట్టి ఇప్పుడు కూడా నిత్య కల్యాణ మండపంలోనే ఈ వేడుకను హంగామా లేకుండా జరిపారు. కరోనా మనుషుల ప్రాణాలను బలిగొనడం తో పాటుగా మనిషికి ఆధ్యాత్మికతను, ఆలయ దర్శాన్ని, లోక కళ్యాణం కోసం చేసే రాముల వారి కల్యాణాన్ని కూడా టీవీ ల ముందు కూర్చొని చూసేలా చేసింది.

Bhadradri Ramayana Kalyanaప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తుల సమక్షంలో రాముల వారి వేడుకలు అంబరాన్నంటేవి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఊర్లో శ్రీరామనవమి వేడుకలు చేస్తారు. ప్రతి హిందూ తన ఇంట్లో కళ్యాణం లా భావిస్తాడు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాచలం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అంగరంగ వైభవంగా జరిగే భద్రాచల రాములవారి కల్యాణానికి భక్తులు తమకు తోచినంత కానుకలు సమర్పించుకుంటారు. స్వామివారికి ముత్యాలు, తలంబ్రాలు ఎంతో భక్తితో సమర్పిస్తారు.

అయితే భద్రాచలంలోని రాములవారి కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలు గోటితో ఒలిచి తయారు చేయడం విశేషం. ఏటా శ్రీరామనవమి రోజున గోటితో వలిచిన కోటి తలంబ్రాలను తూర్పు గోదావరి జిల్లా నుంచి భద్రాచలం తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వచ్చే శ్రీరామనవమికి తీసుకొచ్చే వరి ధాన్యాన్ని పండించేందుకు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గోటి తలంబ్రాల పనులకు శ్రీకారం చుట్టారు.

కేవలం భద్రాచలం లో మాత్రమే కాకుండా ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణానికి కూడా అక్కడి నుండే తలంబ్రాలు పంపిస్తారు. సీతారామచంద్రస్వామికి, ఒంటిమిట్ట కోదండరామయ్యకు గోటి తలంబ్రాలను సమర్పించేందుకు వరి విత్తనాలకు ఇటీవలే భద్రాద్రి రామయ్య సన్నిధిలో పూజలు జరిపామని సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు తెలిపారు. ఆ విత్తనాలను గోకవరంలోని తమ భూమిలో పండిస్తామన్నారు.

భద్రాచలంలో ఏటా శ్రీరామ నవమి నాడు శ్రీసీతారామచంద్రస్వామికి నిర్వహించే కల్యాణోత్సవంలో గోటి తలంబ్రాలను ఉపయోగించే సంప్రదాయం కొన్నేళ్ల నుంచి కొనసాగుతోంది. గోటి తలంబ్రాలను తూర్పు గోదావరికి చెందిన భక్తులు సమర్పిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాల కార్యక్రమానికి ఉడతాభక్తి తలంబ్రాలని నామకరణం చేశారు. దశాబ్దం క్రితం ఈ పుణ్య కార్యక్రమానికి ఆ సంఘం శ్రీకారం చుట్టింది. అయితే, వీటిని అందించేందుకు ఎంతో నియమ నిష్టలతో సాగు చేస్తారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరిగే భద్రాద్రి రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలకు వరి సాగు ప్రారంభించారు. నారుపోయడానికి వినియోగించే నాణ్యమైన ధాన్యాన్ని ప్రత్యేక కలశాలలో ఉంచి ఊరేగింపుగా భద్రాచలం తీసుకుని వచ్చి ఆలయంలో పూజలు చేశారు.

అయితే విత్తనాలను వేసే కార్యక్రమం సాదాసీదాగా జరగదు. ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్న ఉత్సవంలా చేస్తారు. ఆంజనేయుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు లాంటి వానర వీరుల వేషధారణలో ఉన్న భక్తులు నాగలిపట్టి పొలం దున్నారు. రాముడి వేషంలో ఉన్న మరో భక్తుడు విత్తనాలను ఆశీర్వదిస్తుండగా ధాన్యాన్ని చల్లారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కోటి తలంబ్రాల పంటకు అంకురార్పణ పూజలను ఘనంగా నిర్వహించారు. రామదాసు కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని గోటితో వలిచి తలంబ్రాలుగా మార్చుతారు. వాటిని భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలకు అందజేయనున్నట్లు నిర్వాహకుడు కల్యాణం అప్పారావు తెలిపారు. ఆధ్యాత్మికం ఉట్టిపడేలా ఉన్న ఈ కార్యక్రమం చూడడానికి కనుల విందుగా, భక్తులు పారవశ్యంలో మునిగిపోయేలా ఉంటుంది.

 

Exit mobile version