మనం శుభకార్యాలలో, పుట్టిన రోజు వేడుకలో వివాహాది కార్యక్రమాలలో పసుపు, బియ్యం తో కలిపిన అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటాం. అదేవిధంగా దేవాలయానికి వెళ్ళినపుడు పండితులు కూడా అక్షింతలు భక్తుల తలపై వేసి ఆశీర్వదించడం జరుగుతుంది.
అయితే పసుపు, బియ్యం కలిపిన అక్షింతలు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు? ఇంకేదైనా లేక పూలు వేసి ఆశీర్వాదం ఇవ్వొచ్చు కదా..! అనే సందేహం రాక మానదు. అయితే అక్షింతలు వాడడానికి వెనుక ఉన్న కారణం పెద్దదే అంటున్నారు పండితులు.
నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ధాన్యం ప్రతిరూపం. బియ్యం చంద్రునికి చెందిన ధాన్యం, మనసుకి కారకుడైన చంద్రుడి ప్రభావం బియ్యంపై ఉంటుంది. మానవుని శరీరం ఓ విద్యుత్ వలయం. ఆశీర్వదించేవారు చేతిలోకి బియ్యం తీసుకోగానే వారిలోని విద్యుత్ బియ్యానికి అందుతుంది.
ఆశీర్వదించే వారికి చర్మవ్యాధులు ఉంటే ఆ ప్రభావం కూడా ఆశీర్వాదం తీసుకునే వారిపై కూడా పడుతుంది. అందుకే క్రిమిసంహరకమైన పసుపుని కలిపి, కేవలం విద్యుత్ మాత్రమే స్వీకరించేలా చేసి పసుపు కలిపిన బియ్యాన్ని అనగా అక్షింతలనిచ్చి ఆశీర్వాధించమంటారు. దానితో పాటు పసుపు మరియు కుంకుమ శుభానికి సూచిక. పసుపు లేదా కుంకుమ గానీ, కలపని అక్షింతలను పూజాకార్యక్రమాల్లో గానీ, శుభకార్యల్లోగానీ వాడరు.