Home Unknown facts తరుణ గణపతి విశిష్టత ఏంటో తెలుసా ?

తరుణ గణపతి విశిష్టత ఏంటో తెలుసా ?

0
Taruna Ganapati

గణనాథుడికి సాధ్యం కానిది లేదు. వినాయకుడంటే అన్నీ. సమస్తం ఆయన ఆధీనంలోనే వుంటాయి. కోరితే ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదని చెబుతారు. మహావిష్ణువు దశావతార రూపుడయితే, విఘ్నేశ్వరుడు అంతకన్నా ఎక్కువ రూపాలను కలిగిన దేవుడు. ఒక్కో రూపంలో ఒక్కో మహిమ చూపుతాడట వక్రతుండుడు. కోటి సూర్యులకు సమమైన గణపతికి వీలు లేని కార్యం లేదు.

ఈ చరా చర సృష్టిలో.. వినాయకుడికి సాధ్యం కానిది లేదంటారు గణేశశక్తిని ఆరాధించేవారు. రూపాలు వేరైనా.. గణనాధుడు ఒక్కడే… వినాయకుడు ఒకడే కాదు. ఆయనకు 32 రూపాలున్నాయని చెబుతున్నాయి శాస్త్రాలు. ఆ ముప్ఫైరెండింటిలో పదహారు రూపాలలో ఉండే వినాయకులను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒక్కో రూపంలో ఉండే వినాయకుడిని పూజిస్తే ఒక్కో కోరిక తీరుతుంది. ఒక్కోరకం శుభం కలుగుతుందని చెబుతారు. ముద్గల పురాణంలో వినాయకుడికి సంబంధించిన పదహారు రూపాలను గురించి ప్రత్యేకంగా వివరణ కనిపిస్తుంది.

అందులో ఒకటి తరుణ గణపతి. ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం, రావలసిన డబ్బులు వసూలు కాకపోవడం, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం జరుగుతోందా? అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం తరుణ గణపతిని పూజించడమే అని శాస్త్రాలు చెబుతున్నాయి.

వినాయకుని ముప్ఫైరెండు రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది. తరుణ అంటే యవ్వనం అని అర్థం. తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతాడు. ఈ రూపంలో వినాయకునికి ఎనిమిది చేతులు ఉంటాయి. కుడిపక్కన ఒక చేతిలో దంతాన్ని, మరొకచేత జామపండుని, ఒక చేత చెరుకు గడలని, మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఎడమవైపున ఒకచేత మోదకాన్ని, ఒకచేత వెలగ పండునీ, ఒకచేత లేత మొక్కజొన్న కంకుల పొత్తినీ, మరొక చేత వలనీ ధరించి ఉంటాడు.

తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది. ఎరుపు ఉత్తేజానికీ యవ్వనానికీ ప్రతీక. మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సుతో తరుణ గణపతి దర్శనమిస్తాడు. వినాయకునికి ప్రీతికరమైన బుధవారం నాడు, సంకష్ట చతుర్థినాడు, వినాయక చవితినాడు, దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని తరుణ గణపతి రూపంలో పూజించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

ఇంకా ఆటంకాలు తొలగుతాయి. అనుకున్న కార్యాలు సత్వరం నెరవేరతాయి. స్కాంద పురాణంలోనూ, బ్రహ్మ పురాణంలోనూ, వామన పురాణంలోనూ ముద్గళ పురాణంలోనూ తరుణ గణపతిని గురించిన ప్రస్తావన ఉంటుంది. ఇక తిరువనంతపురంలోని పళవంగడి గణపతి ఆలయంలోనూ, మధ్యప్రదేశ్, ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో తరుణ గణపతి సన్నిధానం వుంది.