పురాణాల ప్రకారం వేంకటేశ్వర స్వామి ఏడుకొండలపై వెలసిన తొలిరోజుల్లోనే బ్రహ్మదేవుడిని పిలిచి లోకకళ్యాణం కోసం తనకు ఉత్సవాలు జరిపించాలని ఆజ్ణాపించారట. స్వామివారి ఆదేశానుసారం శ్రీనివాసుని ఆనంద నిలయంలో ఆవిర్భవించిన కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.
అప్పటి నుండి ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.ఆనాటి నుండి నేటి కలియుగం వరకు ఈ ఉత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలకు ఎంతో విశిష్టత ఉంది. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని ఆనందనిలయంలో మొదలుకుని స్వర్ణతలుపుల వరకు ఉప ఆలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణంలోని గోడలు, పైకప్పుతో పాటు పూజాసామాగ్రిని శుద్ధి చేస్తారు.
వైఖాసన ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ, స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. శ్రీస్వామివారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంతమండపానికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ మట్టిలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటుతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పరణం అయ్యింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలన్నీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాయిద్యాల నడుమ అర్చకస్వాములు స్వర్ణంతో కూడిన ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. చూసే వారికీ కన్నుల పండుగల ఉంటుంది.