Home Unknown facts అయ్యప్ప భక్తులు మసీదుకు ఎందుకు వెళతారో తెలుసా?

అయ్యప్ప భక్తులు మసీదుకు ఎందుకు వెళతారో తెలుసా?

0

ప్రతి ఏటా వేలాది మంది భక్తులు మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్రకు వెళ్తుంటారు. అయ్యప్పను దర్శించుకునేందుకు కఠినమైన ప్రయాణం చేసి శబరిమల చేరుకుంటారు. ఈ సుదీర్ఘ యాత్రలో భక్తులు కఠిన ఆహార నియమాలు, బ్రహ్మచర్యం పాటిస్తారు. చాలా దూరం కాలినడకనే వెళ్తారు. 41 రోజుల పాటు చేసే అయ్యప్ప దీక్షలో భక్తులు ఇంకా ఎన్నో నియమాలు, ఆచారాలు అనుసరిస్తారు. అయితే అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్తారని మీకు తెలుసా? ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అసలు అయ్యప్ప భక్తులకు మసీదు, ఏం పని ? దానివెనుక కథేమిటో తెలుసుకుందాం.

Ayyapa Swamyశబరిమల దారిలో ఇరుమలై అనే ఒక చిన్న పట్టణం ఉంది. అది అయ్యప్ప ఆలయానికి సుమారు 60 కిలోవిూటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆగడం అనేది అయ్యప్ప భక్తులకు ఒక నియమంగా వస్తోంది. మాల వేసిన భక్తులు ఇక్కడి భారీ మసీదులోకి వెళ్తారు. దీనిని వావర్‌ మసీదు అంటారు. అయ్యప్ప స్వామిని, వావర్‌ స్వామిని ప్రార్థిస్తూ భక్తులు జయజయధ్వానాలు చేస్తారు. మసీదులో ప్రదక్షిణలు చేసి, విభూది, మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రను కొనసాగిస్తారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు తమ తమ సంప్రదాయాలను అనుసరించి మసీదులో పూజలు చేస్తారు. అక్కడే నమాజు కూడా చేస్తారు. ఈ మసీదులో ప్రదక్షిణలు చేసే సంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది.

ఏటా శబరిమల ఆలయంతో మసీదుకు ఉన్న సంబంధాలను చెప్పేలా మసీదు కమిటీ ఒక ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ వేడుకను చందనకూడమ్‌( చందనం-కుంకుమ) అంటారు. ఇరుమలైలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. కొండపైకి ఎక్కి వెళ్లే యాత్రికులు చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి వీరి ఇళ్లలో ఆగుతుంటారు.

వావర్‌ అంటే ఒక సూఫీ సన్యాసి. ఆయన అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. అయ్యప్పపై ఆయనకు ఉన్న భక్తి గురించి శతాబ్దాల నుంచీ చెప్పుకుంటున్నారు. అందుకే భక్తులు శబరిమల యాత్రలో వావర్‌ స్వామి ఉన్న మసీదును దర్శించడం ఒక సంప్రదాయంగా మారింది. వావర్‌ గురించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటికి చారిత్రక ఆధారాలు లభించడం లేదు. కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెబుతారు.

కొంతమంది మాత్రం మసీదులో ఒక కత్తి ఉందని, దానిని బట్టి వావర్‌ ఒక వీరుడు అయ్యుంటారని చెబుతారు. కానీ వావర్‌ ఒక ముస్లిం, అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కేరళ టూరిజం కూడా దీనిని రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా చేర్చింది.

Exit mobile version