Home Unknown facts కేరళలో ఓనం పండగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

కేరళలో ఓనం పండగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

0

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయ కారకులు. త్రిమూర్తులు తమ భక్తులకు వరాలను ఒసగి, దీని వల్ల అనర్ధాలు సంభవించినప్పుడు తిరిగి ఏదో ఒక రూపంలో అవతరించారు. లోక కల్యాణం కోసం అవతరించి దుష్ట సంహారం గావించారు. అందులో భాగంగానే శ్రీమన్నారాయణుడు మత్స్య, కూర్మ, వరాహా, నరశింహా, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధుడిగా భూలోకంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు.
దశావతారాలలో ఐదవది వామనావతారం.

4-Rahasyavaani-1110ఈ అవతారమును విష్ణువు బలి చక్రవర్తిని అంతమొందించేదుకు ఎత్తాడు. బలిచక్రవర్తి ప్లహ్లాదుని మనువడు. వైరోచనుని కుమారుడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేయటం ద్వారా, బ్రాహ్మణులకు దానాలు చేయడం ద్వారా అమిత శక్తివంతుడై ఇంద్రునిపై దండెత్తి, ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. దేవతల తల్లి అయిన అదితి, తన భర్తయైన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లి తన పుత్రుల దీనస్థితిని వివరించింది.

బలిచక్రవర్తియే భోగభాగ్యములన్నీ అనుభవిస్తూ దేవతలకు భాగమివ్వటం లేదని మొరపెట్టుకొన్నది. అంతట కశ్యపుడు నారాయణునిడిని పూజించమని ‘పయోభక్షణము’ అనే వ్రతమును ఉపదేశిస్తాడు. ఆ వ్రత ఫలితంగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నం వామన రూపంలో విష్ణువు అదితి గర్భంలో జన్మిస్తాడు.

అడిగిన వారికి లేదనకుండా దానమిచ్చే స్వభావమున్న బలిచక్రవర్తి బలహీనత బ్రాహ్మణులకు దానం చేయడమని గ్రహించిన విష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్తాడు. బలిచక్రవర్తి ఆ వామనునికి సాదర స్వాగతం పల్కి, అర్ఘ్యపాద్యాదులను సమర్పించి, ఏమి కావాలో కోరుకోమంటాడు. వామనుడు తనకు యాగం చేసుకోనేందుకు మూడు అడుగుల నేల కావాలని కోరతాడు. అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం కోరి వచ్చినవాడు వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీమహావిష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహిస్తాడు.

శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు విష్ణువు అని, అతనికి ఏ దానం చేయవద్దని, వెంటనే ఇక్కడ నుండి పంపివేయమని సూచిస్తాడు. అందుకు బలిచక్రవర్తి దానమిస్తానని పలికి, ధన ప్రాణాలపై వ్యామోహంతో ఆ దానం చేయనని పల్కలేనని అంటాడు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఇచ్చినమాట మీద నిలబడి ఉంటానని, మాటను వెనుకకు తీసుకోలేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అందుకు ఆగ్రహించిన శుక్రాచార్యుడు శీఘ్రకాలంలోనే రాజ్యభ్రష్టుడవు అవుతావని బలిని శపించి వెళ్ళిపోతాడు.

అంతట బలి చక్రవర్తి వామనుని పాదాలు కడిగి, ఆ నీరును తల మీద చల్లుకుంటాడు. వామనుడు కోరిక మేరకు మూడు అడుగులు దానమిస్తున్నానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదగా వామనుని చేతిలోకి నీళ్ళు పోస్తుంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భ పుల్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన రెండు కళ్ళల్లో ఒక కన్నును కోల్పోతాడు. దానం స్వీకరించిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంత ఆక్రమించి ఒక పాదము భూమి మీద వేసి, రెండవ పాదము ఆకాశమ్మీద వేసి, మూడో పాదం ఎక్కడ వెయ్యాలని బలిని అడుగుతాడు.

అప్పుడు బలి ‘నా నెత్తి మీద వెయ్యి’ అంటాడు. వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి అధ:పాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలి దాన గుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. ఇప్పటికీ కేరళలో ఓనం పండగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువుని పూజిస్తే శుభప్రదం.

Exit mobile version