Home Unknown facts Ekashila Vigrahamtho Deshamlo Unna Ekaika Chamundeshwaridevi Aalayam

Ekashila Vigrahamtho Deshamlo Unna Ekaika Chamundeshwaridevi Aalayam

0

మన దేశంలో చాముండేశ్వరీదేవి వెలసిన ఏకైక అరుదైన ఆలయం ఇదేనని చెబుతారు. ఇక్కడ 11 అడుగుల ఏకశిలా విగ్రహం తో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. మరి ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ekashilaతెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, మెదక్ – సంగారెడ్డి మార్గంలో కౌడిపల్లి మండలం చిట్కుల్ గ్రామంలో మంజీరా నది ఒడ్డున శక్తి స్వరూపిణియైన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం ఉంది. భక్తకోటికి కొంగుబంగారంగా భక్తుల పూజలందుకునే దేవి శ్రీ చండి చాముండేశ్వరి గొప్ప మహిమాన్వితమైనది. ఇక్కడ ఉత్తర దిక్కు ప్రవహించే పవిత్ర పుణ్య మంజీరా నది జలాలు ప్రతిరోజు అమ్మ వారిని అభిషేకం చేస్తుంటాయి. అష్టాదశ శక్తిపీఠ దేవతలలో ఒకరైన చాముండేశ్వరి ఆలయం దేశంలోనే చాలా అరుదైనదిగా చెబుతారు. ఈ అమ్మవారిని 1982 లో ప్రతిష్టించడం జరిగింది. ఈ ఆలయంలో 11 అడుగుల ఏకశిలా అమ్మవారి విగ్రహం భక్తజనకోటితో పూజలందుకొంటుంది. 11 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంతో దేవతామూర్తి ఉండటం దేశంలోనే ఇటువంటి విగ్రహాలలో ఈ దేవి విగ్రహం మొదటిదిగా చెబుతారు. జ్వాలా కిరీటంతో 18 చేతులతో తామర పుష్పంపై నిలబడి ఉన్న విగ్రహాన్ని తమిళ శిల్పులు తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రతిష్టించిన చాముండేశ్వరీదేవి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ దివ్యమూర్తిగా దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి వద్ద శ్రీ చక్రం కూడా ప్రతిష్టించారు. అయితే భక్తులు మంజీరానదిలో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారికి ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని ప్రగాడ విశ్వాసం భక్తులలో ఉంది. ఇంకా నదిలో స్నానం చేసి వచ్చి అమ్మవారి పాదాలను తాకి ఆమె పాదాలవద్దే కుంకుమార్చనలు చేస్తారు. ఇక్కడి అమ్మవారిని దర్శిస్తే తమ పసుపు, కుంకుమలు పదికాలాల పాటు పచ్చగా ఉంటాయన్నది మహిళల ప్రగాఢ విశ్వాసం. అందుకే నిత్యం మహిళలు ఈ ఆలయంలో భక్తి శ్రద్దలతో కుంకుమ పూజలను జరుపుతూనే ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారు శాంతమూర్తి అవతారంలో ఇచట దర్శనమిస్తుంటారు. అందుకే ఇక్కడ జంతుబలి అనేది ఉండదు. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పూజిస్తూ, నవరాత్రి ఉత్సవాలను ఘనంగా, కన్నుల పండుగగా జరుపుతుంటారు.

Exit mobile version