Home Unknown facts Enimidhi thalala narasimhudu ekkada velisado telusa?

Enimidhi thalala narasimhudu ekkada velisado telusa?

0

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉగ్రనరసింహరూపం గురించి మనకి తెలుసు. అయితే ఈ దేవాలయంలో మాత్రం నరసింహస్వామి ఎనిమిది తలలతో, షోడశ బాహువులతో మరింత గంభీరంగా విశేష రూపంతో దర్శనమిస్తున్నాడు. మరి ఆ దేవాలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. narasimhuduకరీంనగర్‌ జిల్లాలోని గంగాధర మండలం నర్సింహుల పల్లెలో ఈ ఆలయం ఉంది. దేవుని గుట్టగా పిలిచే ఇక్కడ పురాతన శైవ, వీరభద్రాలయాలూ కొలువై ఉన్నాయి. రాష్ట్రకూటుల కాలంలో అంటే ఎనిమిదో శతాబ్దంలో కట్టిన లక్ష్మీనృసింహ విశ్వనాథాలయాలతో పాటూ కాకతీయుల కాలంనాటి మల్లికార్జున, సోమనాథ, వీరభద్రాలయాలూ ఉన్నాయి. అందుకే ఈ వూరిని కోట్ల నర్సింహుల పల్లె అనీ, అంత మంది దేవతలు ఒక్కచోట కొలువయ్యారు కనుక ఆ కొండను దేవుని గుట్ట అనీ పిలుస్తున్నారు. ఈ ఆలయంలో మహాలక్ష్మీ సమేతంగా నర్సింహస్వామి వెలిశాడు. ఇక్కడ దేవాలయ పైకప్పు మీద లోపలివైపు ఎనిమిది ముఖాలూ, పదహారు చేతులతో పెద్ద రాయిమీద చెక్కిన అష్టముఖ నరసింహ స్వామి విగ్రహం దేశంలోనే అరుదైనది. విశాలమైన గ్రానైటు రాయి మీద చెక్కి ఉన్న ఈ రూపంలో ప్రస్తుతం మూడు తలలే స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. వైఖానస ఆగమ పరమేశ్వర సంహితలో స్వామి పదహారు చేతుల్లో ఏమేమి ధరిస్తాడనే వివరణ ఉంటుంది. ఇక్కడ కుడివైపు కింది హస్తంలో హిరణ్యకశిపుని తల ఉంటుంది. రెండు ప్రధాన హస్తాలు దానవుడి పేగులు తీసి మెడలో వేసుకున్నట్టు కనిపిస్తాయి, మరో చేయి రాక్షసుడ్ని కొడుతున్న భంగిమలో ఉండగా మిగతా చేతులు శంఖ చక్రాలు ధరించీ అభయ ముద్రలతో ఉన్నాయి. ఇది ఎల్లోరాలోని దశావతార గుహ, కాంచీపురంలోని వైకుంఠ పెరుమాళ్‌ గుడిలోని పోరాట దృశ్యంలోనీ నరసింహుడి రూపాలను పోలి ఉంటుంది. ఈ దేవాలయం ఎనిమిదీ తొమ్మిదీ శతాబ్దాల మధ్య కాలంలో నిర్మితమైంది. అయితే కొండపైన గానీ, గ్రామంలోకానీ ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన శాసనాలేవీ ఇప్పటి వరకూ దొరకలేదు. శిఖరాగ్రాన నందరాజుల కాలం నాటిదిగా చెప్పే రాతికోట, ధాన్యాగారాల శిథిలాలు మనకి కనిపిస్తాయి.ఈ ఆలయం ఎదురుగా వాయవ్య దిశలో సీతారామాలయం ఉంది. దేవాలయానికి పశ్చిమ దిశన పదహారు స్తంభాల మండపం ఉంది. ఇక ఈ గుట్ట మీద వెలసిన విశ్వనాథాలయాన్ని ఆనుకొని సహజ సిద్ధంగా ఓ కోనేరు ఏర్పడింది. ఇందులో నీళ్లు ఇప్పటికీ వూరుతూనే ఉంటాయి. ఈ దేవాలయాన్ని ఆది శంకరాచార్యులు దర్శించారని చెబుతారు. అంతేకాదు పౌర్ణమినాటి అర్ధరాత్రి నాగదేవత నర్సింహస్వామిని దర్శించుకుంటుందని ఉపాసకులు చెబుతారు. శని, కుజ గ్రహ దోషనివారణ, వివాహ సంబంధ ఆటంకాలూ, సంతానం కోరుకునే వారూ నర్సింహస్వామిని ప్రత్యేకంగా అర్చిస్తారు. 1880వ సంవత్సరంలో రామడుగుకి చెందిన కల్వకోట క్రిష్ణయ్య దేశపాండ్యకి నర్సింహస్వామి కలలో కనిపించి గుడి నిర్మాణానికి ఆదేశించారట. అప్పటి నుంచీ కల్వకోట వంశస్థులే దేవాలయ సేవచేస్తూ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆలయాలు జీర్ణావస్థకు రావడంతో మళ్లీ వాటి పునరుద్ధరణ కార్యక్రమాన్ని కల్వకోట రంగారావు కుటుంబం చూసుకుంటోంది. శైవ పీఠాధిపతి కందుకూరి శివానంద మూర్తి స్వామితో విశ్వనాథాలయంలో అన్నపూర్ణ, గణపతి, నందికేశ్వరుల విగ్రహాలూ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచీ ఈ దేవాలయానికీ నిత్య ధూపదీప నైవేద్యాలు మొదలయ్యాయి.ఈవిధంగా వెలసిన నరసింహ స్వామికి చైత్ర పౌర్ణమి నుంచి మూడు రోజుల పాటు దేవాలయంలో త్రయాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు.

Exit mobile version