Home Unknown facts నరసింహస్వామి శాంతరూపంలో లక్ష్మీదేవిని తొడపైనా కుర్చోబెట్టుకొని దర్శనం ఇచ్చే ఆలయం

నరసింహస్వామి శాంతరూపంలో లక్ష్మీదేవిని తొడపైనా కుర్చోబెట్టుకొని దర్శనం ఇచ్చే ఆలయం

0

శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారు ఎక్కువగా మనకి ఉగ్ర రూపంలోనే దర్శనమిస్తారు. కానీ ఇక్కడి ఆలయంలో శాంతరూపంలో లక్ష్మీదేవిని తొడపైనా కుర్చోబెట్టుకొని భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. మరి ఆ స్వామి ఇక్కడ స్వయంభువుగా ఏవిధంగా వెలిశారు? ఇంకా అక్కడి ఆలయంలో గల ఆసక్తి గల విషయాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా లో, జిల్లా కేంద్రం నుండి 62 కీ.మీ. దూరంలో భింగల్ మండలంలోని భింగల్ గ్రామానికి తూరుపువైపున నాలుగు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది. ఈ గుట్ట మీద శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం కలదు. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఇచట స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఈ స్వామివారి విగ్రహం ఒక సొరంగంలో ఉంటుంది.

ఇక పురాణానికి వెళితే, పూర్వము ఒక రైతు తన పొలం దున్నుచుండగా వానికి నాగేటి చాలులో నరసింహ విగ్రహం కనబడింది. ఆ విగ్రహాన్ని ఏం చేయాలనీ ఆలోచిస్తుండగా, అతనికి ఒక పాము కనిపించి, అది మెల్లగా పాకుతూ కొండపైకి వెళ్లుచుండగా, ఆ రైతు దానిని అనుసరించాడు. ఆ పాము కొండపైన ఒక సొరంగంలోకి వెళ్లి అదృశ్యమయిందట. అది చూసిన ఆ రైతు స్వామివారి తనకు ఈవిధంగా దారి చూపించాడని సంతోషంతో ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లి ఆ సొరంగంలో ప్రతిష్టించి ఆరాదించాడని, అదియే తరువాత శ్రీ నరసింహాలయముగా ప్రసిద్ధి చెందినది తెలియుచున్నది.

ఆవిధంగా శ్రీ నరసింహస్వామి ప్రజారంజకుడై ఆరాధనలందుకొనుచుండగా ఒకసారి ఈ ఆలయంలోకి దొంగలు ప్రవేశించి, ఆ స్వామి వారి ఆభరణములు దొంగలించారంటా. ఆ దొంగలు చేస్తున్న పనిని ఆపటానికి స్వామి తన మహిమచే ఆ సొరంగమును బాగా ఇరుకుగా చేయగా ఆ పరిమాణానికి దొంగలు బయపడి, ఆభరణములు అక్కడే వదిలి పారిపోయారని తెలియుచున్నది. అప్పటినుడి ఈ నరసింహస్వామి ఆ ఇరుకు సొరంగంలోనే ఉండి భక్తులచే పూజింపబడుచున్నాడు.

ఇక ఆలయ విషయానికి వస్తే, రెండంతస్తుల గుట్ట ఇది. మొదటి అంతస్తుపైకి మెట్ల మార్గం, రహదారి మార్గం ఉన్నాయి. మొదటి అంతస్తులో శ్రీవారి మాడ వీధులు, కమలా పుష్కరిణి, కళ్యాణ మంటపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి. రెండవ అంతస్తులో లోతైన రాతి గుహలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్టు ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్లాలి. ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడు లింగాలు ఉంటాయి.

గుహమార్గం ద్వారా వంగుని 250 మీటర్లు వెళితే రాతి గుహలతో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి మూల విరాట్టు, పక్కనే కృష్ణార్జునుల విగ్రహాలు కనువిందు చేస్తాయి. పవిత్ర బద్రీనాథ్‌ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత వచ్చింది.

ఈవిధంగా స్వయంభూగా గుట్టపైన వెలసిన ఈ స్వామి వారికీ ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో కల్యాణోత్సవం కన్నుల పండగగా నిర్వహిస్తారు. ఆ సందర్బంగా పెద్ద ఎత్తున ఇచట జాతర జరుగుతుంది. ఈ జాతరలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారు.

Exit mobile version