Home Unknown facts వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్దమ్మ తల్లి ఆలయ విశేషాలు

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్దమ్మ తల్లి ఆలయ విశేషాలు

0
Rahasyavaani

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాలలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఒకటి. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు. అంతేకాకుండా అతిపెద్ద దేవాలయాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. మరి ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఆలయంలో అమ్మవారు ఎలా వెలిశారు? ఇంకా ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

peddamma thalli templeతెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం ఉంది. వేలసంవత్సరాల క్రితం నుండే ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లుగా తెలియుచున్నది. ప్రవేశద్వారం స్వాగతిస్తున్న దేవతామూర్తితో సాక్షాత్కరిస్తుంది. ఆలయ రాజగోపురం ప్రవేశ ద్వారం పై ఉన్న పెద్దమ్మ తల్లి మూర్తి చూడగానే ఆకట్టుకుంటుంది. ఎడమచేతి వైపు ఉన్న పెద్దమ్మ తల్లి చిన్న గుడి సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల మూలా గుడి అంటారు.

peddamma thalli templeఇక పురాణానికి వస్తే, మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే!
ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ.

వేల సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్‌ ఆదిమతెగలకు ఆవాసంగా ఉండేదంటా. అయితే వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు. మంచి జరిగితే, నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే, జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాలప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి. జూబ్లీహిల్స్‌ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ, అలనాటి అమ్మతల్లి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. రెండున్నర దశాబ్దాల క్రితం దాకా ఇక్కడో చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో… రాత్రిళ్లు అమ్మ అడుగుల సవ్వడులు వినిపించేవని స్థానికులు చెబుతారు. భక్తులకు కల్లో కనిపించి తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట.

ఈ ఆలయం లో ఐదు అంతస్థుల గర్భగుడి, ఏడంతస్తుల రాజగోపురం, కల్యాణమండపం, వసతిగృహములు, శ్రీ గణపతి, లక్ష్మి, సరస్వతి దేవాలయాలు ఉన్నాయి. 1994 లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచేత నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు కుంబాభిషేకాలు జరిగాయి.

ఆలయ ప్రాంగణంలో ధ్వజస్థంభం ఉంది. అయితే ధ్వజస్థంభం ముందు ఉన్న పీఠం మధ్యభాగాన రూపాయి బిళ్ళను అంచుమీద పడిపోకుండా నిలబెట్టగలిగితే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ధ్వజస్థంభానికి ఇరుపక్కల పోతురాజు విగ్రహ మూర్తులు ఉన్నారు. అమ్మగుడి ప్రాకారాలపై అష్టాదశ హస్తాలతో సత్కారించే దేవతామూర్తి ఉన్నారు. గర్భాలయంలో పెద్దమ్మతల్లి చతుర్భుజాలతో, విశాల నేత్రాలతో, ఎడమవైపు చేతులతో శంఖం, ప్రత్యేక త్రిశూలం, కుంకుమభరిణితోనూ, కుడివైపు చేతులలో చక్రం, ఖడ్గంతో దర్శనమిస్తుంది.

ఇలా వెలసిన ఈ పెద్దమ్మ తల్లికి ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకములు, ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు దసరా నవరాత్రులు, ఆషాఢశుద్ధ సప్తమి నుండి నవమి వరకు శంకబారి ఉత్సవములు మరియు మాఘ శుద్ధ పంచమి మొదలు సప్తమి వరకు వార్షిక రథోత్సవములు జరుపబడును. అయితే రథసప్తమి రోజు రథము ఊరేగింపు కన్నుల పండుగగా జరుపుతారు.

Exit mobile version