Home Unknown facts భక్తులు కోరిన కోరికలు తీర్చే మహిమ గల స్వామిగా పూజలందుకుంటున్న ఆంజనేయస్వామి

భక్తులు కోరిన కోరికలు తీర్చే మహిమ గల స్వామిగా పూజలందుకుంటున్న ఆంజనేయస్వామి

0

ఆంజనేయస్వామి కొలువై ఉన్న ప్రత్యేకమైన ఆలయాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. ఆంజనేయుడిని ప్రార్థిస్తే దైర్యం, ఎదో తెలియని శక్తి వస్తుందని భక్తులు ఎక్కువగా నమ్ముతుంటారు. అయితే ఇక్కడి ఆలయంలో ఆంజనేయుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఇంకా ఈ ఆలయంలో హనుమంతుడికి సింధూర లేపనం చేయరు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. arogyanniఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా, ఊర్కొండ మండల పరిధిలోని ఊర్కొండపేట్‌ గ్రామ శివారులో ఆంజనేయస్వామి ఆలయం కలదు. రోగపీడిత జనావళికి ఉపశమనం కల్గించే ఆరోగ్యాలయంగా ప్రసిద్ధి చెందిన ఊర్కొండపేట్‌ ఆంజనేయస్వామి భక్తులు కోరిన కోరికలు తీర్చే మహిమ గల స్వామిగా సుప్రసిద్ధుడు. ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహానికి సింధూర లేపనం చేయరు. తైలాభిషేకం, నువ్వులనూనె స్వామికి ఇష్టం. అయితే 80 సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడు, తహసీల్దార్‌ వచ్చి సింధూర లేపనం చేస్తే ఏమవుతుందని అర్చకులతో వాదిస్తూ, స్వామి వారి విగ్రహానికి బలవంతంగా సింధూరం పూత పూయించి ఇంటికి వెళ్లిపోయాడట. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒంటినిండా బొబ్బలు లేచి, ఒళ్ళంతా జిలపెట్టి మంటలు మండినాయట. మరుసటి రోజు వచ్చి ఈ సంగతి చెప్పగా, అర్చకులు సింధూరం తడిపి తైలం రుద్దిన తర్వాత అతని మంటలు తగ్గాయట. అప్పటి నుండి గతంలో పూసినట్లు తైలం పూస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన స్వామివారి ప్రతిమామూర్తి ఆరడుగులు ఉండి కాళికావర్ఛస్సులో ప్రకాశిస్తుంది. ఆలయం సమీపంలో 40 అడుగుల శంకరుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయం ఎదుట ఉన్న ఎల్తైన గుట్టలపై స్వామివారి కోనేరు ఉంది. ఈ కోనేటిలో ఎంత మండువేసవిలో అయినా నీరు ఇంకదు. ఈ నీటిని తాగితే సర్వపాపాలు నశిస్తాయని, రోగాలు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం. అలాగే గట్టుపైన ఉన్న స్వామి వారి పాదాలకి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఇక్కడ ప్రతి శనివారం వందలాది మంది సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ నిద్ర చేస్తే రోగాలు నయమవుతాయని విశ్వాసం. అందుకు నిదర్శనం 1975 నుండి 1980 మధ్యకాలంలో వనపట్ల గ్రామస్థులు గ్రామంలో బాణామతి ఎక్కువ అవడంతో, ఆ గ్రామస్థులు కొన్ని నెలలపాటు ఇక్కడ ఉండి ఆరోగ్యం బాగుపడిన తర్వాత వెళ్ళిన్నట్లు ఇక్కడి ప్రజలు చర్చించుకుంటారు. ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయంలో ప్రతి సంవత్సరం పుష్యమాసంలో అమావాస్య ఏ వారం వస్తుందో అప్పటినుంచి వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఇక పురాణానికి వస్తే, పూర్వం భోజరాయపల్లికి సమీపంలో అమ్మపల్లి అనే గ్రామం ఉండేది. ఆ రెండు గ్రామాల ప్రజలు ఏదో విషయమై గొడవపడి ఒకరి గ్రామాన్ని ఒకరు తగులబెట్టుకున్నారు. పరశురామ ప్రీతి అయిన గ్రామంలో నివసించటం వీలుగాక భోజరాయలు ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి గట్టుల నడుమ ఇప్పచెట్లలో నూతన గ్రామాన్ని నిర్మించారు. అదే గట్టి ఇప్పలపల్లి. భోజరాయులు శివోపాసకులు కాబట్టి గట్టి ఇప్పలపల్లిలో కాళికాదేవితో పాటుగా, పంచలింగాలు ప్రతిష్టించారు.

వీరు మధ్వ సంప్రదాయానికి చెందిన వారు కాబట్టి ఆగ్రామంలో ఆంజనేయస్వామి ప్రతిమను ప్రతిష్టింపదలచి, తగిన శిలకై వెదుకుతూ వచ్చి ఇక్కడ ఊరుకొండపేటపై శిలను కనుగొన్నారు. 40 రోజుల పాటు పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ నియమబద్ధంగా ప్రతిమను మలచిన తర్వాత, గట్టి ఇప్పలపల్లికి తలారు బండ్లతో తరలిస్తుండగా, ఇప్పుడు ఆలయం ఉన్నచోట తలారు బండ్లు విరిగిపోయాయి. స్వామి వారు కలలో కనిపించి నన్ను తరలించవద్దు ఇక్కడే ప్రతిష్టించాలని చెప్పడంతో, అక్కడే అరుగు నిర్మించి ప్రతిమను ప్రతిష్టించారు. అలాగే 50 సంవత్సరాలు స్వామివారికి గుడి లేకుండా ఉండగా, ఊర్కొండపేట్‌ గ్రామస్థులు పూనుకుని ఇప్పుడు ఉన్న చోట ఆలయం నిర్మించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది.

ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version