మనం రాత్రిలో వెలుగు చూస్తున్నాం అంటే దానికి కారణం థామస్ అల్వా ఎడిసన్. ఈయన బల్బ్ ఒక్కటే కాకుండా సుమారు వెయ్యికి పైగా ఉపయోగపడే వాటిని కనిపెట్టి ప్రపంచానికి అందించాడు. ఇంతటి గొప్ప శాస్త్రవేత్త మూఢనమ్మకాల వైపు ఎందుకు వెళ్ళాడు? ఆ విషయాలు ఏంటి? వాటి వల్ల చివరికి ఎం జరిగిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
థామస్ విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త. 1889లో పారిస్‌లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. అందులో ప్రదర్శనకు ఉంచిన వస్తువుల్లో తొంభై శాతానికి పైగా థామస్ ఎడిసన్‌కు చెందినవే కావడం విశేషం. 10 ఏళ్ళ వయస్సు నాటికి ఈయన సొంతంగా లాబొరేటరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం రైళ్ళలో న్యూస్‌పేపర్లు, స్వీట్లు అమ్మేవాడు. అతి చిన్న వయసులోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారుచేశాడు.
జీవితం చివరి దశాబ్దాలలో ఎడిసన్ ఆలోచనలు మారాయి, జీవితానంతరం ఏదో ఉందనే విశ్వాసంతో, మరణించినవారితో మాట్లాడడం సాధ్యమని భ్రమపడ్డాడు. అందుకుగాను ఒక విద్యుత్ పరికరం తయారు చేసే ప్రయత్నం చేశాడు. సైంటిఫిక్ అమెరికన్ పత్రిక వెల్లడించిన ఈ వార్త, చాలామందిని ఆశ్చర్యపరిచింది. చనిపోయిన తరువాత వ్యక్తికి చెందిన జ్ఞాపకాలు, తెలివితేటలు, జ్ఞానం ఉంటాయని, కనుక అలాంటివారితో ప్రసారం సాగించవచ్చునని నమ్మాడు. అందుకు సున్నిత పరికరాన్ని కనుగొనాలని తలపెట్టాడు. చనిపోయినవారితో మాట్లాడి రికార్డు చేసే ప్రయత్నం ఫలిస్తుందన్నాడు. దీనికిగాను ఎలాంటి పరిశీలన, పరిశోధన చేశాడో వివరాలు తెలియదు. కాని అలాంటి ప్రయత్నంపై చాలాకాలం వృధా చేసినట్లు తెలుస్తున్నది. ఫలితం మాత్రం రాలేదు.
ఎడిసన్ క్రమంగా ఆత్మ, దైవం మత్తులోపడి, మానవులలో సూక్ష్మ కణాలు ఆకాశంలో ఇతర గ్రహాల నుండి వచ్చాయన్నాడు. వ్యక్తి చనిపోతే, అవి మరో చోటకు పోతాయని కూడా నమ్మాడు. ఎడిసన్ చివరి దశలో దివ్యజ్ఞాన సమాజం ప్రభావంలో పడి, బ్లావ టీస్కీ రచనలు చదివి, సమావేశాలకు వెళ్ళి, వారి నుండి డిప్లొమా స్వీకరించాడు. మనోబలంతో వస్తువుల్ని కదిలించ వచ్చని ఎడిసన్ నమ్మాడు. అలాంటి ప్రయత్నాలు చేసి, ఫలించక వదిలేశాడు.
టెలిపతి రుజువు చేయడానికి విద్యుత్ పరికరాలు వాడి, పనిచేయవని తెలుసుకుని, నిరుత్సాహపడ్డాడు. బెర్డ్ హోర్డ్ రీస్ అనే సమకాలీన మెజీషియన్ చేసిన పనులు చూసి, అద్భుతంగా భావించిన ఎడిసన్, ఇంద్రియాతీత శక్తులకు అదే నిదర్శనం అన్నాడు. మెజీషియన్లు చాలా సందర్బాలలో సైంటిస్టులను బోల్తాకొట్టిస్తారనడానికి అదే నిదర్శనం. రీస్ ఎలా చేస్తాడో తరువాత వివరణ వస్తే, ఎడిసన్ జుట్టు పీక్కున్నాడు. ఎడిసన్ తన ఇంద్రియాతీత శక్తిపై నమ్మకంతో కొన్ని జోస్యాలు చెప్పాడు. అవన్నీ విఫలమయ్యాయి. అయితే ఎడిసన్ శాస్త్రజ్ఞుడుగా తొలి దశలో ఉన్నందున, అతడి మాటల ఆధారంగా సైన్స్ కథలు చాలా వచ్చాయి.
ప్రపంచానికి చీకటి లేకుండా చేసిన అయన, తన జీవితంలోని చివరి దశాబ్దం లోని పరిశోధనలు ఆయనకి చీకటి రోజులు మిగిల్చాయని చెబుతారు.