Home Unknown facts నరసింహస్వామి దర్శనమిచ్చే 9 అద్భుత ఆలయాలు ఎక్కడ ఉన్నాయి?

నరసింహస్వామి దర్శనమిచ్చే 9 అద్భుత ఆలయాలు ఎక్కడ ఉన్నాయి?

0

దేశంలో నరసింహస్వామి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో నరసింహస్వామి దర్శనమిచ్చే 9 అద్భుత ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి:

Lord Narasimha Temples in Telugu states
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని మంగపేట మండలము మల్లూరు గ్రామంలో చిన్న గుట్ట పైన అత్యంత మహిమాన్వితమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము ఉంది. అందమైన కొండల మధ్య ఈ దేవాలయము స్వయంభూ దేవాలయముగా, ఎంతో చారిత్ర కలిగిన దేవాలయముగా ప్రసిధ్ధిగాంచినది. నవ నారసింహ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో మూలా విరాట్టు గుహలో కొండకు ఆనుకొని 9 అడుగుల నల్ల రాతి విగ్రహం కలదు. ఇక్కడ స్వామివారు మోండెందాకా నరరూపం, తలభాగం సింహంగా నిజరూపంగా దర్శనమిస్తారు. ఇలా ఉండటానికి కారణం ఒకప్పుడు పుట్టలో ఉండే ఈ స్వామిని భక్తులు తవ్వి బయటకి తీస్తుండగా గునపం స్వామివారి బొద్దు వద్ద తగిలి గాయమైందంటా. అందుకే ఇప్పటికి ఆ ప్రదేశంలో ఆలయ అర్చకులు చందనం పూస్తారు. అందుకే ఈ ఆలయంలోని విగ్రహాన్ని ఎక్కడ తాకిన రాతిని తాకినట్లు కాకుండా సజీవ మానవ శరీరాన్ని తాకినట్లు మెత్తగా ఉన్నట్లు కనబడుతుంది. దక్షిణ భారత దేశంలో మరెక్కడా కూడా నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయడం జరగదు. కాని ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మరొక ప్రత్యేకత.

అహోబిలం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండలు, అడవుల మధ్యన ఉన్న ప్రాచీన వైష్ణవ దివ్యక్షేత్రంని అహోబిలం గా పిలుస్తారు. ఇది 108 దివ్య తిరుపతులలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందినది. నరసింహస్వామి సగం మానవరూపం, మరోసగం సింహం రూపం ఆకారంలో అవతరించిన విష్ణుమూర్తిని చూసిన దేవతలు భగవంతుని ప్రశంసిస్తూ అహో బలా అని కీర్తిస్తారు. అలా పిలువగా పిలువగా ఆ పిలుపు అహోబలా అని, ఆతర్వాత అహాబిలా అని వాడుకలోకి వచ్చిందని, తర్వాత అహోబిలం అని ఆ ప్రాంతానికి పేరు వచ్చిందని పురాణం. స్వామివారు హిరణ్యకశిపుని చీల్చి చంపిన తరువాత, స్వామి రక్త సిక్తములైన చేతుల్ని కడిగిన గుండమే రక్తకుండం. అందలి నీరు ఇప్పటికి ఇప్పటికి ఎర్రగానే కనబడుట విశేషం. స్వామివారు ప్రహ్లదుడిని రక్షించడానికి, హిరణ్యకశిపుని చంపడానికి ఈ రూపాన్ని ధరించగా నవనారసింహ రూపాలు ఒకేచోట ఇక్కడ నెలకొని ఉన్నాయి.

యాదగిరి గుట్ట:

తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా లోని భువనగిరి దగ్గరలో యాదగిరిగుట్ట మీద శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయం ఉంది. నరసింహ అవతారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి నరసింహుడు వెలసిన పవిత్రక్షేత్రం యాదగిరి. హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఉగ్రరూపం చల్లారని నరసింహస్వామిని బ్రహ్మాది దేవతలు,మహర్షులు ప్రసన్నుని చేసుకోలేకపోయారు. వారంతా లక్ష్మీదేవిని సేవించి ఆయనను శాంతపరచవలసినదిగా ప్రార్ధించారు. లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి శాంతించిన క్షేత్రమిది. అందుకే ఇచ్చట ఆలయములో స్వామిపేరు శ్రీ లక్ష్మి నరసింహస్వామి అని అంటారు.

సింహాద్రి అప్పన్న:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్టణం జిల్లా, విశాఖపట్టణముకు 11 కీ.మీ దూరములో తూర్పు కనుమలలో సింహగిరి పర్వతంపైన వెలసిన దైవం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి. విశాఖపట్టణం లోని చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలు స్వామిని సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. ఇది దక్షిణ భారత దేశములోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో తిరుపతి తరువాత గొప్ప పేరు పొందిన ఆలయం. ఈ ఆలయంలో నిజ రూపములో కనిపించే స్వామి విగ్రహానికి వరాహముఖం, నరుని శరీరం, సింహ తోక యుండుట విచిత్రం. ఇతర నరసింహ క్షేత్రాలలో సింహకారానికి తోక ఉన్నట్లు కనిపించదు. అంతేకాకుండా ఇతర క్షేత్రాలలో స్వామికి 4 చేతులుంటే ఇచ్చట మాత్రం 2 చేతులతో కనిపిస్తాడు. ఇక్కడ స్వామి పాదాలు భూమిలో కప్పబడి ఉంటాయి. ఈ ఆలయములో శివలింగాకృతిలో ఎప్పుడు చందనంతో కప్పబడి స్వామి వారి రూపం ఉంటుంది. ఏడాదిలో ఒక రోజు మాత్రమే చందనపు పొరలు తొలగించుకొని తన నిజ రూపంతో భక్తులకి దర్శనమిస్తాడు. ఇలా సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజ రూప దర్శనం భక్తులకి లభిస్తుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.

లింబాద్రి గుట్ట:

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా లో, జిల్లా కేంద్రం నుండి 62 కీ.మీ. దూరంలో భింగల్ మండలంలోని భింగల్ గ్రామానికి తూరుపువైపున నాలుగు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది. ఈ గుట్ట మీద శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం కలదు. శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారు ఎక్కువగా మనకి ఉగ్ర రూపంలోనే దర్శనమిస్తారు. కానీ ఇక్కడి ఆలయంలో శాంతరూపంలో లక్ష్మీదేవిని తొడపైనా కుర్చోబెట్టుకొని భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. ఈ నరసింహస్వామి ఆ ఇరుకు సొరంగంలోనే ఉండి భక్తులచే పూజింపబడుచున్నాడు. పవిత్ర బద్రీనాథ్‌ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత వచ్చింది.

కదిరి లక్ష్మీనరసింహస్వామి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, హిందూపురాణానికి తూర్పు దిక్కున సుమారు 90 కీ.మీ. దూరంలో కడపజిల్లా సరిహద్దులో ఉన్న కదరి గ్రామంలో శ్రీమత్ కదిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం ఉన్నది. కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. ఖ అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి ఖద్రి లేదా ఖాద్రి అనే పేరు వచ్చిందని అంటారు. ఇంకా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహ స్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని కాటం అనే కుగ్రామం కూడా ఉండటంతో స్వామిని కాటమరాయుడిగా పిలుస్తున్నారు.

వెయ్యినూతుల కోన:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో చిన్నదాసరిపల్లె గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ఉంది. వెయ్యి బావులు ఉన్న ప్రదేశం కావడంతో ఈ క్షేత్రం వెయ్యినూతుల కోన గా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ కాకులు, గద్దలు సంచరించవు.

వరహా నరసింహస్వామి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో శింగరకొండ అనే గ్రామంలోని కొండపైన శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం ఉంది. శ్రీరామచంద్రుడు యోగనిద్రలో నృసింహ తేజం పొంది వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్టించాడని చెబుతారు. మరో కథనానికి వస్తే, పర్ణశాలలో దేవరుషి నారద మహాముని తపమాచరించి నృసింహ స్వామిని ప్రసన్నం చేసుకోగా ఆయన కోరిక మేరకే యోగానంద నరసింహస్వామిగా సింగరాయకొండలో వెలిశాడని ప్రతీతి. యోగ ముద్రలో ఉన్నందున ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారు ఉండరు అని చెబుతారు. ఇలా ఎంతో మహిమగల ఆ స్వామి వారు కొలువు ఉన్న ఈ క్షేత్రం ద్వాదశ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది.

పెనుశిలా లక్ష్మి నరసింహస్వామి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, రావూరు మండలం లో నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా 80 కీ.మీ. దూరంలో, రావూరు నుంచి 30 కీ.మీ. దూరంలో గోనుపల్లి గ్రామానికి 7 కీ.మీ. దూరంలో పెంచలకోన అను క్షేత్రంలో పెనుశిలా లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఈ నరసింహస్వామి చెంచువనితనైనా లక్ష్మీదేవిని పెనవేసుకొని అవతరించినందున ఈ ప్రాంతానికి పెనుశిలా క్షేత్రమని పేరు వచ్చినట్లుగా స్థానికులు చెబుతారు. ఆ పేరు రూపతరం చెంది పెంచలకోనగా మారిపోయింది అని చెబుతారు. తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఒకే కొండ మధ్యభాగంలో గల పెంచలకోన క్షేత్రంలోని కొండ రెక్కలు విప్పినట్లు గరుడ ఆకారంలో ఉంటుంది.

Exit mobile version