మన దేశంలో ఎంతో పురాతన చరిత్ర కలిగిన అద్భుత ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా లో భక్తులు ఎప్పుడు అధికంగా వచ్చే కొన్ని ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. మరి ఆ ప్రసిద్ధ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయాల స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. పెద్దమ్మ తల్లి , జూబ్లీహిల్స్:
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం ఉంది. వేలసంవత్సరాల క్రితం నుండే ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లుగా తెలియుచున్నది. ఇక పురాణానికి వస్తే, మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ.
2. చిలుకూరు బాలాజీ ఆలయం:
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కు 23 కి.మీ. దూరంలో చిలుకూరు అనే గ్రామంలో బాలాజీ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని పిలుస్తుంటారు. ఇక్కడ ముందుగా కోరికను మొక్కు కొని 11 ప్రదిక్షణలు చేస్తారు. ఆ కోరిక తీరిన తరువాత 108 సార్లు ప్రదిక్షణలు చేస్తారు. ఈ ఆలయం లో విశేషం ఏంటంటే ఇక్కడ హుండీ అనేది ఉండదు. అంతేకాకుండా స్వామివారి దర్శనానికి ధనిక, పేద అధికార తారతమ్యాలు ఉండవు. అందరు ఒకేవరుసలో నిలబడి దర్శనం చేసుకోవాలి.
3. సంఘీ టెంపుల్:
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నుండి 25 కి.మీ. దూరంలో సంఘీనగర్ లోని పరమానంద గిరి అనే కొండపైన ఈ ఆలయం ఉంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. దక్షిణ భారత నిర్మాణ శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ స్వామివారి విగ్రహం 9 .5 అడుగుల ఎత్తులో ఉండి తిరుమల లోని స్వామివారిని గుర్తు చేస్తుంది. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి సంఘీటెంపుల్. పండుగ రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. సోమవారం, శుక్రవారం ఈ ఆలయంలో ఉదయం 8 గంటలకి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించుటకు ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇంకా శని, అది వారాలలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది.
4.సాయిబాబా టెంపుల్ :
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ జాతీయ రహదారి ప్రక్కన శ్రీ షిరిడీ సాయిబాబా వారి దేవాలయం కలదు. ఈ ఆలయం పూర్తిగా షిరిడీలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని పోలి ఉంటుంది. అందువలన ఈ ఆలయాన్ని దక్షిణ షిరిడీ గా భక్తులు పిలుస్తారు. ఇక హైదరాబాద్ నగరంలో ఎన్నో సాయిబాబా ఆలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ వెలసిన ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. పూర్వం ఒకప్పుడు చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం నేడు ఆధునిక ఆలయ సముదాలతో విరాజిల్లుతుంది. భక్తులు ఈ ఆలయంలోని బాబాను దర్శిస్తే షిరిడీలోని బాబాను దర్శించినంత అనుభూతిని పొందుతున్నారు. భక్తుల కోర్కెలు ఈ బాబా నెరవేరుస్తునట్లు భక్తులలో ఒక భావన ఏర్పడింది. అందుకే ప్రతినిత్యం బాబాని దర్శించటానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు.
5. బల్కంపేట ఎల్లమ్మ:
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని సంజీవరెడ్డి నగరానికి సమీపంలో బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి దేవస్థానం ఉంది. ఇక్కడి అమ్మవారు భక్తుల యొక్క ఎల్లా కోర్కెలు తీర్చే తల్లి కావటం వలన ఎల్లమ్మ తల్లిగా భక్తులు కొలుస్తున్నారు. ఆ జగజ్జనని పాద పద్మములను నమ్మి సేవించనవారి పాప దుఃఖములను పటా పంచలు చేసి శాశ్వతమైన ఆనందాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. మంత్రశాస్రంలో ప్రధానమైన దశమహావిద్యలలో చిన్న మస్తాదేవి ఒకరు. ఆ చిన్నమస్తదేవియే పరశురాముని తల్లి రేణుకాదేవిగా అవతరించింది. ఆ రేణుకాదేవియే నేడు కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా ఆరాధించబడుతుంది. ఇలా అమ్మవారి రూపాలలో బాలా త్రిపురసుందరి దేవి ఒకరు. ఆ తల్లిని భక్తులు బాలా, బాలాంబిక, బాలాకాంబిక అని పిలుస్తుండేవారు. ఆ బాలికాంబీయే బల్కమ్మగా, ఆ అమ్మ కొలువై ఉన్న ప్రాంతం బల్కమ్మ పేటగా పిలవబడుతూ అది నేటి బల్కంపేటగా మారిందని పూర్వికులు ద్వారా తెలుస్తుంది.
ఈ ఎల్లమ్మ దేవత ఒక బావిలో భూమి ఉపరితలం నుండి సుమారు 10 అడుగుల దిగువన శయనరూపంలో తూర్పుములాగా చూస్తూ స్వయం భూమూర్తిగా శతకోటి ప్రభల తేజస్సుతో సర్వబీష్ట ప్రదాయని అయి భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుచున్నది. అమ్మవారి స్వయంభువు మూర్తి శిరస్సు వెనుక భాగమున ఒక బావి ఉంది. ఈ బావి నుండి ఉధ్భవించే జల ఊట నిరంతరం ఉధ్భవించడం ఇచ్చట ఒక ప్రత్యేకమైన విశేషం. ఈ జలాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ జలం సమస్త పాపాలనుండి, రోగాల నుండి విముక్తి కలిగిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల కళ్యాణము, ప్రతి ఆషాడమాసం చివరి ఆదివారంనాడు బోనాలు మరియు ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపబడుతాయి.
6. కీసరగుట్ట:
తెలంగాణ రాష్ట్రంలోని, రంగారెడ్డి జిల్లా, కీసరమండలం లో శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇచట ఉన్న ఒక కొండని కీసరగుట్ట అని అంటారు. ఈ కీసరగుట్ట పైన అతి పురాతనమైన శివాలయం ఉంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు శ్రీ రామలింగేశ్వరునిగా పిలవబడుతున్నాడు. ప్రధాన ఆలయానికి సమీపంలో అనేక శివలింగాలు ఉన్నాయి. పరమశివుడు లింగ రూపంలోనే ఎక్కువగా భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. కానీ ఇక్కడ గుట్టపైన వెలసిన శివుడు లింగ రూపంలో కాకుండా శివమూర్తి శిల్పం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది. పురాణం ప్రకారం, శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించాలని భావించగా ముహూర్త సమయానికే శివలింగాన్ని ప్రతిష్టించగా ఆలస్యంగా వచ్చిన హనుమంతుడు అలగడంతో అప్పుడు హనుమంతుడిని శాంతిపచేయడనికి శ్రీరాముడు, ఈ క్షేత్రం కేసరగిరి గా ప్రసిద్ధి చెందుతుందని ఆశీర్వదించి, హనుమంతుడు తెచ్చిన లింగాలలో ఒక లింగాన్ని స్వామివారి వామభాగములో ప్రతిష్టించాడు. అదే శ్రీ మారుతీ కాశీ విశ్వేశ్వరశివలింగం.
7. అష్టలక్ష్మి ఆలయం:
తెలంగాణ రాష్ట్రంలోని, హైదరాబాద్ నగర శివార్లలోని వాసవి కాలనిలో శ్రీ అష్ట లక్ష్మి దేవాలయం కలదు. గర్భాలయ మండపంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రధాన గర్భాలయం, దాని చుట్టూ మరో ఏడు గర్భాలయాలు ఉన్నాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో శంఖు చక్ర అభయ, వరద ముద్రలో దివ్యాలంకార శోభితులై భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇంకా మిగతా ఏడు గర్భాలయాల్లో శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజ లక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధ్యానలక్ష్మి, శ్రీవిజయలక్ష్మి, శ్రీవీరలక్ష్మి, శ్రీఐశ్వర్యలక్ష్మి అమ్మవార్లు కొలువై పూజలందుకుతున్నారు. గర్భాలయంలో శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి ఉండటం వలన స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని, వీరిని దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్డస్తాయని శాస్ర వచనం.
8. బిర్లా మందిర్:
హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ కి దగ్గరలో ఒక చిన్న కొండపైన బిర్లా ఫౌండేషన్ వారు నిర్మించిన ఆలయమే బిర్లా మందిర్. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మందిరం పూర్తిగా పాలరాతితో నిర్మించబడినది. గర్భగుడిలో ఉండే స్వామివారు తిరుపతి లోని శ్రీనివాసుడిని పోలి ఉంటారు. ఈ ఆలయంలోపల రామాయణ, మహాభారత ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి. ఇంకా ఈ ఆలయంలో మార్బుల్ రాయితో చేసిన దేవతావిగ్రహాలు అందరిని ఆకర్షిస్తాయి.
9. ఉజ్జయిని మహంకాళి టెంపుల్:
సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. పూర్వం నుండి ఈ అమ్మవారు ఇక్కడ గ్రామదేవతగా పూజలను అందుకుంటుంది. మహాకాళి అవతారమే ఈ అమ్మవారిగా భక్తుల నమ్మకం. ఇంకా ఈ అమ్మవారిని ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, మారెమ్మ ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు. ఈ ఆలయానికి దాదాపుగా 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక భక్తుల రద్దీ ఎప్పుడు ఎక్కువగా ఉండే ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జరిగే రెండు రోజుల మహంకాళి జాతరకు కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు.
10. పూరి జగన్నాథ ఆలయం:
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో పూరి జగన్నాథ ఆలయం ఉంది. ఈ ఆలయం దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటైన ఒరిస్సా లోని పూరి జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో బలరాముడు, సుభద్ర, శ్రీకృష్ణుడు కొలువై ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువమంది దర్శించే ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది.