తిరుమల తిరుపతి నుండి స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వెలిశారని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే ఈ స్వామి వారు ఇక్కడ వెలిశారు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక పురాణానికి వస్తే, పూర్వం హిందూపురం ప్రాంతాన్ని ఒక సామంతరాజు పాలించేవాడు. వారు శ్రీస్వామివారి భక్తులు. రాజుగారి తల్లితండ్రులు వృద్దులు అయినందున తిరుమలకి నడిచివెళ్లి శ్రీ వెంకటరమణుని దర్శించడం ఎలా అని చింతిస్తూ ఆ వృద్ధ దంపతులు ‘స్వామి నిన్ను దర్శించు భాగ్యం కల్పించు అని మనసులో ప్రార్ధించారు.
అప్పుడు భక్త జనమందారుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఒకరోజు రాజుగారికి కలలో కనిపించి మీ తల్లితండ్రులకు నా దర్శన భాగ్యం కలగాలన్న నీవు ఈ ప్రాంతంలో నా పేరుతో ఒక ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించాడు. స్వామివారి ఆజ్ఞానుసారం ఆ రాజు శ్రీ పేట వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠచేసాడు. ఆనాటి నుండి ఈ ప్రాంతవాసులు ఈ స్వామినే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిగా అర్చించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ దేవాలయం గర్భగుడిలో కంచి కామకోటిపీఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారు శ్రీ చక్రాన్ని స్థాపించి మరింత వన్నె తెచ్చారు. ఈవిధంగా ఈ ఆలయం ఎంతో పవిత్రను సంతరించుకుంది.