Home Unknown facts కొండ శిఖరాన వెలసిన శక్తిపీఠాలలో ముఖ్యమైన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

కొండ శిఖరాన వెలసిన శక్తిపీఠాలలో ముఖ్యమైన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

0

సృష్టికి మూలం ఆది పరాశక్తి అమ్మవారిగా చెబుతారు. ప్రకృతి లోని ప్రతీది శక్తి స్వరూపంగానే భావిస్తారు. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఎన్నో రూపాలతో భక్తులను రక్షిస్తుంది. మనదేశంతో పాటు చుట్టుప్రక్కల గల దేశాలతో కలిపి మొత్తం 51 శక్తి పీఠాలు ఉన్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. తొమ్మిది రోజులూ నిష్టగా, ఉపవాసాలుంటూ, దేవిని స్ధాపించి కొలిచేవారి నుంచీ నవరాత్రులలో నిత్యం లలితా సహస్రనామం పారాయణ చేస్తూ అమ్మని మనసులోనే కొలువు తీర్చుకునేవారిదాకా ఎన్నో రకాలుగా ఆ దేవిని ఆరాధించేవారుంటారు. అలాగే వీలైనన్ని క్షేత్రాలను దర్శించే వారూ ఉంటారు. అయితే అందులో కొన్ని ఆలయాలను దర్శించడం అంత సులువు కాదు. కొన్ని ప్రాంతాల్లోని శక్తి ఆలయాలను దర్శించాలంటే కొండలు ఎక్కి దిగాలి, మరికొన్ని రోప్ వే ద్వారా మాత్రమే చేరుకోగలం. మరి అటువంటి అమ్మవారి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం.

వైష్ణో దేవి ఆలయం:

వైష్ణో దేవి ఆలయంకాశ్మిర్ నుండి కన్య కుమారి వరకు చూసుకుంటే ముందుగా కాశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయం గురించి చెప్పుకోవాలి. భారత దేశంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శ్రీ వైష్ణో దేవి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 5300 మీటర్ల ఎత్తున హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. కొండ మీద ఉన్న గుహలో కొలువైన దైవం మాతా వైష్ణో దేవి. కురుపాండవ సంగ్రామంనకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి, ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతం చెపుతోంది. కత్రా వద్ద ఉన్న బేస్ క్యాంప్ నుండి సుమారు 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఏటా 8 మిలియన్లకి పైగా భక్తులు కష్టతరమైన ట్రెక్కింగ్ ను చేసుకుంటూ వెళతారు. ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ఆలయం కథువా జిల్లాలోని మాతా బాల సుందరి ఆలయం.

తారా దేవి ఆలయం:

కనక దుర్గ అమ్మవారి ప్రతిరూపాల్లో తారా మాత రూపం ఒకటి. చూడటానికి ఈ అమ్మవారు అపరకాళికలా గంభీరంగా ఉన్నా ఎంతో ప్రశాంత చిత్తంతో ఉంటారు. షిమ్లాకు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారాదేవి ఆలయం, షోఘిలోని ప్రఖ్యాతి గాంచిన ధార్మిక కేంద్రాలలో ఒకటి. తార పర్వతం పై ఉన్నఈ ఆలయం 250 ఏళ్ళ క్రిందటిదని, ఈ దేవతావిగ్రహాన్ని పశ్చిమ బెంగాల్ నుండి సేన్ వంశపు రాజు ఇక్కడకు తీసుకుని వచ్చాడని విశ్వసిస్తారు. ఇందులో నక్షత్రాలు అధిపతి దేవత ఉంటుందని ఇతిహాసాల సారాంశం. టిబెట్ బౌద్ధుల ముఖ్య దేవత తారదేవిని స్త్రీ శక్తి స్వరూపిణి దుర్గా మాత తొమ్మిది మంది తోబుట్టువులలో ఒకరిగా పరిగణిస్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పెద్ద పెద్ద ఓక్ చెట్లు ఉండటం వలన పిక్నిక్ స్పాట్ గా కూడా మారిపోయింది.

మానస దేవి ఆలయం:

మానసదేవీ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ నగరానికి దగ్గరలో హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వతం శిఖరం పై ఉంది. 51 శక్తి పీఠాలలో ఒకటైన మానస దేవి టెంపుల్, హరిద్వార్ లోని పంచతీర్థాలలో ఒకటిగా పిలువబడుతోంది. ఈ దేవత పరమశివుని మనసు నుండి జనించినదని అక్కడి భక్తుల నమ్మకం. మానస, నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా భావింపబడుతోంది. ఈ దేవాలయానికి వెళ్ళుటకు పర్వతం పైకి మెట్ల మార్గం ఉంది. రోప్ వే మార్గం కూడా ఉంది. ఈ టెంపుల్ లో రెండు విగ్రహాలు కలవు. వాటిలో ఒక దానికి అయిదు చేతులు, మూడు నొరులు వుండగా, మరొకదానికి ఎనిమిది చేతులు వుంటాయి.

తారా తరిని ఆలయం:

ఒరిస్సా రాష్ట్రంలోని గోపాల్‌పూర్ పట్టణానికి కూతవేటు దూరంలో రిశికుల్య నది ఒడ్డున కుమారి హిల్స్ పై ఉన్నది మాతా తారా తరిని ఆలయం. దేశంలో ఉన్న ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో మాత తారా, మాత తరిని అనే ఇద్ధరు దేవతలు ఉంటారు. వీరిని ఆదిశక్తి అవతారాలుగా కొలుస్తారు.తల్లి యొక్క పవితమైన ఆశీస్సులు అందుకోవడానికి ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తుంటారు.

అధర్ దేవి ఆలయం:

దుర్గాదేవి ప్రతి రూపమైన అధర్ దేవి ఆలయం రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ అబూ లోని ఒక ఎత్తైన శిఖరం పై ఉంది. ఈ దేవాలయం ఒక గుహ లో వుంటుంది. దీన్నే అర్బుడా దేవి గుహ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ఇరుకైన దారిలో 365 పర్వత మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అమ్మవారిని దర్శించడానికి భక్తులు సంవత్సరంలోని రోజులను ప్రతిబింబించేలా వుండే 365 మెట్ల ద్వార కొండ పైకి ఎక్కుతారు. దుర్గ దేవి ఆశీర్వాదం పొందడానికి భారి సంఖ్యలో వచ్చే భక్తులు ఈ సుదూర ప్రయాణం లెక్కచేయరు.

శారద మాతా ఆలయం:

మైహర్ వాలి మాతా ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్ యొక్క త్రికూట కొండ మీద ఉంది. ఈ ఆలయం దేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రశస్తి చెందినది. ఈ దేవాల‌యంలో శార‌ద అమ్మ‌వారు కొలువై ఉన్నారు. మైహ‌ర్ అంటే మా కా హార్ అని అర్థం. అంటే దేవ‌త యోక్క హారం అని తెలుగులో అర్థం. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 1063 మెట్లు ఎక్కి ఎక్కవలసి ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. మైహర్ లోని సా.శ. 502 నాటి శారదా దేవి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ది చెందింది. ఇది రైల్వే స్టేషన్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలో ఉంది. కొండపైకి చేరుకోవడానికి మెట్లతో పాటు, యాత్రికుల సౌలభ్యం కోసం రోప్‌వే కూడా ఉంది.

చాముండేశ్వరి ఆలయం:

కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన మహానగరాలలో ఒకటైన మైసూరు పట్టణానికి సుమారు పది కిలో మీటర్ల దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఈ శక్తి పీఠం సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులోనున్న చాముండీ పర్వతంపై నెలకొని ఉంది. 18 శక్తి పీఠాల్లో నాలుగోది అయిన శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠంలో సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని విశ్వాసం. మైసూరు నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. కాలినడకన సుమారు ఐదు కి.మీ ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకోవచ్చు. కొండ ఎక్కాలంటే.. వెయ్యి మెట్లున్నాయి.

బంలేశ్వరి దేవి ఆలయం:

బంలేశ్వరి దేవి మాత ఆలయం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దొంగర్ ఘర్ సమీపంలో సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తున కొండపై ఉంది. 51 శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలోని విగ్రహం ఆధ్యాత్మిక ప్రాధాన్యతో తయారుచేయబడిందని పురాణాలు చెబుతున్నాయి. బంలేశ్వరి దేవి ఆలయానికి రోప్ వే ద్వారా కూడా వెళ్ళవచ్చు. ఇక్కడికి దగ్గరలో గిరిజనులు ఎక్కువగా ఉన్న అటవీ ప్రాంతం ధంతరి లో కూడా చెప్పుకోదగ్గ ఆలయం ఒకటుంది. అదే ధంతేశ్వరి ఆలయం. చోటి బంలేశ్వరి అనే మరో ఆలయం దీనికి సమీపంలో ఉంది. భక్తులు నవరాత్రి సమయంలో ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.

సప్తశృంగి దేవి ఆలయం:

మహారాష్ట్రలో కొలువైన మూడు సుప్రసిద్ద శక్తి పీఠాలలో అర్థ పీఠమైన సప్తశృంగి దేవీ ఆలయం ఒకటి. సప్తశృంగి దేవీ అభిష్టసిద్ది వరప్రదాయినిగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, విరాజిల్లుతోంది.ఇక్కడ ఉన్న దుర్గా దేవి విగ్రహం ఏకంగా 10 అడుగుల పొడవు, 18 చేతులలో ఒక్కో ఆయుధాన్ని కలిగి ఉంటుంది. ఇది నాసిక్ పట్టణానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఒక కొండపై ఉన్నది. ఈ శక్తి పీఠం సముద్ర మట్టానికి నాలుగువేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది. ఈ దేవి ఆలయం ఏడు కొండలతో చుట్టబడి ఉంది, అందువలన ఇక్కడ ఉన్న దేవతను సప్తశృంగి అని పిలుస్తారు, అంటే ఏడు కొండల దేవత. ఈ ఆలయం చేరాలంటే 472 మెట్లు ఎక్కాలి .

కనకదుర్గ ఆలయం:

అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఇంద్రఖీలాద్రి కొండపై ఈ కనక దుర్గ ఆలయం నెలకొంది. ఇక్కడి అమ్మవారు మహిషాశుర మర్ధినిగా ప్రసిద్ధి చెందారు. మహిషాసురుడనే రాక్షసుడిని వధించడం వలన మాతను మహిషాసుర మర్ధినీగా కొలుస్తారు. ఇక్కడి అమ్మవారు స్వయంభూగా అంటే, తనంతట తానే త్రేతాయుగంలో ఇక్కడ వెలిశారని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న దుర్గా దేవి విగ్రహం నాలుగు అడుగుల ఎత్తు ఉండి, 8 చేతులలో ఒక్కో ఆయుధాన్ని కలిగి మహిషాసురుడిని పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఏటా ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

Exit mobile version