Home Unknown facts అన్నవరం సత్యనారాయణుడి చరిత్ర ఏమిటో తెలుసా ?

అన్నవరం సత్యనారాయణుడి చరిత్ర ఏమిటో తెలుసా ?

0

పిలిచినంతనే పలికే దైవంగా పేరుపొందాడు… శ్రీ సత్యనారాయణ స్వామి. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అని న+ వరం = అన్నవరం) “అన్నవరం దేవుడు” అంటారు. ఆంధ్రులు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యన్నారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యనివారు అరుదేమో. సత్యనారాయణ స్వామిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశగా చెబుతారు. మరి ఆ అన్నవరం సత్యనారాయణుడి చరిత్ర ఏమిటో తెలుసుకుందామా.

annavaram satyanarayana swamyపూర్వం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.

క్రీ.శ. 1891లో తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి “రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై నేను వెలుస్తాను. నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుమని చెప్పి మాయమయ్యారట.

ఆ మరుసటి రోజు వారిద్దరూ కలిసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అందరు అన్నవరం చేరుకున్నారట. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదాల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని వచ్చారు. కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాపై స్వామి వారి దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా విష్ణుపంచాయతన పూర్వకంగా క్రీ. శ 1891, ఆగష్టు 6 వ తేదీన ప్రతిష్ఠించారు.

ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం 1934 లో జరిగింది. ఈ ఆలయ నిర్మాణం రెండు అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతా మూర్తులు. ప్రధాన ఆలయం రధాకారంలో నాలుగువైపులా చక్రాలతో నిర్మింపబడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తుంటుంది.

ఈ స్వామి మూలం బ్రహ్మ, మధ్య భాగం ఈశ్వరుడు, పై భాగం మహ విష్ణువుగా, త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఆలయ సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము మాత్రమే అయినా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండుగగా చేసుకోవడం ఒక ప్రత్యేకత.

Exit mobile version