Home Unknown facts సంతానాన్ని ప్రసాదించే చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ విశేషాలు

సంతానాన్ని ప్రసాదించే చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ విశేషాలు

0
Chengalamma Parameshwari Temple

అమ్మవారి ఆలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువ ఆరాధించేది శక్తిప్రదాయిని. ముగ్గరమ్మల మూలపుటమ్మ, ముమ్మూర్తలమ్మ సృష్టికి మూలం దేవీ సర్వ శక్తి ప్రదాయని, జీవకోటిని రక్షించే ఆది శక్తిగా కొలువైన శ్రీశక్తిని అనాది కాలం నుండి పూజిస్తూ ఆరాదిస్తున్నారు. గ్రామగ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కో పేరుతో పిలిపించుకుంటూ, సహస్ర నామదారిని ప్రజలను కన్న బిడ్డల వలే కాపాడుతుంది.

Chengalamma Parameshwari Templeజగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే! కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి.అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసముంటున్నది అనే భావన, అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట మండలం, నెల్లూరుకు సుమారు 98 కి. మీ., దూరంలో సూళ్లూరుపేట కళిందీనదీ తీరాన బంగాళాఖాతానికి పులికాట్ సరస్సులకు పశ్చిమ దిశలో ఉన్న గ్రామంలో చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఉంది.

Chengalamma Parameshwari Templeముందుగా ఈమె ‘టెంకాళి మాతగా అవతరించి చెంగాలమ్మగా ప్రాచుర్యం పొందింది. పూర్వం ఈ ప్రాంతాన్ని శుభగిరి అని పిలిచేవారు. సూళ్లూరుపేటకు ఈ పేరు రావడానికి చెంగాలమ్మ వారి ఆలయ పాత్ర ఉంది. అది ఎలాగంటే ఈ చెంగాలమ్మ ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు ఒక మేకని కట్టి మూడుసార్లు గాలిలో కర్రను గిర గిరా తిప్పడాన్ని ”సుళ్ళు ఉత్సవం ”అంటారు. ఆవిధంగా ఈ ఊరికి సూళ్లూరుపేట అని పేరు వచ్చింది.

ఈ మందిరాన్నే టెంకాళి స్వయం భూదేవి పేరుతో కూడా పిలుస్తారు. అమ్మవారి శిరస్సు పై ఆలయంలోని మర్రిచెట్టు జడలు తగులుతునట్లుగా కనిపిస్తాయి. ఇక్కడన్న పురాతన ఆలయం 4,5 శతాబ్దల్లో నిర్మించినట్లు చరిత్ర తెలియజేస్తుంది. సూళ్లూరుపేట గ్రామంలో ప్రవహించే పవిత్ర కాలంగి నదిలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు ఇసుకలో కప్పబడిఉన్న విగ్రహమును పశువుల కాపరులు చూసి గ్రామ పెద్దలకు చెప్పారు. వెంటనే వారు గ్రామస్తులతో కలసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ అమ్మవారి విగ్రహం చూసి సంతోషంతో పైకి లేపడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. వారు గ్రామానికి వెళ్ళి , మరునాడు మరికొంతమందితో వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షినాది ముఖంగా నిటారుగా నిలువబడి మహిషాసురమర్ధినిగా స్వయంభువుగా వెలసిన దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

వెంటనే ఆ గ్రామస్తులు అమ్మవారికి ఒక ఆలయాన్ని కట్టించి, తలుపులు పెట్టడానికి ప్రయత్నించగా, గ్రామ పెద్దకు అమ్మవారు కలలో కనబడి నా ఆలయానికి తలుపులు పెట్టవద్దని, భక్తులకు 24 గంటలూ తన దర్శనభాగ్యం కల్పించవలసిందిగా తెలియజేయగా, గ్రామ పెద్ద తలుపులు చేయించడానికి తెచ్చిన చెక్కను గర్భగుడి వెనుక భాగంలో ఉంచారు. తెల్లవారేసరికి ఆ చెక్క మొక్కగా చిగురించి, కొన్నాళ్ళకు అది మహావృక్షం మద్దిచెట్టుగా మారింది.

నాటినుండి ఆ చెట్టు నందీశ్వరుని శిరస్సుగా, అమ్మవారి ప్రతిమగా, ఐదు శిరస్సుల నాగేంద్రస్వామిగా ఇలా వివిధ ఆకృతులతో, అనేక మంది భక్తులకు వివిధ ఆకారాలతో మహిమాన్వితంగా దర్శనమిస్తూ, భక్తుల పూజలు అందుకుంటోంది. అమ్మవారిని దర్శించుకొని చెట్టుచుట్టు మూడు ప్రదక్షిణలు చేస్తే, వివాహం కానివారికి వివాహం, సంతానం లేనివారికి సంతానం, కాలసర్పదోషాలు నుండి విముక్తులై, వారి కోరికలు సింద్దిస్తాయని భక్తుల తిరుగులేని నమ్మకం.

ఈ అమ్మవారిని ప్రతిరోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శిస్తుంటారు. చెంగాలమ్మ జాతర ఇక్కడ అతి వైభవంగా జరుగుతుంది. జాతరలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకుంటారు. ఈ జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తరలివస్తారు. ఈ ఆలయంలో ఉగాదిరోజు లక్షకుంకుమార్చన, మహాలక్ష్మి యాగాలు, ఆషాఢమాసంలో లాలితామహోత్సవం, లలితా హోమాలు, దేవీ శరన్నవరాత్రులతో అష్టదుర్గ హోమాలు, దీపావళి అమావాస్య ఘడియాల్లో ధనలక్ష్మి శతనామ కుంకుమార్చన, మాఘశుద్ద పౌర్ణమి రోజు ఉదయం 6 గంటలకు 108 గోక్షీర కలశాలతో గ్రామోత్సవం జరిపి శ్రీ అమ్మవారి క్షీరాభిషేకం తరువాత మహాచండీయాగం చేస్తారు.

 

Exit mobile version