Home Unknown facts తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్ర

తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్ర

0

హనుమాన్ మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. ఆయన పేరు వింటేనే భూత.. ప్రేత.. పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి. అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. అలా ఆవిర్భవించిన ఆలయమే శ్రీ తాడ్ బండ్ వీరాంజనేయ ఆలయం.

తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిత్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా అవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతున్నది. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు.19 శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేయడంతో, అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయసహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. మరి ఈ ఆలయ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హనుమాన్ (చిన్నజయంతి), వైశాఖ బహుళదశమినాడు (పెద్ద హనుమాన్) జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది దీక్షాపరులు, భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ముఖ్యంగా పెద్ద హన్ మాన్‌ జయంతి సందర్భంగా మూడురోజుల పాటు హోమం యాగాదులు నిర్వహిస్తారు.

తాడ్ బండ్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి. మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే హనూమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై ఉంటుంది. నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్ఛితంగా గృహస్తుడై ఉండాలని, ఇందుకోసం తన కమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు. ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు.

కానీ, ఆపై బ్రహ్మచారిగానే కొనసాగాడు. ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది. వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ మనకు గోచరిస్తాయి. గర్భాలయం మొత్తంను గ్రానైట్ రాయితో నిర్మించారు. ముఖమండపం విశాలంగా ఉంటుంది. విమాన గోపురం, మహారాజ గోపురాలతో శోభాయమానంగా ఉంటుంది. 40 రోజులపాటు జరిగే మండల దీక్షలు, మండల ప్రదక్షిణాలు, మండల అభిషేకాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు.

మండల ప్రదక్షిణాలు మరియు పూజల కోసం ప్రత్యేకంగా నలభై రోజులపాటు ఇక్కడే ఉండాలని కోరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాకులు పలు సత్రాలను నిర్మించారు. సత్రాలతో పాటు భోజనశాలలు తదితర సౌకర్యాలు ఈ మందిరంలో భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఆలయం రజత, బంగారు జూబ్లీ ఉత్సవాలను కూడా జరుపుకుంది. ప్రతి మంగళ, శనివారాలలో ఇక్కడ కోలాహలం మాములుగా ఉండదు. వేల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివస్తుంటారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని రకాల వసతులను విస్తృతంగా ఏర్పాటు చేస్తారు.

వాహన పూజకు ఈ ఆలయం బాగా ఫేమస్. తక్కువ సొమ్ముతో పెళ్ళి వేడుకలు, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు నిర్వహించుకునేందుకు ఓ కళ్యాణ మండపం కూడా ఉంది. కళ్యాణ మండపం అద్దెకు తీసుకున్నవారికి అధిక గదులు కేటాయిస్తారు.

 

Exit mobile version