Home Unknown facts ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు స్థాపించిన నగరం

ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు స్థాపించిన నగరం

0

జ్యోతిర్లింగం అంటే శివుడిని లింగ రూపంలో ఆరాధించే చోటు అని చెబుతారు. శివుడు తన ఆత్మ శక్తిని లింగరూపంలో నింపి మన దేశంలో 12 చోట్ల స్వయంభువుగా వెలిశాడని పురాణం. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఇక్కడి పవిత్ర ప్రదేశంలో శివుడి యొక్క ఏడవ జ్యోతిర్లింగం ఉందని చెబుతారు. ఎన్నో మహిమలు గల ఈ ప్రదేశాన్ని పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని శివుడు స్థాపించాడని పురాణం. మరి ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shiva

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసి జిల్లాలో కాశి విశ్వేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు కాశి విశ్వేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్మకం. భారతదేశంలో వుండే అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది.

గాయత్రీ మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీ నగరంతో సమానమైన మహానగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరొక దైవం లేదని పురాణాలూ చెబుతున్నాయి. ఇక సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుడి త్రిశూలం పైన కాశీనగరం నిర్మించబడిందని పురాణం. శివుడికి ఈ ప్రాంతం అత్యంత ప్రీతి పాత్రమైనదని చెబుతారు. హిందువులు పవిత్రంగా భావించే ఏడు నగరాలలో వారణాసి ఒకటి. ఈ వారణాసి నగరం సుమారు 3 వేల సంవత్సరాల నుండి ఉన్నదని కొందరి భావన.

అయితే క్రీ.శ 1494 లో సికిందర్ లోడి ఈ ఆలయాన్ని సంపూర్ణంగా నాశనం చేయటమే కాకుండా తిరిగి కట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. తరువాత సుమారు 70 సంవత్సరాల పాటు విశ్వనాధునికి ఆలయం లేకుండా పోయింది. ఈ 70 సంవంత్సరాలు వారణాసి, దీని చుట్టుపక్కల ప్రాంతము భయంకరమైన అనావృష్టి కరువు కాటకాలకు గురై, అనేకమంది ఈ ప్రాంతం వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఆ సమయంలో నారాయణ భట్టు అనే ఒక మహాత్ముడు ఈ ఊరిలో నివసిస్తూ ఉండేవాడు. హిందువులే కాకుండా అనేకమంది ముస్లిం లు కూడా అయన దగ్గరికి వెళ్లి కరువు పరిస్థితి పోగెట్టే మార్గం చెప్పుమనగా, విశ్వనాధునికి ఆలయం లేకపోవడమే ఇందుకు కారణం అని అయన చెప్పాడు.

అప్పుడు అందరు వెళ్లి వారణాసిని పరిపాలిస్తున్న నవాబుకు ఈ విషయం చెప్పారు. అయన ఆలయ అనుమతి కి సరే అంటూ ఆలయం పూర్తి అవ్వగానే వానలు కురిసి కరువు లేకుండా అవ్వాలని షరతు పెట్టాడు. ఇక ఆలయం నిర్మించిన వెంటనే వానలు బాగా కురిసి దేశం తిరిగి సుభిక్షం అయింది. కొంతకాలం తరువాత క్రీ.శ. 1669 లో ఔరంగజేబు తన దండయాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని సంపూర్ణంగా నేలమట్టం చేయడమే కాకుండా ఈ ఆలయ స్థలంలోనే జ్ఞానవాపి అనే ఒక మసీదును నిర్మించాడు. ఔరంగజేబు చనిపోయిన తరువాత క్రీ.శ. 1783 లో రాణి అహల్యాబాయి, మసీదుని అనుకొనే మరొక దేవాలయం కట్టించింది. ప్రస్తుతం ఉన్న ఆలయం ఆమె కట్టించినదే. మసీదు కూడా ఇప్పటికి అక్కడ అలానే ఉంది.

ఇక ఆలయ విషయానికి వస్తే, గర్భాలయంలో కొలువై ఉన్న విశ్వేశ్వరుడు శివలింగరూపంలో దర్శనమిస్తాడు. ఈ శివలింగం ఆకారంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడ గుడి చుట్టూ మూలవిరాట్టును పోలిన శివలింగాలు, ఇతర శివలింగాలు వందకు పైన ఉన్నాయి. బయట లెక్కలేనన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. కాశీలో మరణించినవారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకే కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతుంటారు. ఇక్కడ నిత్యం శవదహనం జరుగుతూనే ఉంటుంది.

ఇంతటి పుణ్య ప్రదేశం అయినా ఈ వారణాసిని చనిపోయేలోపు ఒకసారి అయినా దర్శించి పుణ్యం కట్టుకోవాలని భక్తులు భావిస్తుంటారు.

Exit mobile version