Home Unknown facts బౌద్ధ మతస్థులు వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షాన్ని పూజించడానికి కారణం?

బౌద్ధ మతస్థులు వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షాన్ని పూజించడానికి కారణం?

0

గౌతముడు బుద్ధునిగా మారి మనిషి ఎలా బ్రతకాలో బోధనలు చేస్తూ ఉండగా బుద్దునికి అనేక శిష్యులు తయారయ్యారు. వారిలో ఆనందుడు ఒకడు. బుద్దుడు పెద్దవాడయ్యాడు. ముసలితనం దగ్గరపడుతున్నకొద్దీ తన చివరి జీవితాన్ని ఒక పల్లెపట్టున గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆనందుడు బుద్దునితో కలిసి సాలవృక్షాలతో ( రావిచెట్లు )నిండిన అరణ్యంలోకి వెళ్లాడు.

Buddha Purnimaరెండు సాలవృక్షాల మధ్య కొమ్మలతో ఒక చిన్న మంచం తయారుచేశాడు ఆనందుడు. అక్కడే బుద్దుడు నిర్యాణం చెందాడు. ఆరోజు వైశాఖ శుద్ద పౌర్ణిమ కావడం యాధృచ్చికం. ఎందుకంటే బుద్ధుడు వైశాఖ శుద్ద పౌర్ణిమ రోజే జన్మించారు, అదే తిధిలో జ్ఞాన బోధ అయింది. ఆ ప్రదేశం కుసినర, తరువాతి కాలంలో కుసినగరంగా ప్రసిద్ధి పొందింది.

బుద్దుని జీవితంతో పెనవేసుకున్న వైశాఖ పూర్ణిమ బౌద్దులకు మహాపర్వదినంగా మారింది. వైశాఖ పూర్ణిమనాడు బోధివృక్షానికి పూజచేసే ఆచారం బౌద్దులలో ప్రారంభమైంది. ఇది కూడా బుద్దుడి కాలంలోనే ప్రారంభం కావడం విశేషం. స్వామి వనంలో ఉండగా ఒకనాడు భక్తులు స్వామికి పూజచేయడం కోసం పూలు తెచ్చారు. ఎంతసేపు నిరీక్షించినా స్వామి కనిపించలేదు. భక్తులు నిరుత్సాహపడి అక్కడే ఆ పూలను వదిలేసి వెళ్లారు. దీన్ని గమనించిన అనంత పిండుడు అనే భక్తుడు స్వామి రావడంతోనే ఈవిషయాన్ని వెల్లడించాడు. స్వామి తన శరీరానికి పూజను నిరాకరించి తనకు జ్ఞానోపదేశం చేసిన బోధివృక్షాన్నే పూజించాలని చెప్పారు. తాను నిర్యాణం చెందాక కూడా తన పార్థివ శరీరానికి కాకుండా వృక్షానికే పూజలు చేయాలని శాసించారు.

స్వామి ఆంతర్యాన్ని గ్రహించిన ఆనందుడు గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి జేతవన విహారంలో నాటాడు. ఆనాడు ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహించారు. కోసలదేశపు రాజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులలో ముఖ్యభాగమైంది. ఈ పూజను ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు చేయడం ఆచారమైంది. బౌద్దమతం ఆచరిస్తున్న అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధివృక్షానికి పూజలు చేస్తారు.

 

Exit mobile version