Home Unknown facts ఆ దేవత అనుగ్రహం పొందాలంటే కచ్చితంగా దొంగతనం చేయాల్సిందే

ఆ దేవత అనుగ్రహం పొందాలంటే కచ్చితంగా దొంగతనం చేయాల్సిందే

0

మనం ఏదైనా ఆలయానికి గాని జాతరకు గానీ వెళ్ళినపుడు రద్దీ ఎక్కువగా ఉంటే అక్కడ ఉండే రక్షణ శాఖ వారు పదే పదే జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు. దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే హెచ్చరికలు మనకు వినపడుతూనే ఉంటాయి. సీసీ కెమెరాల కన్ను అందరి మీద ఉంటుంది. కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ ఆలయంలో దొంగతనం జరిగితే ఏదో అరిష్టం అని చాలా మంది భావిస్తారు. గుళ్లలో దొంగతనాలు జరగకుండా ఏర్పాట్లు చేస్తారు. కానీ ఓ ఆలయంలోని దేవత అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా దొంగతనం చేయాల్సిందే. దొంగతనం చేసిన వ్యక్తికి ఎవరూ అడ్డు చెప్పరు. పైగా అక్కడి పూజారే దొంగతనం చేయడానికి ప్రోత్సహిస్తాడు.

Chudamani Temple ఇదెక్కడి విడ్డురం అనుకోకండి ఇది ముమ్మాటికీ నిజం! ఆ వింత ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చూడియాలాలో ఉంది. దాని పేరు చూడామణి ఆలయం. ఇక్కడ దొంగతనం చేయాల్సింది నగలు, డబ్బు కాదు. దేవత పాదాల దగ్గర ఉండే చెక్క బొమ్మ. అతి పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు విచ్చేస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

దీనికి సంతాన ఆలయం అని కూడా పేరు ఉంది. ఆలయాన్ని సందర్శించిన వారికి తప్పకుండా పిల్లలు పుడతారని నమ్మకం. ఈ నమ్మకమే ఇక్కడి ఆలయానికి అంతటి గుర్తింపు తెచ్చింది. దొంగతనం వెనక ఒక పురాణ గాధ దాగి ఉందని అక్కడి స్థానికులు కొందరు చెబుతుంటారు. లాందౌరా రాజు ఒకనాడు వేటకై అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయనకు చూడామణి ఆలయం కనిపించింది. ఆలయం వద్దకు వెళ్లి తనకు బిడ్డను ప్రసాదించమని వేడుకుంటాడు. అమ్మవారు మాయమై చెక్క రూపంలో దర్శనమిస్తుంది. రాజు ఆ చెక్క బొమ్మను తన వెంట తీసుకొని వెళ్ళిపోతాడు.

ఆ తరువాత రాజు భార్య పండింటి మగ బిడ్డకు జన్మనిస్తుంది. వెంటనే రాజు సతీసమేతుడై ఆలయానికి వచ్చి చెక్కబొమ్మను సమర్పిస్తాడు. ఈ ఆచారం ప్రకారం చెక్క బొమ్మను ఎత్తుకు వెళ్లిన వారు పిల్లలు పుడితే తిరిగి ఆ బొమ్మను తీసుకువచ్చి అక్కడ పెట్టేయాలి. మరో బొమ్మను కూడా అక్కడకు తీసుకువచ్చి ఉంచాలి. ఇదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుందంటున్నారు అక్కడి ఆలయ పూజారులు.

దూర ప్రాంతాల నుండి ఈ ఆలయ దర్శనానికి వెళ్లాలంటే చూడియాలా సమీపాన డెహరాడూన్ విమానాశ్రయం ఉంది. ఇది 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్యాబ్ లేదా టాక్సీ ల ద్వారా ఎయిర్ పోర్ట్ నుండి చూడియాలా ఆలయానికి చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎయిర్ పోర్ట్ కు విమాన సర్వీసులు నడుస్తాయి.

చూడియాలా లో రైల్వే స్టేషన్ ఉంది. స్టేషన్ బయట దిగి ఆటో రిక్షాల లో ఆలయానికి చేరుకోవచ్చు. చూడియాలా సమీపంలో ఉన్న మరో రైల్వే స్టేషన్ రూర్కీ రైల్వే స్టేషన్(19 KM). దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. అంతే కాకుండా హరిద్వార్, డెహరాడూన్, రుషికేశ్, చండీఘర్, మీరట్, ముజాఫర్ నగర్, అంబాలా, ఢిల్లీ ల నుండి మరియు రూర్కీ నుండి రాష్ట్ర సర్వీసు బస్సులు ఉంటాయి.

Exit mobile version