Home Unknown facts కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు? దానికి గల కారణం ఏంటి ?

కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు? దానికి గల కారణం ఏంటి ?

0

కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక.

kalabhairavaశివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కళ్లెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.

ఇంతకీ ఎవరీ కాలభైరవుడు? శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా ఆనిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు.

అంతలోనే సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది. పిచ్చి మహర్షులూ పరమతత్వం గురించి చెప్పేదేముంది. నేనే ఆ మహాతత్వాన్ని. స్వయంభువును నేను. విధాతను నేను. సృష్టిస్థితిలయ కారకుడినీ నేను. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే అంటూ ప్రగల్బాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి.

మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొర కమ్మేసింది. కాదుకాదు… నేనే గొప్ప అంటూ వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది. అంతలోనే దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు.

ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో వూగిపోయాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు. అతడే కాలభైరవుడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా ‘పాపభక్షు’ అయ్యాడు. కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి ఆదేశాన్ని అనుసరించి తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కిందపడిపోకుండా భైరవుడి చేతికి అంటుకుపోయింది.

అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో, నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు కపాలం వూడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి.

 

Exit mobile version