Home Unknown facts మరణించిన వారిని బతికించగల ‘మృత సంజీవని’ మనసాదేవి!

మరణించిన వారిని బతికించగల ‘మృత సంజీవని’ మనసాదేవి!

0

హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెబుతారు. వారిలో ప్రతి ఒక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. ఒకొక్కరికీ ఒక్కో ప్రాంతంలో ఆదరణ కనిపిస్తుంది. అలా ఉత్తరభారత ప్రజలంతా భయంతోనూ భక్తితోనూ కొలుచుకునే మానసాదేవి ఒకరు. కశ్యప ప్రజాపతి ప్రార్ధన చేత పరమేశ్వరి ఆయన కుమార్తెగా ఆయన మనసులో నిరంతరమూ తెజోరూపంతో ప్రకాశిస్తూ సర్వకార్య సిద్ధిని కలిగించసాగింది. ఈ మానసాదేవి మూడు యుగాల కాలం తపస్సు చేసి, తపః ప్రభావం వల్ల శైవి, వైష్ణవి, వాగీశ్వరి, విషహరి అనే పేర్లతో ప్రఖ్యాతి చెందింది.

Interesting Facts About Manasa Devi‘మనసా కశ్యపాత్మజా’ అని చెప్పే మానసాదేవి ప్రకృతిలో వెలసిన మూడవ ప్రధానాంశ స్వరూపం. ఈమె కశ్యప ప్రజాపతి మానస పుత్రిక. పూర్వం భూమ్మీద మనుషుల కంటే అధికంగా పాములు ఉండేవట. అవి విచ్చలవిడిగా సంచరిస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తుంటే కశ్యపముని తన మనసు నుంచి ఈ ఆది దేవతను సృష్టించాడు. ఈమె సర్పాలకు తిరుగులేని అధినేత్రి. మహాయోగేశ్వరి. పరాత్పరున్ని మనసులో నిలుపుకుంటుంది. సార్థక నామధేయ, వైష్ణవి, సిద్ధయోగిని. మూడు యుగాల పాటు శ్రీకృష్ణుని కోసం తపస్సు చేసింది. ‘జరత్కారు’ అనే మహాముని కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటే, ఒకరోజు అతనికి పితృదేవతలు కలలో కనిపించి, ‘నువ్వు వివాహితుడవై ఉత్తమ సంతానం పొంది మాకు పిండ ప్రదానం చేస్తే ఉత్తమగతులు కలుగుతాయని’ చెప్తారు. దాంతో కశ్యపముని సలహా మీద మానసాదేవిని వివాహం చేసుకున్నాడు.

పరమశివుడు క్షీరసాగర మథనంలో హాలాహలాన్ని మింగగా, అది ఆయనపై పనిచేయకుండా చేసింది ఈ మానసాదేవియే. అందుకే, ఈమెను ‘విష హరదేవి’గానూ పిలుస్తారు. గౌరవర్ణం కారణంగా ఆమెను అందరూ గౌరిగా ఆరాధిస్తుండటంతో ‘జగద్గౌరి’గానూ స్థిరపడింది. ఆమె శివుడి శిష్యురాలు కావడంతో ‘శైవి’ అనే పేరు కూడా వచ్చింది. మానసా దేవి మొదట విష్ణు భక్తురాలు కనుక ‘వైష్ణవి’ అయింది. పరీక్షిత్‌ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసే వేళ పాముల ప్రాణాలను కాపాడింది కాబట్టి ‘నాగేశ్వరి’, ‘నాగభగిని’ అనే పేర్లతోనూ పిలువబడింది. హరుడి నుంచి సిద్ధయోగం పొందినందున ‘సిద్ధయోగినీ’ అయ్యింది. మరణించిన వారిని బతికించగలదు కాబట్టి, ‘మృత సంజీవని’. మహాతపస్వి, మహాజ్ఞాని జరత్కారునికి ఇల్లాలైనందుకు ‘జరత్కారువు ప్రియ’. ఆస్తికుడు అనే మునీంద్రునికి కన్నతల్లి కాబట్టి, ఆస్తికమాతగా పిలువబడింది. ఇలా ఆమెకు మొత్తం పన్నెండు పేర్లు. ఈ నామాలను పూజా సమయంలో పఠించిన వారికి సర్పభయం ఉండదు. పది లక్షల సార్లు పఠిస్తే ‘స్తోత్ర సిద్ధి’ కలుగుతుందని శాస్త్రం. దీని వల్ల మహా విషం తిన్నా జీర్ణించుకోగలుగుతారట.

పడగెత్తిన పామును వాహనంగా చేసుకున్నందుకు నాగ గణమంతా ఆమెను సేవిస్తుంటారు. యోగినే కాక నాగసాయిని కూడా. తపస్వరూపిణి. తపస్విలకు తపఃఫలాన్నిచ్చే తల్లిగానూ మానసాదేవిని భారతీయులు ఆరాధిస్తారు. ‘జీవులన్నింటిలో భగవంతుడున్నాడని, ఏ ప్రాణినీ బాధించకూడదని, దేనివల్ల జరిగే మేలు దానివల్ల జరుగుతుందని’ మన ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగానే సర్పపూజ కూడా ఆచరణలోకి వచ్చింది. కొన్ని వేదమంత్రాలలో అయితే, సర్పమంత్రాలు ప్రత్యేకంగా ఉన్నట్టు ‘దేవీ భాగవతం’ చెబుతుంది. సర్పాలకు గుళ్లూ గోపురాలు పెద్దగా లేకున్నా ప్రకృతితో పాటు సర్పారాధన అనాదిగా మనకు ఆచారమైంది. ఆ సర్పాలకు అధిపతి ఈ దేవియే.

మానవ సంతానానికి, సంపదలకు కూడా ఈ తల్లియే అధిపతి. హరిద్వార్‌లో మానసాదేవి ఆలయం ఉంది. ఈమె దయతోనే మనకు నాగుల అనుగ్రహం లభిస్తుంది. ఒంటి నిండా సర్పాలతో, తల మీద పడగతో, ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు మనకు అక్కడక్కడా కనిపిస్తాయి. ఈమె నాగపూజ్యయే కాదు, లోకపూజ్య కూడా. ఈ తల్లిని ఆరాధించినవారు సమస్త కామ్యాలు పొందుతారు. చెట్టుకొమ్మ, మట్టికుండ, నాగరాయి, పుట్ట ఇలా ఏ రూపంలోనైనా ఈమెను పూజిస్తారు. అసలు ఏ రూపం లేకుండా కూడా ధ్యానం చేయవచ్చు. ఇటు ఆచారయుక్తమైన ఆలయాల్లో మూలవిరాట్టుగా, అటు గ్రామదేవతగానూ మానసాదేవి విశేషంగా పూజలందుకుంటున్నది.

 

Exit mobile version