నైనితాల్ అంటే కన్నులాంటి సరస్సు అని అర్థం. ఈ ప్రాంతాన్ని సరస్సుల జిల్లా అని కూడా అంటారు. ఇక్కడి సరస్సు దగ్గర ఉన్న ఆలయం అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటిగా చెబుతారు. మరి ఈ సరస్సుకి కన్ను లాంటి సరస్సు అని ఎందుకు పేరు వచ్చినది? ఇక్కడ అమ్మవారి ఆలయం ఎలా వెలసిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి అనే ప్రదేశంలో చిన్న కొండమీద నైనాదేవి ఆలయం ఉంది. నైని అంటే కన్ను, తాల్ అంటే సరస్సు. నైనితాల్ అంటే కన్నులాంటి ఆకారంలో ఉన్న సరస్సు అని అర్ధం. ఈ ప్రాంతం సముద్రమట్టానికి సుమారుగా రెండు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సతీదేవి యొక్క కళ్ళు ఈ ప్రదేశంలోనే పడ్డాయట. అందువల్ల ఇక్కడ ఉన్న ఈ అమ్మవారి పేరు నయనాదేవి అని పిలువబడుతుంది. ఈ దేవి కండ్లకి స్వస్థత కలిగించే దేవిగా ప్రసిద్ధిచెందింది.
ఈ ఆలయ పురాణానికి వస్తే, ఈ అమ్మవారి ఆలయం ఉన్న కొండ కింద ఉన్న గ్రామంలో పశువులను మేపుకునే గొల్లవారిలో నైనా అనే పేరుగల ఒకతను ఉండేవాడు. ఆ నైనా తన పశువులను ఈ కొండపైన ఉన్న అడవిలోకి మేపడానికి తీసుకువచ్చాడు. అతని మందలోని ఒక ఆవు ప్రతి రోజు ఒక చెట్టు కింద నిలబడి పొదుగులో నుంచి పాలు కిందకి వదులుతూ ఉండేది. ఇంటికి వెళ్లిన తరువాత పాలు సరిగా ఇచ్చేది కాదు. అప్పుడు నైనకి అనుమానం వచ్చి ఒక రోజున రహస్యంగా ఆవు చేస్తున్న పని చూసి అతను వెళ్లి ఆ చెట్టు కింద పడి ఉన్న ఆకులు తీసి చూడగా వాటి అడుగున ఒక గుండ్రని శిల కనబడింది. అప్పుడు అతనికి అర్ధం కాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అతని కలలో దుర్గాదేవి కనబడి తానూ ఆ చెట్టు కింద పిండరూపంలో ఉన్నానని చెప్పింది. ఆ మరుసటి రోజు నైనా ఊరందరికి చెప్పగా వారందరు ప్రతి రోజు వచ్చి పిండరూపంలో ఉన్న అమ్మవారిని అర్చించి వెళుతుండేవారు. అమ్మవారు మొదటగా దర్శనం ఇచ్చిన నైనా పేరు మీద ఈ అమ్మవారు నైనాదేవి అని పిలువబడింది.