Home Unknown facts తిలోత్తమ కోసం కొట్టుకు చచ్చిన సుందోపసుందుల పురాణ కథ

తిలోత్తమ కోసం కొట్టుకు చచ్చిన సుందోపసుందుల పురాణ కథ

0

ఎంతో అన్యోన్యంగా ఉండే అన్నదమ్ములు కొట్లాటకు దిగితే వారిని ‘సుందోప సుందుల్లాగా కొట్టుకుంటున్నారు’ అని పెద్దలు అనడం వింటూనే ఉంటాము. ఈ సుందోపసుందుల ఉపమానం వెనుక ఓ కథ ఉంది. హిరణ్యకశిపుని వంశానికి చెందిన నికుంభుడనే రాక్షరాజు కుమారులు సుందోపసుందులు. అన్నదమ్ములిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు. ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే లోకం వారిద్దరినీ కలిపి ‘సుందోపసుందులు’ అని ఒకే పేరుతో వ్యవహరించేది. ఒకే కంచం, ఒకే మంచం అన్నట్లుగానే వీరి అన్యోన్యత సాగేది. అయితే ప్రపంచమంతా జయించాలన్న కోరిక చిన్నతనంలోనే వారికి కలిగింది. ముల్లోకాల్లోని దేవతలు, మునులు, చక్రవర్తులు, యోధులను కేవలం భుజబలంతో ఓడించలేమని నార వస్త్రాలు ధరించి వింధ్య పర్వతం మీద కూర్చుని తపస్సు ప్రారంభించారు. వారి కఠోర తపస్సు వల్ల పుట్టిన వేడికి భయపడ్డ దేవతలు ఎన్నో విఘ్నాలు కలిగించారు.
సుందోపసుందులు వినిపించుకోలేదు.

సుందోపసుందులవారి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రాది దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వరదలతో ముంచెత్తినా, రత్నాలను ఆశపెట్టినా, అప్సరసలు అలరించినా… సుందోపసుందుల తపస్సు ఆగలేదు. వారి తపోదీక్షకు ప్రకృతే స్తంభించిపోయి, లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. చివరికి వారి కోరికలను మన్నించేందుకు బ్రహ్మ ప్రత్యక్షం కాక తప్పలేదు. బ్రహ్మదేవుడు.. సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

తమ తపస్సుకి మెచ్చి ప్రత్యేక్షమైన బ్రహ్మను చూసిన సుందోపసుందులు ముకుళిత హస్తాలతో ఆయనను ప్రార్థించారు. ‘మాకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోవాలి. ఏ మాయ చేయాలంటే ఆ మాయను చేయగలగాలి. కానీ చావు మాత్రం అన్యుల చేతుల్లో ఉండకూడదు’ అని టకటకా వరాలను కోరుకున్నారు సుందోపసుందులు. వారి వరాలకి బ్రహ్మ తథాస్తు చెప్పడంతో సుందోపసుందుల తపస్సు ఆగింది. కానీ, లోకులకు మాత్రం కష్టాలు మొదలయ్యాయి. అసలే రాక్షసులు, ఆపై గొప్ప వరాలను పొందారు… ఇక వారి ఆగడాలకి అడ్డూఅదుపూ లేకుండా పోయింది.

బ్రహ్మ వరంతో సుందోపసుందులు విజృంభించారు. వారి ధాటికి ముల్లోకాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. మునుల ఆశ్రమాలపై మదపుటేనుగుల్లా, తోడేళ్ళలా, సింహాల్లా కామరూపాలతో దాడి చేసేవారు. ముల్లోకాలూ అల్లకల్లోలమయ్యాయి. వారి దారుణాలను భరించలేక దేవ గంధర్వ సిద్ధ గణాలు బ్రహ్మను వేడుకున్నారు.‘అన్యుల (ఇతరులు) చేతుల్లో వారికి మరణం ఉండదని వరమిచ్చిన మాట నిజమే! అంటే వారిలో వారు కొట్టుకు చచ్చే అవకాశం ఉందనేగా’ అన్నాడు బ్రహ్మ చిరునవ్వుతో. మరి అంతటి అన్యోన్యంగా మెసిలే సోదరుల మధ్య ముసలం పుట్టించేదెలా? ఆ పనికోసం విశ్వకర్మను పిలిచిన విధాత నీ ప్రతిభనంతా ఉపయోగించి అతిలోక సౌందర్యరాశిని సృష్టించాలని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ దేవుని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ ఒక దివ్య సుందరిని తయారుచేశాడు.

ముల్లోకాల్లో ఏ పదార్థం శ్రేష్టమైనదో దానిని ఆ సుందరి శరీరంలో అమర్చాడు. ఆ యువతి అవయవాల్లో ఎన్నో రత్నాలను పొదిగాడు. వాటితో ఆమె రత్న కిరణాలను వెదజల్లింది. లక్ష్మీ శరీరం దాల్చినట్లు ఆ కామరూపిణి సర్వప్రాణుల చూపులను ఆకర్షించింది. ఉత్తమ రత్నాలను నువ్వుగింజ పరిమాణంలో తీసి ఆమె శరీరాన్ని నిర్మించుట చేత బ్రహ్మ ఆమెకు తిలోత్తమ అన్న నామకరణం చేశాడు.

తిల అంటే నువ్వులు. బ్రహ్మ ఆమెకు ప్రాణప్రతిష్ట చేయగానే ఆ సుందరి లేచి నమస్కరించి ఇలా అంది ‘‘నాపై ఏ కార్యభారాన్ని ఉంచదలచి ఈ శరీర నిర్మాణాన్ని చేయంచావు?’’అప్పుడు బ్రహ్మ ఆమెతో ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ! నీవు సుందోపసుందుల దగ్గరకు వెళ్లి నీ రూపంతో వారిని ప్రలోభపెట్టు. నిన్ను పొందాలనే తీవ్రమైన కోరిక వారికి కలిగించు. వారికి పరస్పర విరోధం కలిగేటట్లు చెయ్యి’’. బ్రహ్మ పలుకులు విన్న తిలోత్తమ దానికి అంగీకరించి అక్కడ ఉన్న దేవతలకు ప్రదక్షిణం చేసింది. ఆమె దేవతలు, ఋషులు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆమె ఎటువైపు వెళ్ళితే అటువైపు వారి ముఖాల చూపులు లగ్నమయ్యాయి.

దేవతలనే మోహపరవశులను చేసిన ఆమె సుందోప సుందులను కచ్చితంగా ప్రలోభపెట్టగలదని వారు భావించారు. అనుకున్నట్లే తమ కళ్ల ముందు తిలోత్తమ కనిపించగానే సుందోపసుందులకు మతులు పోయాయి. అత్యంత సౌందర్యవతి అయిన ఆ స్త్రీని చూడగానే మతి స్థితిమితం తప్పింది. ఆమె నాదంటే నాదని ఆశపడ్డారు. అంతే ఇద్దరిలో ఒకరిపై ఒకరికి అసూయ జనించింది. అసూయతోనే ఒకరికంటే మరొకరు అధికులమని భావించారు. తిలోత్తమ సౌందర్యంతో మోహితులైన వారిలో స్నేహం, సోదర ప్రేమ నశించాయి. అన్నదమ్ముల మైత్రి ఆమడదూరం పోయంది. ఎవరికి వారు గొప్ప అనుకొన్నారు.

అయితే ‘మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో మీరే తేల్చుకోండి,’ అంటూ వారిని మరింతగా ఉసిగొల్పింది తిలోత్తమ. ఇంకేం ముష్టిఘాతాలతో, గదాయుద్ధాలతో ఒకరి మీద ఒకరు కలియబడ్డారు సుందోపసుందులు. ఇద్దరూ సరిసమానులే. ఇద్దరూ అపరపరాక్రమవంతులే. ఇద్దరూ వరసంపన్నులే.. అందుకని ఇద్దరికీ ఓటమే మిగిలింది. వారి శరీరాలు రక్తసికాలైనాయి. ఒకరినొకరు కొట్టుకున్న గదాఘాతాలతో వారిద్దరూ భూమిపై పడి హతులయ్యారు. ఇద్దరికీ చావే దక్కింది. మిగిలిన రాక్షసులు పాతాళానికి పారిపోయ ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ తర్వాత స్వర్గం మరల దేవతలకు లభించింది.

 

Exit mobile version