Home Unknown facts పురాణంలో చెప్పబడిన 49 అగ్నులు ఎవరో తెలుసా ?

పురాణంలో చెప్పబడిన 49 అగ్నులు ఎవరో తెలుసా ?

0

వేదకాలం నుండి సర్వదేవతారాధనలో అగ్నికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. అనాది కాలం నుండి మానవ జీవితంలో కూడా అగ్ని ప్రముఖ స్థానం ఆక్రమించింది. వైదిక ఋషులు అగ్నిని భగవంతుడుగా పూజించారు. అగ్ని మిగిలిన దేవతలందరికి హవ్యాన్ని మోసుకుపోతాడని, దేవతలు అగ్ని ముఖులని వైదిక వాజ్ఞ్మయం చెబుతుంది. అగ్నిదేవుని గురించి ఋగ్వేదంలోను, అథర్వణ వేదంలోను విరివిగా మంత్రాలు కనబడతాయి.

Agni Devuduఈ మంత్రాలను చూసే కాబోలు పాశ్చాత్యులు ముందు మనను అగ్ని ఆరాధకులు అని అంటారు. అగ్ని దేవుడు అష్టదిక్పాలకులలో ఒకడుగా గుర్తింప బడ్డాడు. అష్టదిక్పాలకులలో ఆగ్నేయానికి అధిపతి ఈయన. అగ్నికి మత పరంగా కూడా శ్రేష్ఠత్వం ఉంది. అన్ని పురాణాలలోను అగ్నిదేవుని గురించి ఆయన ప్రశస్తి గురించి తరచు ప్రస్తావిస్తూ ఉంటారు. విష్ణుపురాణం అగ్ని దేవుని పుట్టుక గురించి, ఆయన సంతానం గురించి వివరంగా చెబుతుంది. భాగవతం కూడా వివరణ ఇస్తుంది. ఇక అగ్ని పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం లోను ఆయన ప్రాభవం గురించి వివరణ వుంటుంది. అలాంటి అగ్ని దేవుని గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకుందాం.

అగ్నిదేవుడు బ్రహ్మ మానస పుత్రుడు. విరాట్పురుషుని నోటి నుండి ప్రభావించాడు. ఆయనను “అభిమాని” అని అంటారు. ఈయన సహోదరి మేధాదేవి. ఈయన భార్య స్వాహా దేవి, లక్ష్మీ అంశతో పుట్టింది, దక్ష పుత్రిక. వీరికి ముగ్గురు కొడుకులు – పావకుడు (విద్యుత్ అగ్ని), పవమానుడు (రాపిడి అగ్ని), శుచి (సౌర అగ్ని). వీరిలో పావకునికి స్వధా దేవి వలన కవ్య వాహనుడు అనే మరొక అగ్ని పుడతాడు. ఈయన పితృదేవతాగ్ని. స్వధా దేవికి మేనాదేవి, ధరణి దేవి అని ఇద్దరు కుమార్తెలు.

శుచి అనే అగ్ని వలన హవ్యవాహనుడు జనిస్తాడు. ఈయన దేవతాగ్ని. పవమానునికి సహరక్షకుడు పుత్రుడు. ఈయన రాక్షసాగ్ని. వీరు కాక మరొక 42 మంది అగ్నులు కలుగుతారు వీరి ముగ్గురికి. శుచి మరియు పవమానుని భార్యల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. వీరు దక్షుని పౌత్రికలను వివాహమాడినట్టు తప్ప వారి పేర్లు, విశేషాలు వివరించి ఉండలేదు. ఈ 45 గురు మనవలు, ముగ్గురు కొడుకులతో అగ్ని దేవుని కలుపుకుని మనకు పురాణం 49 అగ్నులు అని చెబుతుంది.

పురాణం పది రకాల అగ్నుల గురించి ప్రస్తావిస్తుంది:

1. అగ్ని – నిత్య జీవితంలో మనం చూసేది, తైలాలో దాగి ఉన్న అగ్ని.

2. దావాగ్ని – మెరుపులలో దాగి ఉన్న అగ్ని, అరణ్యాలను దహింపగలిగేది.

3. దివ్యాగ్ని – సూర్యునిలో దాగి ఉన్న అగ్ని, దివ్యమైనది, లోకాలను ప్రకాశింపచేసేది.

4. వైశ్వానర – సమస్త ప్రాణులలో దాగి ఉండి, వారు తిన్న అన్నాన్ని అరిగింప చేసేది, ఇదే ప్రాణం నిలబెడుతుంది.

5. బడబాగ్ని – అతి ఘోర రూపం. సముద్రాల కింద దాగుకుని ఉన్నది, ప్రపంచాన్ని దహింప చేసేటువంటిది.

6. బ్రహ్మాగ్ని – అపారమైన అగ్ని, మధనం ద్వారా పుట్టేది.

7. ప్రాజపత్యాగ్ని – పుత్రపౌత్రులను అనుగ్రహించే అగ్ని. బ్రహ్మచారి తన ఉపనయనం తరువాత ఉంచుకోవలసింది, చివరకు అడవులకు వనప్రస్థానికి వెళ్ళే వరకు ఉండేది.

8. గార్హపత్యాగ్ని – గృహస్థాశ్రమనియమాలలో ఇది ఒకటి. మొదటి అన్న నైవేద్యాన్ని సమర్పించవలసిన అగ్ని.

9. దక్షిణాగ్ని – పితృ దేవతలకు నివేదన చేసే అగ్ని. అభిచార హోమాలకు కూడా

10. క్రవ్యాదాగ్ని – స్మశానంలో శరీరాన్నిదహించే అగ్ని. ఒక వ్యక్తి తన శరీరాన్ని ఆఖరకు సమర్పించుకునే అగ్ని.

 

Exit mobile version