వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటాన్ని పరమపద సోపాన పటము అని కూడా వ్యవహరిస్తారు. వైకుంఠపాళీ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు దిగువన పాములు, ఏనుగులు ఉంటాయి. అది పాతాళమనీ, ఆ ఏనుగులు అష్టదిగ్గజాలనీ పైనున్న భూమిని ఆ ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయని హిందువుల విశ్వాసం.
ఆట ప్రారంభించే ముందు ఆటగాళ్ళు తమ తమ ఆటకాయలను పాతాళంలో ఉంచి పందెం వేస్తూ పాచికలను బట్టి ఆటకాయలను నడుపుతూ ఉంటారు. ఆరు గవ్వలుగాని లేదా పాచికలుగాని పందెం వేస్తూ ఆడుతారు. ఈ ఆటను ఎందరైనా ఆడవచ్చు. అయితే ఆడే వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఆట కాయలు ముందుగా ముందే నిర్ణయించుకోవాలి.
ఈ పటంలో నిచ్చెనలు ఉన్నట్లుగానే అక్కడక్కడ పాములు కూడా ఉన్నాయి. ఆటకాయ నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్లే పాము తల దగ్గరికి ఆటకాయ వచ్చినప్పుడు పాము కరిచి/మింగి ఆటకాయ పాము తోక చివరివరకూ కిందికి దిగిపోతుంది. అయితే ఈ ఆటను ఎప్పుడు ఎవరు ప్రారంభించారు అనే విషయాన్ని తెలుసుకుందాం.
పదమూడవ శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ముని పిల్లలు ఆడుకునే ఒక ఆట తయారు చేసాడు. ఆ ఆట పేరు మోక్ష ప్రదం. ఆ తరువాతి కాలంలో బ్రిటిష్ వారు వచ్చి దేశాన్ని పాలిస్తున్నప్పుడు ఈ మోక్షప్రదం ఆటను కాస్త స్నేక్ అండ్ లాడర్ గేమ్ గా మార్చేశారు. మన సంప్రదాయాలు, ఆచారాలతో పాటు దీన్ని కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు బ్రిటీష్ వారు. ఆనాటి నుండి ఈ ఆటను వైకుంఠపాళీగా మనవాళ్ళు పిలుస్తారు.