Home Unknown facts వరలక్ష్మి వ్రతం కి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ? అసలు ఎలా ఆచరించాలి

వరలక్ష్మి వ్రతం కి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు ? అసలు ఎలా ఆచరించాలి

0

వరలక్ష్మీ వ్రతం.. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆచారం. ఈ వరలక్ష్మి వ్రతం తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విధిగా జరుపుకుంటారు.. వరలక్ష్మి అంటే విష్ణుసతి ఐన లక్ష్మి దేవి అవతారం.. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ దేవత పూజలకు సమానం అనే నమ్మకం. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. మరి వరలక్ష్మి వ్రతం కి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు.. అసలు ఎలా ఆచరించాలి.. మనం ఇపుడు తెల్సుకుందాం..’

Varalakshmi Vratamవరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించినట్లు స్కాంద పురాణంలో ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడు. ఇదే సందర్భంలో శివుడు చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది.

ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరి దేవికి చెప్పినట్లు పురాణ కథనం. ఇది విన్న పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

విష్ణుమూర్తికి ఇష్టమైన, పైగా జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్రం చెపుతుంది… సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

ఇక వ్రత విధానానికి వస్తే తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నైవేద్యంగా పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువను మహాలక్ష్మీగా భావించి తాంబూల వాయనమీయవలెను. అయితే వరలక్ష్మీ వ్రతం పూజలో ముఖ్యమైనది తోరం.. తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానిని భక్తితో పూజ చేసి ధరించాలి.. మిగిలిన ఉపచారాలు ఎవరి శక్తి కొలది వారు చేసినా.. తోర ధారణ మాత్రం తోరణ పూజ తరవాతే జరగాలి..

Exit mobile version