Home Unknown facts తన తల్లి వలన శిశుపాలుడు పొందిన వరం ఏమిటి ?

తన తల్లి వలన శిశుపాలుడు పొందిన వరం ఏమిటి ?

0

సనత్ కుమారుల శాపానికి గురైన జయ, విజయులు వారి మూడో జన్మగా కృష్ణుని శత్రువులుగా శిశుపాలుడు, దంతవక్త్రుడుగా పుట్టారు.చేదిదేశానికి రాజైన దమఘోషుడికి కుమారుడుగా శిశుపాలుడు నాలుగు చేతులతో, మూడు కన్నులతో పుట్టాడు. ఎవరు ఎత్తుకున్నప్పుడు మూడో కన్ను, రెండు చేతులు మాయమవుతాయో అతని చేతనే చంపబడతాడని ఆకాశవాణి చెప్పింది. శిశుపాలుడి తల్లి సాత్వతి వచ్చిన వారందరికీ పిల్లవాణ్ణి ఎత్తుకోమని ఇస్తుండేది.

శిశుపాలునికృష్ణ బలరాములకు సాత్వతి అత్త అవుతుంది. ఒకసారి తన దర్శనార్ధం వచ్చిన కృష్ణునికి తన పిల్లవాణ్ణి ఇచ్చింది. కృష్ణుడు ఎత్తుకోగానే పిల్లవాడు సాధారణ రూపానికి వచ్చాడు.తనపుత్రుణ్ణి చంపేస్తాడనే భయంతో శిశుపాలుడిని నూరు తప్పుల వరకు విడిచి పెట్టమని సాత్వతి అర్థించింది. కృష్ణుడు అలాగేనని ఆమెకు మాట ఇచ్చాడు.

శిశుపాలుడు రాజై జరాసంధుడితో చేరి అత్యాచారాలూ, అపరాధాలు చేస్తూ వచ్చాడు. అతడికి తమ్ముడు దంతవక్త్రుడు తోడయ్యాడు. జరాసంధుడు మాటిమాటికీ మధురా నగరంపై దాడి చేస్తూంటే కృష్ణుడు పలు మార్లు ఓడించి, తరిమికొట్టి, దుర్మార్గులైన రాజులెందర్నో కడతేర్చాడు.

కృష్ణుడు సముద్రుణ్ణి చోటు అడిగి సముద్ర మధ్యంలో విశ్వకర్మచేత సురక్షతమైన ద్వారకానగరాన్ని వైభవోపేతంగా నిర్మింపజేసి తనవారినందరినీ ద్వారకకు తరలించాడు. జరాసంధుడు చివరిసారిగా శిశుపాలుడు, దంతవక్త్రుడు, పౌండ్రకుడు, సాళ్వుడు మొదలైన తన అనుచరులైన రాజులందర్నీ కూడగట్టుకొని మధురను ముట్టడించాడు.

అంతకుముందే యాదవుల్ని, మధురా ప్రజలను ద్వారకకు పంపించిన కృష్ణ బలరాములు ప్రవర్షణగిరికి చేరుకొని శిఖరాగ్రాన్ని అధిరోహించారు. జరాసందుడు ప్రవర్షణ గిరి చుట్టూరా మంటను పెట్టి గిరిని కాల్చాడు. కృష్ణ బలరాములు ఆకాశ మార్గాన ద్వారకకు సురక్షతంగా చేరుకున్నారు. జరాసంధుడూ, శిశుపాలుడూ కృష్ణ బలరాములు దగ్థమై ఉంటారని పొంగిపోతూ వెళ్తుంటే, ద్వారక నుండి కృష్ణుడు పూరించిన శంఖధ్వని విని తెల్లముఖాలతో ఒకర్నొకరు చూసుకున్నారు.

శిశుపాలుడు అక్కసుకొద్దీ మధురా నగరాన్ని నిప్పుపెట్టి కాల్చాడు. జరాసంధుడు నౌకల మీద ద్వారకను ముట్టడించాలని సైన్యాలను పంపాడు. పెను తుఫానులో చిక్కుకొని నౌకలన్నీ మునిగిపోయాయి. ఒడ్డున ఎదురు చూస్తున్న జరాసంధునికి సముద్ర మధ్యలో ఒక గుట్ట మీదనిల్చుని నవ్వుతున్న కృష్ణుడు కనిపించాడు. ‘‘జరాసంధా! ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. ద్వారకకు సముద్రుడు నిన్ను చేరనివ్వడు. నీకు నా చేతిలో చచ్చే అదృష్టం లేదు.నీ సమబలుడైన వాడిచేత చస్తావు. కొంతకాలం గతించాక మళ్లీ పునర్దర్శనం, వెళ్ళు!’’ అన్నాడు కృష్ణుడు.

తరువాత కొంతకాలానికి విదర్భ రాజైన భీష్మకుడికి కుమార్తెగా లక్ష్మి రుక్మిణిగా పుట్టింది. బాల్యం నుండి కృష్ణుడే తన నాథుడని చెప్పుకునేది. అటువంటి రుక్మిణిని, రుక్మిణి అన్న రుక్మి కృష్ణుని శత్రువర్గంలో చేరి చెల్లెలికి శిశుపాలుడితో వివాహం చెయ్యడానికి సర్వసన్నాహాలు చేశాడు. ఆ వివాహం తప్పించి తనను చేపట్టి రక్షంచమని రుక్మిణి కృష్ణుడికి తమ పురోహితుడి ద్వారా కబురు పంపింది.

పెళ్ళికి ముందు రుక్మిణి దుర్గను పూజించి, ఆలయం నుంచి వస్తూండగా, కృష్ణుడు రుక్మిణి చేయిపట్టి నాలుగు గుర్రాలు ఉన్న తన రథం మీదికి ఎక్కించుకున్నాడు. రుక్మి, శిశుపాల, జరాసందులు ఎదుర్కున్నారు. బలరాముడు యాదవ వీరులతో వెనుకనే వచ్చి తమ్ముడితో కలిశాడు.

కృష్ణుడు శిశుపాలుణ్ణి తరిమికొట్టాడు. బలరాముడు జరాసంధుడిని ఓడించి తరిమాడు. శత్రు రాజులందర్ని కృష్ణ బలరాములు చిందర వందర చేశారు. కృష్ణుడు విజయశంఖం పూరించి రుక్మిణిని రథం మీద ఎత్తుకుపోతూంటే వెంట తలపడిన రుక్మిని ఓడించి జుట్టూ, మీసం తీసి విడిచి పెట్టాడు. రుక్మి ఇంకెప్పుడు కృష్ణుడి జోలికి పోలేదు.

అలా తీసుకువచ్చిన రుక్మిణీ కళ్యాణం కృష్ణుడితో ద్వారకలో ఎంతో వైభవంగా జరిగింది. అప్పటికీ శిశుపాలుని వంద తప్పులు పూర్తి కాలేదు. తరువాత కొంతకాలానికి ధర్మరాజు మయసభను ఏర్పాటు చేసి అందర్ని ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడు, శిశుపాలుడు కూడా అక్కడికి వచ్చారు. తన నూరు తప్పుల సంగతి మర్చిపోయి ఆ సభలో శిశుపాలుడు ద్రౌపతి గురించి తప్పుగా మాట్లాడాడు, అంతటితో శిశుపాలుని వంద తప్పులు పూర్తి అయ్యాయి. అదే సభలో అందరి ముందు కృష్ణుడు శిశుపాలుని వధించాడు.

Exit mobile version