వెంకటేశ్వర స్వామి ముస్లీమ్ లకు అల్లుడు అనే విషయం మనకు తెలిసిందే… అయితే తను చేసిన అపరాధాలకు గజినీ మహ్మద్ కళ్ళు కూడా తెరిపించిన విషయం చాలా మందికి తెలియదు. పూర్వం గజనీ మహ్మద్ అనే రాజు వుండేవాడు. అతనికి ఒక కుమార్తె పుట్టింది. ఆమె ఎంతో అందగత్తె అతిలోక సుందరిగా పేరు గాంచింది. కొన్నాళ్ల తరువాత ఆమె యుక్త వయసుకు వచ్చింది. కన్యాంత:పురానికి రాజభటులు చాలా జాగ్రత్తగా కావలి కాస్తుండేవారు. ఆమె కన్యత్వాన్ని కాపాడటం కోసం రాజభటులు రాత్రివేళ్లలో ఒక్క క్షణం కూడా నిద్రించేవారు కాదు. ఇంత భద్రత వున్నప్పటికీ.. ఒకనాడు అర్థరాత్రి సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు మానవరూపంతో కన్యాంత:పురంలోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న సుల్తాన్ కూతురిని లేపి.. తన గురించి అన్ని విషయాలను చెప్పాడు.
ఆమె అతనిని చూసి ముగ్ధురాలయిపోతుంది. అతడు, ఆమెతో.. ‘‘నేను ఇలా నిన్ను కలవడానికి వచ్చినట్లు ఎవ్వరితో చెప్పకు’’ అని చెప్పగా.. దానికి ఆమె అంగీకరిస్తుంది. కొన్నాళ్లవరకు ఇలా జరగగా… ఒక కావలి ఈ తతంగం మొత్తాన్ని తెలుసుకుంటాడు. వెంటనే అతను సుల్తాన్ దగ్గరకు వెళ్లి.. ‘‘హుజూర్! మేము ఎంతో జాగ్రత్తగా యువరాణిని కాపాడుతున్నప్పటికీ.. ఎవరో ఒక వ్యక్తి కన్యాంత:పురంలోకి ప్రవేశించి, యువరాణితో మాట్లాడుతున్నాడు’’ అని చెబుతాడు. ఈ మాట విని సుల్తాన్ కోపాద్రిక్తుడై వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్లి… ‘‘నీ దగ్గరకు వస్తున్న ఆ పురుషుడు ఎవరో చెప్పు’’ అని ఆమెను నిర్బంధిస్తాడు. అయినా ఆమె నోరు మెదపకుండా అలాగే వుండిపోయింది.
దాంతో సుల్తాన్ ఆగ్రహంతో తన ఖడ్గాన్ని తీసి, కూతురి తల నరబోతుండగా.. అక్కడే విగ్రహ రూపంలో వున్న శ్రీనివాసుడు వెంటనే సుల్తాన్ ముందకొచ్చి నిలబడ్డాడు. శ్రీనివాసుడు, సుల్తాన్ చేయి పట్టుకొని.. ‘‘ఓయీ మహ్మదూ! ఆనాడు నువ్వు బలాత్కారంతో నా వరాన్ని పొందావు. ఇది సాధుమార్గం కాకపోవడం వల్ల నువ్వు స్వధర్మ భ్రష్ఠుడివై యవన రాజువయ్యావు. ఇంకా నీ అజ్ఞానం తొలగలేదు. ఒకప్పుడు నువ్వు ఆదరించిన సనాతన హిందూమతాన్ని కూలద్రోయటానికి ప్రయత్నిస్తున్నావు. మతధర్మాలు వేరైనప్పటికీ దైవం ఒక్కటేనని గ్రహించలేకపోతున్నావ్. నేను నీకు జ్ఞానోపదేశం చేయడానికే ఇక్కడికి వచ్చాడు. నువ్వు హింసించిన అర్చకులు నీ దయకోసం ప్రాకులాడుతూ నీ కోటముందుకు చేరుకున్నారు. నువ్వు ధ్వంసం చేయించిన దేవాలయాలను తిరిగి నిర్మించి.. అందులో విగ్రహాలు, లింగాలను పున:ప్రతిష్టించు. అర్చకులందరికీ జీవనోపాధికి సరిపోయే జీతాలిచ్చి పంపించు. లేకుంటే నీ దగ్గరున్న సర్వసంపదలు నాశనం అవుతాయి’’ అని హెచ్చరించి, తిరిగి విగ్రహంగా మారిపోయాడు.అక్కడున్న వారందరూ అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి, ఆశ్చర్యపోయి అలాగే వుండిపోయారు.
గజనీ మహ్మద్.. తనకు స్వయంగా వెంకటేశ్వరుడే కనిపించి, హితబోధ చేసినందుకు ఎంతగానో సంతోషించాడు. గతంలో తాను చేసిన అకార్యాల గురించి విచారించసాగాడు. అర్చకులందరినీ పిలిపించి, వారికి తగిన సత్కారాలు, భోజనాలు వడ్డించి.. ‘‘మీమీ ఆలయాలను తిరిగి నిర్మించుకుని, దేవతావిగ్రహాలను ప్రతిష్టించుకోండి’’ అని చెప్పాడు. అందుకు కావలసిన ధనాన్ని ఉదారంగానే ఇచ్చి.. వారి జీవనోపాధికి అవసరమయ్యే మూల్యం ఇచ్చి, అక్కడి నుండి పంపించేశాడు.
అలా చివరికి తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి అర్చకులు అక్కడ మిగిలిపోయారు. వారు సుల్తాన్ దగ్గరికి వెళ్లి.. ‘‘మహాప్రభో! మీరు అర్చకులందరిని సన్మానించి పంపించేశారు. మేము కూడా వెంకటేశ్వర స్వామి వారి అర్చకులం. మాక్కూడా దేవుని విగ్రహాన్నిచ్చి పంపండి’’ అని ప్రార్థించసాగారు. అప్పుడు గజనీ మహ్మద్ తన ఇంట్లో వున్న వెంకటేశ్వర విగ్రహాన్ని వారికి సమర్పించాడు. తను చేసిన అపరాధాలకు పరిహారంగా తన కుమార్తెను ఆయన సేవకు సమర్పించాడు. రథాలు, ఏనుగులు, గుర్రాలను, ఇంకా ఇతర సామాగ్రిని వెంకటేశ్వరునికి కానుకగా ఇచ్చి.. నిత్యం ధూపదీప నైవేద్యాలకోసం కొన్ని గ్రామాలను రాసిచ్చి, సాగనంపాడు. సుల్తాన్ కుమార్తె జీవనోపాధికోసం రెండు గ్రామాలను, వాటిని రక్షించడానికి సైన్యాన్ని పంపించాడు. సుల్తాన్ కుమార్తె కూడా కొంత దూరం వెళ్లి.. తిరిగి వెనకకు మరలి వచ్చేసింది.