త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మదేవుడు. తల రాతను రాసె ఆ బ్రహ్మ దేవుడికి తప్ప మిగతా అందరి దేవుళ్ళకి ఆలయాలు అనేవి ఉన్నాయి. అయితే ఒక శాపం కారణంగా బ్రహ్మకి ఆలయాలు అనేవి లేవని పురాణాలూ చెబుతున్నాయి. మరి బ్రహ్మ పాదం ఉందని చెప్పే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కాట్రేని కోన మండలం నుండి కొన్ని కిలోమీటర్లు అడవుల మధ్య నుండి పడవ ప్రయాణం చేస్తే ఒక ద్విపం వస్తుంది. ఆ ద్విపాన్నే బ్రహ్మ సమేధ్యం అని పిలుస్తుంటారు. ఈ ఆలయంలోనే బ్రహ్మేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడి పూర్తి రూపం అంటూ ఉండదు. బ్రహ్మ పాదాలు మాత్రమే ఉంటాయి. ఒకవైపు సముద్రం, మరొకవైపు గోదావరి నది ఉండగా వాటి మధ్య ప్రదేశంలో ఈ ఆలయం అనేది ఉంది.
ఇక బ్రహ్మ దేవుడికి ఎందుకు ఆలయాలు ఉండవు అనే విషయంలోకి వెళితే, సప్తఋషులలో ఒకరైన భృగు మహర్షి మొట్టమొదటి జ్యోతిష్య రచయిత. ఇది ఇలా ఉంటె, ఒకరోజు మునులందరూ ఒకచోట ఉన్నప్పుడు వారికీ ఒక సందేహం కలిగింది, మనకి ఉన్న త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే విషయం పైన చర్చకి రాగ వారందరు కలసి వీరిలో ఎవరు గొప్ప అనేది నీవే తేల్చాలని భృగు మహర్షిని కోరగా అప్పుడు భృగు మహర్షి ముందుగా బ్రహ్మ లోకానికి వెళ్లగా బ్రహ్మ దేవుడు చూసి చూడనట్టుగా ఉండటంతో ఆగ్రహించిన మహర్షి నీవు భూలోకంలో పూజకి అనర్హుడివి, నీకు ఎటువంటి ఆలయాలు అనేవి ఉండవు అని శపించాడని పురాణం.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, బ్రహ్మ సమేధ్యంలో సంవత్సరానికి ఒకసారి చొల్లంగి అమావాస్య నాడు రాత్రి సమయంలో జాతర అనేది జరుగుతుంది. అంతేకాకుండా 8 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అర్దోదయము, మహోదయము సమయంలో అమావాస్య రోజున భక్తులు సాయంత్రం సమయంలో గోదావరి నదిలో స్నానం ఆచరించి ఆలయంలో జరిగే జాతర లో పాల్గొని, సూర్యోదయం సమయంలో పక్కనే ఉన్న సముద్ర సంగమ స్నానం చేసి ఆలయంలో ఉన్న బ్రహ్మ దేవుని పాదాలకు అర్చన చేస్తారు.
ఈవిధంగా అర్దోదయము, మహోదయము సమయంలో గోదావరి, సముద్ర స్నానం ఆచరించడం వలన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మరియు 8 సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర సమయంలోనే భక్తులు వస్తుంటారు.