Home Unknown facts హనుమ తల్లి అయినా అంజనాదేవి జన్మ రహస్యం ఏంటో తెలుసా ?

హనుమ తల్లి అయినా అంజనాదేవి జన్మ రహస్యం ఏంటో తెలుసా ?

0

పూర్వం ఒక మహర్షి శివుని కోసం కొన్ని వందల సంవత్సరాలపాటు ఘోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు అమరావతీ నగరానికి రాజయిన ఇంద్రుడు ఆ ముని చేస్తున్న ఘోరతపస్సును చూసి ఎక్కడ తన అమరావతీ నగరాన్ని శివునితో వరంగా కోరుకుంటాడోనన్న భయం అతనిలో కలుగుతుంది. దాంతో ఇంద్రుడు ఎలాగైనా ఆ మహర్షి తపస్సుకు భంగం కలిగించాలని నిర్ణయించుకుంటాడు.

అంజనాదేవిఅప్పుడు ఇంద్రుడు తన రాజ్యంలో వున్న ‘‘పుంజికస్థల’’ అనే అప్సరసను ముని తపమును భంగం కలిగించాల్సిందిగా ఆజ్ఞాపించి, పంపిస్తాడు. మునిని చూసి ఆ అప్సరస లోలోపల భయపడుతున్నప్పటికీ చేసేదేమీలేక అతని తపము భంగం కలిగించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంది. తన అందాచందాలతో, నృత్యగీతాలతో ఆ మహర్షి తపస్సుకు భంగం కలిగిస్తుంది. తన తపస్సును భంగం కలిగించిందన్న కోపంతో మహర్షి ఆమెను ‘‘నువ్వు వానర యోనియందు వానరం అయి జన్మించుగాక’’ అని శపిస్తాడు.

అప్పుడు ఆ అప్సరస భయంతో ఎలాగైనా తనను ఈ శాపం నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుకుంటూ వినయభావంతో అనేక రకాలుగా ప్రార్థిస్తుంది. చివరికి ఆ ముని ఆమెను అనుగ్రహించి ‘‘నువ్వు ఎప్పుడు ఏ రూపం ధరించాలని అనుకుంటావో అప్పుడు ఆ రూపాన్ని నువ్వు పొందవచ్చు’’ అని వరాన్ని ప్రసాదిస్తాడు.

కొన్నాళ్ల తరువాత ముని విధించిన శాపం వల్ల ఆ పుంజికస్థల అనే అప్సరస వానరిగా జన్మిస్తుంది. ఆమెకు నచ్చిన విధంగా యదేచ్ఛగా సంచరించేందుకు కూడా అవకాశం లభించింది. ఈమే ‘‘అంజనాదేవి’’. ఈమె వానర రాజు అయిన కేసరిని వివాహం చేసుకుంది. ఎంతో అందగత్తె అయిన అంజనాదేవిని కేసరి చాలా అనురాగంతో చూసుకునేవాడు. ఆమెకు అన్నివిధాలుగా సౌకర్యాలను కల్పించేవాడు.

ఒకానొకరోజు ఈ వానర దంపతులు మానవ రూపాలను ధరించి తమ రాజ్యంలోనే తిరుగుతారు. సంతోషంగా విహరిస్తున్న సమయంలో వాయువు చాలా వేగంగా వీస్తుంది. అప్పుడు గాలి వేగం అంజనాదేవి చీర చెంగును ఎగరగొడుతుంది. దాంతో ఆమెను ఎవరో తాకినట్టు అనిపిస్తుంది. దానికి ఆమె కోపంతో ‘‘నా పాతవ్రత్యాన్ని భంగం కలిగించడానికి సాహసించింది ఎవరు? నేనిప్పుడే వారిని శపిస్తాను’’ అని చెబుతుంది.

అందుకు సమాధానంగా వాయుదేవుడు ‘‘దేవీ నేను వాయుదేవుడిని. నా స్పర్శవల్ల నీ పాతివ్రత్యము భంగం కాలేదు. అయితే శక్తిలో నాతో సమానమైన ఒక సుపుత్రుడు నీకు కలుగుతాడు. నేను అతనిని అన్నివేళలా రక్షిస్తాను. అంతేకాదు బాలల నుంచి పెద్దలవరకు అందరూ అతనిని ఆధ్యాత్మికంగా ఆదరిస్తారు. ఎవరు అతనిని తిరస్కరించేవారు వుండరు. అతడు భగవంతునికి సేవ చేసుకుంటూ ఆదర్శమార్గంలో సత్కీర్తిని పొందుతాడు’’ అని చెబుతాడు. తరువాత కేసరీదంపతులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాయుదేవుడు చెప్పిన విధంగా శివుడి అంశతో అంజనాదేవికి శ్రీమత్ వైశాఖ బహుళ దశమినాడు పరాక్రమవంతుడైన హనుమంతుడు అవతరిస్తాడు.

 

Exit mobile version