Home Unknown facts సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జ్యోతిరూపుడిగా దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉంది?

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జ్యోతిరూపుడిగా దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉంది?

0

మన దేశంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వెలసిన ఎన్నో ప్రసిద్ద ఆలయాలు ఉండగా అందులో ఈ ఆలయం కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఆలయం లో విశేషం ఏంటంటే ఆ స్వామి రెండు చేతులు ఖండించబడిన స్వయంభూస్వామి గా, జ్యోతిరూపుడిగా దర్శనమిస్తున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Subramanya Swamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు నుండి 96 కీ.మీ. దూరంలో, చిట్టమూరు మండలం, మల్లం గ్రామంలో నాయుడు పేటకు సమీపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈఆలయాన్ని క్రీ.శ. 11 వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళ చక్రవర్తి విస్తరించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి గోడలపైన తమిళ శాసనం అనేది మనకి కనిపిస్తుంది.

ఇక ఈ ఆలయ పురాణం విషయానికి వస్తే, పూర్వం తిరువాంబురుగా ఆనాడు పిలువబడిన ఈ స్థలంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుని సంహరించిన తరువాత బ్రహ్మహత్యా దోష నివారణకై తపస్సు చేసుకొనుచుండగా, వారి చుట్టూ పుట్ట పెరిగి వెదురు పొదలు వ్యాపించాయి. అయితే అప్పటి పాండ్యభూపతి ఆ ప్రదేశంలో సంచరిస్తూ అక్కడ పెరిగిన వెదురుబొంగులను తన పల్లకీల కోసం నరకమని సేవకులను ఆజ్ఞాపించాడు.

అప్పుడు సేవకులు వెదురు బొంగులు నరుకుతుండగా ఆ స్వామివారి చేతులు కూడా కత్తివాటుకు తెగిపడి ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైనది. ఆ సమయంలో చక్రవర్తి వెదురు పొదలను తొలగించి త్రవ్వించి చూడగా అచట రెండు చేతులు ఖండించబడిన స్వయంభూస్వామి వారి విగ్రహం బయటపడింది.

ఇక ఈ ఆలయంలో స్వామివారు జ్యోతిరూపుడుగా దర్శనమిచ్చాడు. అందుకే ఇచట నేటికీ అఖండ దీపారాధన జరుగుచున్నది. తన పాప పరిహారార్థము స్వామివారి ఆజ్ఞచే క్రీ.శ. 630 లో చక్రవర్తి అచట ఆలయాన్ని కట్టించినట్లు స్థలపురాణం వివరిస్తుంది.

ఆలయంలోని గర్భగుడిలో 2 అడుగులు ఎత్తున మూలవిరాట్టుకు ఎడమవైపున నేటికీ స్వామివారి చేతులు తెగిన విగ్రహం కనిపిస్తుంది. ఇక ప్రత్యేక గర్బాలయంలో శ్రీ వల్లీదేవి, శ్రీ దేవసేనదేవి కొలువై ఉన్నారు. ఇచట గల వసంత మంటపము రెండు గుర్రాలచే లాగబడే రథం ఆకారంలో ఉంది. ఈ మండపంలో గల 64 స్థంభాలమీద రామాయణ, భారత, భాగవత, శివపురాణంలోని ఘట్టాలు చెక్కబడినవి.

ఇక్కడ భాద్రపదమాసంలో బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో నందిసేవ రోజున మాల్లాసుర యుద్దాన్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ కుజదోషం, సర్పదోషం, అనారోగ్యంగా ఉన్నవారు స్వామిచుట్టూ రోజుకు 108 ప్రదక్షిణలు 40 రోజుల పాటు చేస్తే విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Exit mobile version