Home Unknown facts Kadhilisthe kadhile shivalingam yekkada vundhi?

Kadhilisthe kadhile shivalingam yekkada vundhi?

0

మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో వెలసిన ఒక్కో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత అనేది ఉంది. అయితే ఈ ఆలయంలోని లింగానికి కూడా ఒక విశేషం అనేది ఉంది. అది ఏంటంటే ఇక్కడ శివలింగాన్ని కదిలిస్తే కదులుతుంది. మరి ఆ శివలింగం ఎక్కడ ఉంది? అలా శివలింగాన్ని కదిలించడం వెనుక గల కారణం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. shivalingamఆదిలాబాద్‌ జిల్లాలోని బేలమండలంలో సదల్‌పూర్‌ అనే గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో భైరందేవ్, మహాదేవ్‌ అనే ఆలయాలు ఉన్నాయి. భైరందేవ్‌ ఆలయంలో ఆదివాసీల దేవతామూర్తులు, మహదేవ్‌ ఆలయంలో శివలింగం ఉంటుంది. ఈ రెండు ఆలయాలను శాతవాహనులు నిర్మించారు. ఇవి పూర్తిగా నల్లరాతితో నిర్మించి శాతవాహనుల కళావైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఇప్పటికి అందమైన శిల్పాలు చెక్కుచెదరకుండా మనకు దర్శనమిస్తాయి. అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఆహ్లాదమైన వాతావరణంలో ఉండే ఈ ఆలయాలు ఎంతో ప్రాచీనం కలిగినవి. ఏటా పుష్యమాసంలో బైరందేవ్‌ పక్కనే ఉన్న మహదేవ్‌ ఆలయాల్లో జాతర నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ నిర్వహించే జాతరను జంగి జాతరగా పిలుచుకుంటారు. మండలంలోనే అతిపురాతన ఆలయాలుగా ఇవి నిలిచిపోయాయి.ప్రతి ఏటా పుష్యమాసం నవమి రోజున ప్రత్యేక అభిషేకాల ద్వారా జాతర ప్రారంభమవుతుంది. ఈ ఆలయాల్లో కొరంగే వంశీయులతోనే పూజలు ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తారు. వారంరోజుల పాటు కొనసాగి అమావాస్య రోజున కాలదహి హండి అనే కార్యక్రమం నిర్వహించి జాతర ముగిస్తారు.అయితే కాలదహి హండికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కుండలో పెరుగు వేసి, ఆలయం పైభాగంలో జెండా ఎగురవేస్తారు. అనంతరం ఆ కుండను పగలగొట్టి అందులోని పెరుగును కింద అప్పటికే ఉంచిన పాలు, కుడుకలు, అటుకులతో ఉన్న ప్రసాదంలో కలిసే విధంగా ఏర్పాటుచేస్తారు. ఇలా పెరుగుతో కలిసిన ఈ ప్రసాదాన్ని భక్తుల చేతులకు ఇవ్వకుండా ఆలయంపై నుంచి విసిరి వేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రసాదాన్ని భక్తులు ఎంతో ఆత్రుతగా అందుకుంటారు. ఈ జాతర 48 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. గత 24 ఏళ్ల నుంచి జాతర ముగింపు రోజు దర్బార్‌ నిర్వహిస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే, మనసులో ఏదైనా కోరుకుని ఈ ఆలయంలోని లింగాన్ని పైకి ఎత్తాలి. ఒకవేళ కనుక ఆ కోరిక తీరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుందని, లేదంటే ఆ శివలింగం కదలకుండా అలానే ఉంటుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయాల్లోని దేవతామూర్తులు ఆదివాసీల ఆరాధ్య దైవం అయినప్పటికి ఆదివాసీలే కాకుండా అన్ని ప్రాంతాల భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈవిధంగా ఈ ఆలయంలోని శివలింగాన్ని మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా అని లింగాన్ని కదిలించి ఒకవేళ కదిలితే వారి కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు తిరిగి వెళుతుంటారు.

Exit mobile version