Home Unknown facts దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం ఎలా వచ్చింది

దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం ఎలా వచ్చింది

0

అజ్ఞానాంధకారాన్ని తొలిగించి జ్ఞాన వెలుగులు చూపించే పండగే దీపావళి. అమావాస్య చీకటిని పారద్రోలి దీపాల వెలుగులో ఆనందాన్ని వెతుక్కునే ఈ పండగ వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినందుకు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని ఒక గాథ. మహాలయ పక్షంలో స్వర్గంనుంచి దిగివచ్చి భూలోకంలో తిరిగే పితృదేవతలు, ఈ రోజున పితృలోకానికి తిరిగి వెళతారని, వారికి వెలుతురు చూపించడం కోసం అలా ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందనేది మరో పురాణ కథనం.

శ్రీరాముడు రావణుని వధించాక సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్య చేరుకుని పట్టాభిషక్తుడయ్యాక ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకున్నారని, శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని సంహరించిన సందర్భంగా సంతోషంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని ఇలా అనేకరకాలైన కథనాలు ఉన్నాయి. కారణం ఏదైనా దీపావళి నాటి పర్వదినాన శ్రీమహాలక్ష్మిని పూజించడం మాత్రం ఆనవాయితీగా వస్తుంది.

అయితే సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీపావళి నాడు ఉదయం 5 గంటలలోపే అభ్యంగనస్నానం పూర్తిచేయాలి. దీన్ని స్వాత్యభ్యంగం అంటారు.. అంటే స్వాతి నక్షత్రం వెళ్లిపోయేలోపు చేసే స్నానం. అనంతరం మధ్యాహ్నం పూట పితృదేవ‌తారాధన చేయాలి.

సాయంత్రం సమయంలోనే పూజ చేయాలి. ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. రాత్రి జాగరణం చేయాలి.

లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత అలక్ష్మీ నిస్సరణం అంటే.. లక్ష్మీప్రదం కాని వస్తువులను దీపానికి చూపిస్తూ గౌరవంగా ఇంటి నుంచి పంపేయాలి. అర్థరాత్రి స్త్రీలు చేటలు, డిండిమలు, వాద్యములు వాయించుచు, అలక్ష్మిని తమయింటినుండి దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు. అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది.

విష్ణుమూర్తిని నరక చతుర్దశినాడూ, అమావాస్య మరునాడూ పాతాళంనుంచి వచ్చి తాను భూలోకాధికారం చేసేటట్లూ, ఈనాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శాశ్వతంగా ఉండవలెనని బలివరం కోరుకొన్నాడట. కావున భగవత్సంకీర్తనతో రాత్రి జాగరణం చేయాలి. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యులకాంతికి మించిందని శాస్త్రవచనం.

అదీకాక ఋతువులో మార్పు వలన గాలిలో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయి. అయితే ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరం, లక్ష్మీ ప్రదం. ఉదయం దీపం భగవంతుని కృతజ్ఞతలు తెలిపే దీపంగా చెబుతారు. సంధ్యాదీపం అంటే నూనెతో వెలిగించిన ప్రమిద, ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఉదయ దీపాన్ని దైవం దగ్గర, సంధ్యాదీపాన్ని ఇంటి ప్రధానద్వారపు గుమ్మం వద్ద వెలిగించి భక్తితో నమస్కరించాలి.

 

Exit mobile version