Home Unknown facts శ్రీకృష్ణుడి చేతిలో కొంగ రూపంలో హతమారిన రాక్షసుడు ఎవరో తెలుసా

శ్రీకృష్ణుడి చేతిలో కొంగ రూపంలో హతమారిన రాక్షసుడు ఎవరో తెలుసా

0

శ్రీహరి దశావతారాలలో పరిపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారం. సాక్షాత్తూ పరంధాముడే మానవుడిగా జీవించి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచింది రామావతారమైతే, మానవత్వంలో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారం. ‘యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత’ అని ప్రకటిస్తూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచినవాడు శ్రీకృష్ణుడు. అంతటి పరమాత్ముడు ఈ భూమిపై పాదంమోపిన పవిత్రదినం శ్రీకృష్ణ జన్మాష్టమి.

Lord Krishna Is The Reason For Killing The Bakasuraశ్రావణ మాసం సకల శుభాలను, పుణ్యాలను చేకూర్చే మాసం. అలాంటి శ్రావణమాసంలో ద్వాపరయుగాన, బహుళ పక్షం రోహిణీ నక్షత్రం అష్టమి తిథినాడు రెండో జాము వేళ చెరసాలలో దేవకి అష్టమ గర్భాన శ్రీకృష్ణుడు జన్మించాడు. గోకులాష్టమి, కృష్ణాష్టమి, అష్టమి రోహిణి… ఇలా రకరకాల పేర్లతో దేశమంతటా ఆ రోజును పండుగలా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమి తిథికి కొందరు ప్రాధాన్యం ఇస్తే, మరికొంతమంది రోహిణీ నక్షత్రానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ కారణాలవల్ల ఒకరోజు అటు ఇటుగా కృష్ణాష్టమి జరుపుకుంటారు.

పరమానందమే గోపాలుడి మార్గం. బృందావనంలో ఆలమందలు, గోపికలు, రాసక్రీడలు, మహిమలు ఇలా దేవకీ సుతుని లీలలకు అంతులేదు. అందుకే ఆయన యుగపురుషుడయ్యాడు. శ్రీకృష్ణుడేమీ అంతఃపురంలో పట్టుపరుపుల మీద పుట్టలేదు. చెరసాలలో పుట్టి నందనందనుడై గోకులానికి చేరాడు. గార్దభ కరుణాకటాక్షాలతో, యమున పారవశ్యంతో మధురను విడిచి రేపల్లెకు చేరిన శ్రీకృష్ణుడు యశోదకు ముద్దుల తనయుడయ్యాడు. పశువుల కాపరిగా మారి రేపల్లెను సంతోషాలసీమగా మార్చేశాడు.

పేదరికంలో పుట్టామని చింతించరాదని ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చునే సూక్ష్మాన్ని నేటి ఆధునిక యువతకు వివరించి చెబుతుంది కృష్ణుడి బాల్యం. కన్నయ్య లాంటి గడసరి, అల్లరి పిల్లవాడు తన కడుపున పుడితే బాగుండునని ప్రతి స్త్రీ ఆకాంక్షించేంత పరిపూర్ణమైనది ముద్దుకృష్ణుని బాల్యం.

ఇలా శ్రీకృష్ణ పరమాత్మ లీలలు గురించి తెలుసుకుంటుంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటుంది. నల్లనయ్య తన బాల్యంలో వుండగా ఒకనాడు పర్వతమంతటి ఆకారంలో ఉన్న కొంగ ఒకటి గోవులను, వాటిని కాస్తున్న గోప బాలురను మింగేస్తూ ఉండేది. చిన్నికృష్ణుడిని కూడా తన ముక్కున కరచుకుని మింగేందుకు ప్రయత్నించింది. ఐతే ఎంతకూ మింగుడు పడని కృష్ణుడిని బయటకు కక్కేసింది. మళ్లీ మరోసారి మింగేందుకు వస్తున్న ఆ కొంగను(బకాసురుడు) కృష్ణుడు ముక్కును పట్టుకుని విరిచి చంపేశాడు. దేవతలు కృష్ణునిపై పూలవర్షం కురిపించారు.

ఈ బకాసురుడు పూర్వజన్మలో హయగ్రీవుడనే రాక్షసుని కుమారుడైన ఉత్కళుడు. దేవేంద్రుడిని జయించి వంద సంవత్సరాలు ఇంద్ర పదవిలో ఉన్నటువంటివాడు. ఈ ఉత్కళుడు ఓసారి జాబాలి ఆశ్రమ ప్రాంతంలో చేపలను పట్టిన కారణంగా కొంగగా పుట్టేట్లు జాబాలి చేత శాపం పొందుతాడు. దీంతో ఉత్కళుడు పశ్చాత్తాపం చెందగా ద్వాపరాంతంలో కృష్ణుని చేత చంపబడి ముక్తిపొందుతావని పరిహారం చెపుతాడు. ఆ కారణంగా ఉత్కళుడు బకాసురుడుగా జన్మించి శ్రీకృష్ణుని చేతిలో హతుడవుతాడు.

 

Exit mobile version