పూర్వం ఒకానొక సందర్భంలో దనవుడి కొడుకులు రంభుడూ, కరంభుడూ అనేవాళ్ళు తమకు పిల్లలు లేని కారణంగా చాలాకాలం తీవ్ర తపస్సు చేసారు. కరంభుడు పంచనద తీర్థంలో మునిగి తపస్సు చేసాడు. రంభుడు ఒక చెట్టుమీద ఎక్కి కూర్చొని తపస్సు చేసాడు.
తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని ఇంద్రుడు మొసలిరూపంలో పంచనదంలో ప్రవేశించి, కరంభుణ్ణి చంపేశాడు. తన తమ్ముడి చావుకు రంభుడు శోకావేశంతో అగ్నిహోత్రుడికి తన తల అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు. అప్పుడు అగ్ని ప్రత్యక్షమై, ‘‘ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు? దానివల్ల ఇహమా, పరమా? నీ తపస్సు చూసి నేను సంతోషించాను. కోరుకో, వరం ఇస్తాను,” అన్నాడు. ‘‘దేవా, నీకు నామీద అనుగ్రహం ఉంటే నాకు అజేయుడైన ఒక కొడుకును ప్రసాదించు వాడు కామరూపీ, దేవతలకుగానీ, దానవు లకుగానీ, జయించరానివాడుగా ఉండాలి,” అన్నాడు రంభుడు.
‘‘అలాగే అవుతుంది,” అని అగ్ని హోత్రుడు అదృశ్యమయ్యాడు. రంభుడు తిరిగి వస్తూ, యక్షుల అధీనంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక గేదెను చూశాడు. ఆ మహిషి అతని వెంట పాతాళానికి వచ్చేసింది. అక్కడ ఆ మహిషిని మరొక మహిషం వెంబడించింది. అదిచూసి రంభుడు ఆగ్రహావేశంతో దాన్ని కొట్టాడు. ఆ మహిషం (దున్నపోతు) రంభుణ్ణి తన కొమ్ములతో పొడిచి పైకెత్తి, చంపేసింది.
అది చూసి మహిషి రంభుడితోపాటు చితిమంటలలో కాలిపోయింది. ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలువడ్డారు. ఒకడు మహిషుడు. ఇంకొకడు రక్తబీజుడు.రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎన్నుకున్నారు. మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సుచేసి, బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, ‘‘మహాత్మా, నాకు చావు లేకుండా చెయ్యి,” అని వరం కోరాడు. దానికి బ్రహ్మ, ‘‘పుట్టినవాళ్ళంతా చావక తప్పదు, చచ్చినవాళ్ళు పుట్టకా తప్పదు.
చావకుండానీకు వరం ఎలా ఇవ్వగలను? భూమికీ, సముద్రానికీ, కొండలకు సైతం నాశనం ఉంది కదా! చచ్చిపోవడానికి అవకాశం వదిలి వరంకోరుకో, అలాగే ఇస్తాను,” అన్నాడు. అప్పుడు మహిషుడు, ‘‘ ఆడది ఎలాగూ నన్ను చంపలేదు కాబట్టి, దేవతలలోగాని, దానవులలోగాని, మానవులలోగాని ఏ పురుషుడి చేత నాకు చావు లేకుండా అనుగ్రిహించు,” అని బ్రహ్మను కోరాడు. ‘‘అలాగే, కాని నీకు ఎప్పటికైనా స్ర్తీ మూలం గానే చావు వస్తుంది,” అని బ్రహ్మ వెళ్ళి పోయాడు.
ఈ వరంపొంది ఉన్న మదంతో మహి షుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఒక సేవకుణ్ణి పిలిచి, ఇంద్రుణ్ణి హెచ్చరించి రమ్మని పంపాడు. వాడు వెళ్ళి ఆమాట ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు ఆవేశంతో దిక్పాలకులను సమావేశపరచి, వారితో ఇలా అన్నాడు. ‘‘రంభుడికొడుకు మహిషుడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన మదంతో యుద్ధానికి సేనలను సన్నద్ధంచేస్తూ, ప్రగల్భాలు పలుకుతున్నాడు. చివరికి దుర్గా మాత చేతిలో హతమయ్యాడు.