లక్ష్మీదేవి మరో అవతారం అలమేలు మంగ అని చెబుతారు. అయితే పురాణం ప్రకారం అలిగిన లక్ష్మీదేవి ఈ ప్రాంతానికి వచ్చినది అని ఇక్కడ అలిమేలు మంగగా అవతరించిందని చెప్పబడింది. మరి ఈ అమ్మవారు వెలసిన ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తిరుపతికి సమీపంలో తిరుచానూరు గ్రామం లో శ్రీ వేంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ అమ్మవారు వెలసిన ఈ గ్రామాన్ని అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఊరిపేరు చిరుతానురుఅని చాలా కాలం పిలువబడుతూ తర్వాత తిరుచానూరు గా మారిపోయింది.
ఇక పురాణానికి వస్తే, త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నగా, తన నివాస స్థానాన్ని అవమానించినందుకు లక్ష్మీదేవి అలిగి కోల్హా పూర్ వెళ్ళింది. అయితే అప్పుడు సిరిలేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో సంచరిస్తూ 12 సంవత్సరాలపాటు తపస్సు చేసాడు. ఆ స్వామి తపస్సుకి ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమినాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతో వివాహమాడాడు. అలమేలుమంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజాలు, రెండు చేతులతో పద్మాలు ధరించి, మరో రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఇంకా ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.
ఇలా అలమేలుమంగ వెలసిన ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తూ అమ్మవారిని దర్శిస్తుంటారు.