Home Unknown facts శ్రీ నాగేశ్వరస్వామి కొలువై ఉన్న అతి ప్రాచీన ఆలయం గురించి తెలుసా?

శ్రీ నాగేశ్వరస్వామి కొలువై ఉన్న అతి ప్రాచీన ఆలయం గురించి తెలుసా?

0

గంగా పార్వతి సమేత శ్రీ నాగేశ్వరస్వామి కొలువై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీన ఆలయం అని చెబుతారు. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

NageshwaraSwamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామంలో గంగా పార్వతి సమేత శ్రీ నాగేశ్వరస్వామి వారు కొలువై ఉన్నారు. అయితే పూర్వం ఈ గ్రామం తామ్రపూరి గా పిలువబడింది. క్రీ.శ. 1213 లో కాకతీయ గణపతి మహారాజు ఈ తామ్రపురిని జయసేనాపతికి దానం చేసినట్లు ఒక శాసనం ద్వారా తెలియుచున్నది. ఇక్కడ పల్లవ రాజుల ద్వారా శైవం బాగా బలపడినట్లు తెలియుచున్నది.

తూర్పు చాళుక్య భీముడు పొన్నూరులో శ్రీ భీమేశ్వరాలయమును నిర్మించి శైవానికి విశిష్టతను చేకూర్చాడు. క్రీ.శ. 14 వ శతాబ్దంలో ఈ ఉరి గ్రామ పెద్దలుగా ఉన్న ముర్తాన్న, కంటెన్నా అనే అన్నదమ్ములు ఈ ఆలయం నిర్మించినట్లు ఈ ఆలయంలో ఉన్న ఒక శాసనం ద్వారా తెలుస్తుంది.

ఇక ఆలయ విషయానికి వస్తే, ఆలయ ప్రాగణం ఐదు అంతస్థుల గాలిగోపురం ఈ చుట్టూ పక్కల ప్రాంతంలో ఉన్న అనేక ఆలయ గోపురాలన్నిటిలోకి ఎత్తైనదిగా కనబడుతుంది. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండి గర్భాలయం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలుగా నిర్మించబడి ఉన్నది.

గర్భాలయంలో శ్రీ నాగేశ్వరుడు ప్రతిష్ట కావించబడి ఉన్నాడు. అంతరాలయం ఎడమ భాగాన పార్వతీదేవి, కుడిభాగాన గంగామల్లేశ్వరుడు, మండపమునందు నందీశ్వరుడు ప్రతిష్టించబడి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక మండపంలో నవగ్రహమూర్తులు కొలువై ఉన్నారు. ఈ నాగేశ్వరాలయానికి బయట, రాజగోపురానికి కుడివైపున ఉన్న ఒక మంటపంలో సుమారు ఐదు అడుగుల ఎత్తు, ఆరు అడుగుల పొడవు ఉన్న నందీశ్వరుని విగ్రహం ఉంది.

ఈ మండపం మొత్తం ఎర్ర ఇసుక రాతి నిర్మాణం, మంటపంలో ఉన్న నందివిగ్రహం కూడా ఎర్రరాతితో చెక్కిన ఏకశిలా శిల్పమే. ఈ నందీశ్వరుని విగ్రహం వీపు మీద, మెడ దగ్గర, నుదుటి మీద చూడముచ్చటగా ఉండే నగిషీలు, జాలరి పనులు అధ్బుతంగా చెక్కబడినాయి. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.

 

Exit mobile version